భారత ఆర్థిక వ్యవస్థకు జీవనాడిగా నిలుస్తున్న దేశీయ బ్యాంకింగ్ వ్యవస్థపై సామాన్య ప్రజలకు నమ్మకం సడలిపోతోందన్న వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయి. డిపాజిట్ల సేకరణ ప్రభుత్వరంగ బ్యాంకులకు అతిపెద్ద సవాల్‌గా మారింది. 2016లో జరిగిన పెద్దనోట్ల రద్దు తదనంతర పరిణామాలలో బ్యాంకులలో తాము దాచుకున్న డబ్బును సకాలంలో వెనక్కు తీసుకోలేకపోయిన రైతులు, మధ్యతరగతి వర్గాల వారు తమ పొదుపును బ్యాంకుల్లో డిపాజిట్ చేయడానికి సంశయిస్తున్నారు. బ్యాంకుల వడ్డీరేట్లు గణనీయంగా తగ్గిపోవడం, కొన్ని జాతీయ బ్యాంకులు ఉదారంగా కొంతమంది పారిశ్రామిక వేత్తలకు ఇచ్చిన రూ. వేల కోట్ల మొండి బకాయిలుగా మారాయన్న సమాచారంతో ప్రభుత్వరంగ బ్యాంకుల విశ్వసనీయతపై అనుమానాలు కలుగుతున్నాయి.
1990వ దశకంలో దేశంలో ఆర్థిక సంస్కరణలను ప్రవేశపెట్టే ముందువరకూ అటు ప్రభుత్వరంగ బ్యాంకులు, ఇటు గ్రామీణ బ్యాంకులు.. సామాన్య ప్రజలకు చేరువై ఆర్బీఐ నియంత్రణతో ఆర్థికంగా, పరిపుష్టిగానే ఉన్నాయి. బ్యాంకుల నిరర్థక ఆస్తులు సైతం నామమాత్రమే. అయితే, ప్రధాని పీవీ నరసింహారావు నేతృత్వంలో మొదలైన ఆర్థిక సంస్కరణలు దేశ బ్యాంకింగ్ రంగ ముఖ చిత్రాన్ని పూర్తిగా మార్చివేశాయి. ప్రైవైటు రంగ బ్యాంకుల నుండి ఎదురయిన పోటీని తట్టుకోవడానికి ప్రభుత్వరంగ బ్యాంకులు సైతం వ్యవస్థాగతంగా అనేక మార్పులు చేసుకొన్నాయి. స్టాక్ మార్కెట్ నుండి నిధులు సమీకరించి పెద్ద ఎత్తున రుణ వితరణ కార్యకలాపాలు చేపట్టాయి. అయితే, ఆక్రమంలో కొన్ని ప్రభుత్వరంగ బ్యాంకులు అధిక వడ్డీకి ఆశపడి ఊరు పేరులేని కంపెనీలకు రుణాలందించాయి. బ్యాంకుల నుండి రుణాలు పొంది.. వాటిని ఎగ్గొట్టొచ్చనే భావన క్రమంగా బలపడటానికి కారణం.. మొండి బకాయిల పేరుతో.. కేంద్ర ప్రభుత్వం వాటిని రద్దు చేయడం. ఒక అంచనా ప్రకారం గత 70 సంవత్సరాలలో దాదాపు 10 లక్షల కోట్లకుపైగా బ్యాంకుల మొండి బకాయిలను కేంద్ర ప్రభుత్వాలు రద్దు చేశాయి. దీంతో.. దేశంలో నష్టాలు రాకున్నా రుణాలు పొంది ఎగవేసే వాళ్లు పుట్టుకొచ్చారు.
గత ఏడాది పార్లమెంట్‌లో ప్రభుత్వం చేసిన ప్రకటన ప్రకారం.. విల్‌ఫుల్ డిఫాల్డర్లు దాదాపు 55 వేల కోట్లకు బ్యాంకులకు ఎగనామం పెట్టారు. విజయ్‌మాల్యా, నీరవ్ మోదీ, మెహుల్ చోక్సీ మొదలైన కార్పొరేట్ దిగ్గజాల పేరును చూసి ప్రభుత్వ రంగ బ్యాంకులు రుణాలు అందించినట్లుగానే కనపడుతుంది గానీ.. వారి సంస్థల పనితీరును కనీస స్థాయిలో కూడా పరిగణనలోకి తీసుకోలేదని తెలుస్తుంది. ఇటీవల కేంద్రమంత్రి శ్రీమతి నిర్మలా సీతారామన్ పేర్కొన్నట్లు ‘‘నాయకులు ఫోన్లు చేస్తే కొన్ని జాతీయ బ్యాంకులు రుణాలు అందించాయి’’. బ్యాంకు రుణాలను ఎగవేసిన డిఫాల్టర్లు దర్జాగా దేశం దాటిపోతుంటే.. ప్రభుత్వాలు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించాయి. ఫలితంగానే, ప్రభుత్వరంగ బ్యాంకుల మొండి కాయిలు అంతకంతకూ పెరిగి జూన్ 30, 2014 నాటికి (యూపీఏ పరిపాలన ముగిసిన నాటికి) రూ. 2,24,542 కోట్లు చేరాయి. కాగా, ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక కూడా పరిస్థితిలో మార్పు రాలేదు సరికదా.. ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్థక ఆస్తుల మొత్తం ఆరేళ్లలో దాదాపు 4 రెట్లు పెరిగాయి. 2018 డిసెంబర్ నాటికి ప్రభుత్వరంగ బ్యాంకుల నిరర్థ్ధక ఆస్తులు రూ. 8,64,433 కోట్లకు చేరాయి.
నరేంద్రమోదీ నేతృత్వంలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినాక.. దేశంలోని యువతకు స్వయం ఉపాధి కల్పించడానికి అవసరమైన పెట్టుబడిని అతితక్కువ వడ్డీతో అందించాలన్న గొప్ప లక్ష్యంతో ప్రారంభించబడిన పథకం.. ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’. కారణం బ్యాంకుల ద్వారా లభించే ‘ముద్ర’ రుణాలతో కోట్లాది మందికి ఉపాధి అందించే సూక్ష్మ, కుటీర రంగ పరిశ్రమలు ఇబ్బడిముబ్బడిగా ఏర్పాటవుతాయని అంచనా వేయడం జరిగింది. పెరుగుతున్న నిరుద్యోగితకు ఇది పరమౌషధంగా పని చేస్తుందని ఆర్థిక వేత్తలు కూడా భావించారు. ‘ముద్ర’ పథకం ద్వారా రుణాలు పొందడానికి ష్యూరిటీలు, గ్యారెంటీలు, ప్రాసెసింగ్ రుసుములు వంటివి లేకుండా.. తక్కువ వడ్డీతో సాయం అందించే పథకం కావడంతో.. ‘ముద్ర’ పథకం దేశ ఆర్థిక వ్యవస్థలో కీలకం కానున్నదని అందరూ ఆశిం చారు. అయితే, ఈ పథకంలో రాష్ట్ర ప్రభుత్వాలకు భాగస్వామ్యం లేదు. బ్యాంకులు రుణాలు అందించడానికి య«థావిధిగా పూచీకత్తులు, ఆస్తుల తనఖా వంటివి అడుగుతున్నాయి. బడా పారిశ్రామిక వేత్తలకు రెడ్ కార్పెట్ పరిచి.. ఎటువంటి పూచీకత్తులు లేకున్నా.. వందల వేల కోట్లు మేర రుణాలు అందిస్తున్న ప్రభుత్వరంగ బ్యాంకులు.. ‘ప్రధానమంత్రి ముద్ర యోజన’ పథకాన్ని కూడా చతికిలపడేట్లు చేశాయి.
ప్రభుత్వరంగ బ్యాంకుల్లో వెలుగు చూస్తున్న మోసాలు, పెరిగిపోతున్న వాటి నిరర్థక ఆస్తుల నేపథ్యంలో.. అవి స్వేచ్ఛగా పని చేయలేకపోతున్నాయన్నది నిజం. ప్రభుత్వ రంగ బ్యాంకులపై రిజర్వ్ బ్యాంకు నియంత్రణతో పాటు వాటిని కేంద్ర విజిలెన్స్ కమిషన్ పరిధిలోకి తేవడంతో.. బ్యాంకర్లు రుణాల్ని నిర్భీతిగా ఇవ్వలేకపోతున్న పరిస్థితి కూడా దాపురించింది. ఏదైనా జరిగితే.. తమ మెడకు ఎక్కడ చుట్టుకుంటుందోనని భయపడుతూ.. ప్రాధాన్యతా రంగాలకు సైతం రుణాలివ్వడానికి బ్యాంకర్లు సంశయిస్తున్నారు. సంస్థాగత రుణాలు పొందుతున్న గ్రామీణ కుటుంబాల సంఖ్య సగటున 20% దాటడం లేదని నాబార్డు జాతీయ ఆర్థిక సమ్మిళిత అధ్యయనం (2016–17) పేర్కొంది. పలు రాష్ట్రాల్లో రుణమాఫీ పథకాల వల్ల పంట రుణాల పంపిణీ పడిపోయింది. రుణమాఫీ పథకాలకు రాష్ట్ర ప్రభుత్వాలు సకాలంలో నిధులు సమకూర్చడం లేదు. ప్రభుత్వం మాఫీ చేసిందనుకొని రైతులు బకాయిలు కట్టడం లేదు. దీంతో.. రైతులను బ్యాంకులు ‘ఎగవేతదారుల జాబితా’లో చేరుస్తున్నాయి. దేశ జనాభాలో అత్యధిక శాతంగా ఉన్న పేద, మధ్యతరగతి ప్రజల ఆర్థికావసరాలను తీర్చడానికి ప్రభుత్వ రంగ బ్యాంకులు నిస్వార్థంగా పనిచేసినప్పుడే ఆర్థిక వ్యవస్థ పటిష్టవంతం అవుతుంది. ఒకప్పుడు ఆర్థిక జీవనాడులుగా పనిచేసిన ప్రభుత్వ బ్యాంకులు నేడు కష్టాల ఊబిలో కూరుకుపోవడానికి కారణం స్వయంకృతమే. తగిన నియంత్రణ, పర్యవేక్షణలతోపాటు.. ప్రాధాన్యతలను పాటిస్తేనే ప్రభుత్వరంగ బ్యాంకుల పట్ల సామాన్య ప్రజలకు తిరిగి విశ్వాసం ఏర్పడుతుంది. దేశంలో బ్యాంకింగ్ వ్యవస్థ బలహీనపడితే దానిని మించిన ఆర్థిక సంక్షోభం మరొకటి ఉండబోదు.
డా‘‘ ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు
(వ్యాసకర్త ఎమ్మెల్సీ, కేంద్ర మాజీ మంత్రి, చీఫ్ విప్, ఏపీ శాసనమండలి)
Comments
Please login to add a commentAdd a comment