న్యూఢిల్లీ: క్రిప్టో కరెన్సీలు ఆర్థిక వ్యవస్థకు ముమ్మాటికీ ప్రమాదమేనని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ స్పష్టంచేశారు. అంతర్లీనంగా ఎటువంటి పటిష్టతా లేకుండా కేవలం విశ్వాసం, ఊహాగానాల ఆధారంగా విలువను పొందే ఏ ఇన్‌స్ట్రమెంటైనా అది చివరకు తీవ్ర అనిశ్చితికే దారితీస్తుందని ఆయన స్పష్టం చేశారు. ఆర్‌బీఐ గురువారం విడుదల చేసిన 25వ ఫైనాన్షియల్ స్థిరత్వ నివేదిక (ఎఫ్‌ఎస్‌ఆర్) విడు దల సందర్భంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. నివేదికలో మరిన్ని ముఖ్యాంశాలు పరిశీలిస్తే...
► అంతర్జాతీయంగా అధిక ద్రవ్యోల్బణం కొనసాగే అవకాశం ఉంది. రష్యా–ఉక్రెయిన్ ఉద్రిక్తతల ప్రభా వం ఎకానమీలపై ఉంటుంది. కొన్ని సవాళ్లు ఉన్నప్పటికీ, భారత్ ఎకానమీ రికవరీ బాటలో పయనిస్తోంది. ఎటువంటి సవాళ్లనైనా తట్టుకోడానికి వీలుగా బ్యాంకులు, నాన్ బ్యాంకింగ్ ఫైనాన్స్ కంపెనీలు పటిష్ట మూలధనాన్ని కొనసాగిస్తున్నాయి.
► 2021లో అంతర్జాతీయ వాణిజ్య పరిమాణం 10.1 శాతం పెరిగితే 2022లో ఇది 5 శాతానికి పడిపోతుందని అంచనా.
► దేశీయంగా బ్యాంకింగ్ మొండిబకాయిల నిష్పత్తి మార్చిలో ఆరేళ్ల కనిష్టం 5.9 శాతానికి పడిపోయింది. 2023 మార్చి నాటికి మొండిబకాయిలు 5.3 శాతానికి దిగివస్తాయని భావిస్తున్నాం. ► రూపాయి తీవ్ర ఒడిదుడుకులను ఎదుర్కొనడానికి ఆర్‌బీఐ తగిన అన్ని చర్యలూ తీసుకుంటుంది. దీర్ఘకాలంలో రూపాయి స్థిరత్వం ఆర్‌బీఐ లక్ష్యం.
► మార్చితో ముగిసిన గత ఆర్థిక సంవత్సరంలో భారత్ విదేశీ రుణ భారం 47.1 బిలియన్ డాలర్లు పెరిగి, 620.7 బిలియన్ డాలర్లకు చేరింది. అయితే జీడీపీ నిష్పత్తిలో చూస్తే 2021 మార్చిలో 21.2%గా ఉంటే, 2022 మార్చిలో 19.9%కి తగ్గింది.
► పరిశ్రమకు రుణ వృద్ధి మే 2022లో 8.7 శాతానికి పెరిగింది. వ్యవసాయం, అనుబంధ కార్యకలాపాలకు సంబంధించి ఈ రేటు 11.8 శాతం పెరిగింది. పరిశ్రమకు రుణ వృద్ధి 2021 మేలో కేవలం 0.2 శాతం కావడం గమనార్హం.
► అత్యవసర రుణ హామీ పథకం (ఈసీఎల్‌జీఎస్) వినియోగంలో ప్రైవేట్ రంగ బ్యాంకులు... ప్రభుత్వ రంగ సంస్థల కంటే ఎక్కువ ఆసక్తిని ప్రదర్శిస్తున్నాయి.
క్రిప్టో కరెన్సీతో ముమ్మాటికీ ప్రమాదమే
Published Fri, Jul 1 2022 3:01 AM | Last Updated on Fri, Jul 1 2022 3:01 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment