ఆహార ధరల పెరుగుదలే ప్రధాన ఆందోళన | Possible 2nd round shock of food price rise on inflation prompted RBI to keep repo unchanged | Sakshi
Sakshi News home page

ఆహార ధరల పెరుగుదలే ప్రధాన ఆందోళన

Published Fri, Aug 25 2023 3:37 AM | Last Updated on Fri, Aug 25 2023 3:37 AM

Possible 2nd round shock of food price rise on inflation prompted RBI to keep repo unchanged - Sakshi

ముంబై: ఆహార ధరల పెరుగుదలే వ్యవస్థలో ప్రధాన ఆందోళనకర అంశమని రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఆర్‌బీఐ) గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ అభిప్రాయపడింది. ఈ పరిస్థితిలో కఠిన ద్రవ్య విధానవైపే మొగ్గుచూపాలని ప్రస్తుతానికి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (6.5 శాతం) యథాతథంగానే కొనసాగించాలని ఎండీ పాత్ర, శశాంక భిడే, అషిమా గోయల్, జయంత్‌ ఆర్‌ వర్మ, రాజీవ్‌ రంజన్‌లతో సహా మొత్తం ఆరుగురు సభ్యులు ఓటు వేశారు.

ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకూ జరిగిన ఆర్‌బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష మినిట్స్‌ గురువారం విడుదలయ్యాయి.  ‘మా పని (ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం) ఇంకా ముగియలేదు. కూరగాయలు తదితర ఆహార పదార్థాల ధరల ప్రాతిపదికన మొదటి రౌండ్‌ ద్రవ్య విధాన నిర్ణయాలు ఉంటాయి. అదే సమయంలో, విస్తృత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణం అంచనాలు, ఆందోళనల ప్రాతిపదికన రెండవ–రౌండ్‌ ప్రభావాన్ని ముందస్తుగా తొలగించడానికి మేము సిద్ధంగా ఉండాలి. దీనికి తక్షణం కఠిన విధానమే సరైందని కమిటీ భావిస్తోంది’’ అని దాస్‌ సమావేశంలో అభిప్రాయపడ్డారు.    

2022 నుంచి 250 బేసిస్‌ పాయింట్లు పెంపు
ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్‌ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్‌ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్‌బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్‌ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది.

అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల సమీక్షసహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్‌బీఐ పెద్దపీట వేసింది. అయితే ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే (రేటు పెంపు) మొగ్గుచూపుతామని కూడా ఆయా సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచి్చంది. ఇదే విషయాన్ని ఈ నెల తాజా సమీక్షా సమావేశం అనంతరం కూడా ఆర్‌బీఐ గవర్నర్‌ పునరుద్ఘాటించారు.  తాజాగా వెలువడిన మినిట్స్‌ కూడా ఇదే విషయాన్ని సూచించింది.  

అంచనాలకు అనుగుణంగానే...
ఆర్‌బీఐ ఆందోళనకు అనుగుణంగానే  పాలసీ తదనంతరం వెలువడిన జూలై నెల ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చడం గమనార్హం. ఆర్‌బీఐ కీలక ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం జూలైలో ఏకంగా 7.44 శాతంగా (2022 ఇదే నెల ధరలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. గడచిన 15 నెలల్లో ఈ స్థాయి రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి.

సూచీలో కీలక విభాగాలైన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు తీవ్రంగా పెరగడం దీనికి కారణం. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్‌ ద్రవ్యోల్బణం ప్లస్‌ లేదా మైనస్‌తో  4 శాతం వద్ద ఉండాలి. అంటే అప్పర్‌ బ్యాండ్లో 6 శాతం అధిగమిస్తే... దానిని ఎకానమీలో డేంజర్‌ బెల్సా్గ పరిగణించాల్సి ఉంటుంది. జూలైలో  అంకెలు ఈ స్థాయిని అధిగమించడం గమనార్హం. 2022 జూలైలో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.71 శాతం ఉంటే, ఈ ఏడాది జూన్‌లో  4.87గా నమోదయ్యింది.

జూలైలో మళ్లీ తీవ్ర రూపం దాలి్చంది. వినియోగ ధరల సూచీలో కీలక విభాగాలు చూస్తే.. ఒక్క ఫుడ్‌ బాస్కెట్‌ ద్రవ్యోల్బణం జూలైలో 11.51%గా నమోదయ్యింది. జూన్లో ఈ రేటు 4.55%. జూలై 2022లో ఈ రేటు 6.69%గా ఉంది. ఒక్క కూరగాయల ధరలు జూలై లో ఏకంగా 37.43% ఎగశాయి. తృణ ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు 13 శాతం పెరిగాయి.  

కీలక అంచనాలు ఇవీ...
వృద్ధి తీరు:  2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని ఆర్‌బీఐ అంచనావేస్తుండగా, క్యూ1లో 8%, క్యూ2లో 6.5%, క్యూ3లో 6%, క్యూ4లో 5.7 శాతంగా అంచనా. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6%గా అంచనా.
ద్రవ్యోల్బణం ధోరణి: 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ2లో  6.2%, క్యూ3లో 5.7%, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతం.  
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement