ఆర్‌బీఐ మూడో‘సారీ’.. | RBI monetary policy: RBI keeps repo rate unchanged at 4per cent | Sakshi
Sakshi News home page

ఆర్‌బీఐ మూడో‘సారీ’..

Published Sat, Dec 5 2020 1:13 AM | Last Updated on Sat, Dec 5 2020 5:41 AM

RBI monetary policy: RBI keeps repo rate unchanged at 4per cent - Sakshi

ముంబై: అంచనాలకు అనుగుణంగానే రిజర్వ్‌బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా పరపతి విధాన కమిటీ (ఆర్‌బీఐ–ఎంపీసీ) ప్రధాన నిర్ణయం వెలువడింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 4 శాతంగానే కొనసాగించాలని గవర్నర్‌ శక్తికాంతదాస్‌ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల కమిటీ ఏకగ్రీవంగా నిర్ణయించింది. వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్‌ ద్రవ్యోల్బణం తీవ్రతను దీనికి కారణంగా చూపింది. ఆర్‌బీఐకి కేంద్రం ఇస్తున్న నిర్దేశాల ప్రకారం రిటైల్‌ ద్రవ్యోల్బణం 4% స్థాయిలో ఉండాలి. అయితే దీనికి మించి కొనసాగుతోంది.  

క్యూ4లో 5.8 శాతానికి ద్రవ్యోల్బణం!
అక్టోబర్‌–డిసెంబర్‌ (క్యూ3), జనవరి–మార్చి (క్యూ4)  కాలాల్లో ద్రవ్యోల్బణం వరుసగా 6.8 శాతం, 5.8 శాతానికి దిగివస్తుందని ఆర్‌బీఐ అంచనావేసింది. ఈ అంచనాల నేపథ్యంలో సరళతర వడ్డీరేట్ల విధానమే కొనసాగించడం జరుగుతుందని స్పష్టం చేసింది. తద్వారా ద్రవ్యోల్బణం తగ్గితే వడ్డీరేట్లూ మరింత దిగివస్తాయని సూచించింది. ఆగస్టులో రిటైల్‌ ద్రవ్యోల్బణం 6.7 శాతంగా ఉంటే, సెప్టెంబర్‌లో ఎనిమిది నెలల గరిష్టం 7.27 శాతానికి పెరిగింది.

అకాల వర్షాలు, కార్మికుల కొరత, సేవల వ్యయాల తీవ్రత, అధిక కమోడిటీ ధరలు, పన్నులు, సరఫరాల్లో సమస్యల వంటి పలు సమస్యలు టోకు, రిటైల్‌ ధరల పెరుగుదలకు కారణాలని ఆర్‌బీఐ పాలసీ సమీక్ష విశ్లేషించింది. ఈ ఏడాది మార్చి తరువాత 115 బేసిస్‌ పాయింట్ల (100 బేసిస్‌ పాయింట్లు 1%) రెపోరేటు తగ్గించిన ఆర్‌బీఐ, రిటైల్‌ ద్రవ్యోల్బణం ఇబ్బందులతో ఆగస్టు, అక్టోబర్‌ నెలల్లో జరిగిన  ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమావేశాల్లో యథాతథ రేటును కొనసాగించింది. అయితే ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న విశ్లేషణ చేస్తున్న ఆర్‌బీఐ, సరళతర పరపతి విధానాన్నే పాటించడానికి మొగ్గుచూపుతోంది. ఇక రెపో రేటు తగ్గించని నేపథ్యంలో.. రివర్‌ రెపో రేటు (బ్యాంకులు తన వద్ద డిపాజిట్‌చేసే అదనపు నిధులపై ఆర్‌బీఐ చెల్లించే వడ్డీరేటు) కూడా యథాపూర్వం 3.35 శాతంగానే కొనసాగనుంది.

డిపాజిటర్లకు ఊరట
ఆర్‌బీఐ పాలసీ కమిటీ తాజా నిర్ణయం ప్రకారం, రుణ గ్రహీతలకు ఈజీ మంత్లీ ఇన్‌స్టాల్‌మెంట్ల (ఈఎంఐ)ల భారం తగ్గే అవకాశాలు తక్కువ. అయితే ఇది డిపాజిట్లకు ఊరటనిచ్చే అంశం. బ్యాంకులు ఎఫ్‌డీలపై తదుపరి వడ్డీరేట్లు తగ్గించే అవకాశాలు లేవు. ఇప్పటికే ఏడాది ఆపైన కాలపరిమితుల స్థిర డిపాజిట్‌ రేటు 4.90–5.50% శ్రేణిలో ఉన్నాయని,  ప్రస్తుత ద్రవ్యోల్బణంతో పోల్చితే ఇది నెగెటివ్‌ రిటర్న్స్‌ అనీ ఆర్థిక వేత్తలు పేర్కొంటున్నారు.  వడ్డీరేట్లు మరింత తగ్గి, ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంటే అది పొదుపులు, డిపాజిట్లు, కరెంట్‌ అకౌంట్లపై ప్రతికూల ప్రభావం చూపి సమీపకాలంలో వృద్ధికి విఘాతం కలిగిస్తుందని విశ్లేషిస్తున్నారు. ఫైనాన్షియల్‌ వ్యవస్థలో డిపాజిటర్ల ప్రయోజనాల పరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు ఆర్‌బీఐ పాలసీ ప్రకటన స్పష్టం చేసింది.  

ద్రవ్య లభ్యతకు లోటుండదు
ఆర్థిక వ్యవస్థలో లిక్విడిటీ (ద్రవ్యలభ్యత)కు ఎటువంటి ఇబ్బందీ లేకుండా చర్యలు ఉంటాయని ఆర్‌బీఐ భరోనాను ఇచ్చింది. ఇందుకు అవసరమైన సమయంలో అన్ని చర్యలూ తీసుకుంటామని స్పష్టం చేసింది. కార్పొరేట్‌ బ్యాండ్స్‌ మరింత విస్తరించడానికీ చర్యలు ఉంటాయని తెలిపింది.

ఆర్థిక వ్యవస్థ పురోగతి
2020–21 ఆర్థిక సంవత్సరంలో స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) క్షీణత 9.5 శాతం ఉంటుందని ఆర్‌బీఐ తాజా సమీక్షలో అంచనా వేసింది. మొదటి త్రైమాసికంలో స్థూల జీడీపీ భారీగా 23.9 శాతం క్షీణత దీనికి నేపథ్యం. అయితే ఈ అంచనాలను తాజాగా 7.5 శాతానికి మెరుగుపరిచింది. అలాగే గత సమీక్ష సందర్భంగా నాల్గవ  త్రైమాసికంలోనే స్వల్ప వృద్ధి రేటు (0.5%) నమోదవుతుందని పేర్కొంది. తాజాగా ఈ అంచానాలనూ మెరుగుపరిచింది. మూడో త్రైమాసికంలో (అక్టోబర్‌–డిసెంబర్‌) 0.1%, నాలుగో త్రైమాసికంలో (జనవరి–మార్చి) 0.7% వృద్ధి రేట్లు నమోదవుతాయని పేర్కొంది. అక్టోబర్‌ పాలసీ సమీక్షలో డిసెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ 5.6% క్షీణత నమోదవుతుందని అంచనావేసింది. సెప్టెంబర్‌ త్రైమాసికంలో జీడీపీ క్షీణత అంచనాలకన్నా మెరుగ్గా 7.5%గా నమోదుకావడం తెలిసిందే.

నగదు వినియోగం తగ్గింపు చర్యలు
కాంటాక్ట్‌లెస్‌ కార్డ్‌ లావాదేవీ పరిమితి పెంపు  
కాంటాక్ట్‌లెస్‌ కార్డ్‌ లావాదేవీ పరిమితిని ప్రస్తుతం ఉన్న రూ.2,000 నుంచి రూ.5,000కు పెంచుతూ పాలసీ కీలక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్‌ 14వ తేదీ నుంచీ తాజా నిర్ణయం అమల్లోకి వస్తుంది.

నిరంతరాయంగా ఆర్‌టీజీఎస్‌...
భారీ ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన  రియల్‌ టైమ్‌ గ్రాస్‌ సెటిల్‌మెంట్‌ సిస్టమ్స్‌ (ఆర్‌టీజీఎస్‌) ఇక నిరంతరాయంగా అందుబాటులోకి రానుంది.  ప్రస్తుతం ఆర్‌టీజీఎస్‌ సేవలు ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల మధ్య అందుబాటులో ఉంటున్నాయి. ప్రతి నెలా రెండు, నాలుగు శనివారాల్లో కూడా ఈ సేవలు అందుబాటులో ఉండడం లేదు. 2019 డిసెంబర్‌లో నేషనల్‌ ఎలక్ట్రానిక్‌ ఫండ్స్‌ ట్రాన్స్‌ఫర్‌ (ఎన్‌ఈఎఫ్‌టీ) వ్యవస్థ నుంచి నిరంతరాయ సేవలు అందుబాటులోకి వచ్చాయి. రూ.2 లక్షల వరకూ లావాదేవీలకు ఎన్‌ఈఎఫ్‌టీ సేవలను పొందవచ్చు.  డిజిటల్‌ లావాదేవీల పెంపు లక్ష్యంగా 2019 జూలై నుంచి ఎన్‌ఈటీఎఫ్, ఆర్‌టీజీఎస్‌ ద్వారా లావేదేవీలపై చార్జీలను ఆర్‌బీఐ నిలుపుచేసింది.  

ప్రాఫిట్, డివిడెండ్‌లపై బ్యాంకులకు వరం...
కోవిడ్‌–19 మహమ్మారి సవాళ్లను ఎదుర్కొనడానికి వీలుగా  2019–20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి షెడ్యూల్డ్‌ కమర్షియల్‌ బ్యాంకులు, సహకార బ్యాంకులు లాభాలను తమవద్దే ఉంచుకోవాలని, డివిడెండ్లను చెల్లించవద్దని ఆర్‌బీఐ సూచించింది. కష్ట నష్టాలను ఎదుర్కోడానికి మద్దతుగా అలాగే రుణ మంజూరీలకు మూలధన నిర్వహణ కీలకమని ఈ సందర్భంగా పేర్కొంది. లాభాలు తమవద్దే ఉంచుకోవడం, అలాగే డివిడెండ్‌ చెల్లింపుల నిలిపివేతలకు సంబంధించి త్వరలో మార్గదర్శకాలను జారీ చేయనున్నట్లు కూడా తెలిపింది. బ్యాంకుల తరహాలో  డివిడెండ్‌ పంపిణీకి  సంబంధించి ఎన్‌బీఎఫ్‌సీలకు మార్గదర్శకాలు ఏమీ లేవని కూడా ఈ సందర్భంగా ఆర్‌బీఐ గుర్తుచేసింది. ఈ నేపథ్యంలో జనవరిలో సమగ్ర మార్గదర్శకాలు జారీ చేయనున్నట్లు తెలిపింది.  

వృద్ధికి ఊతం– ఆర్థిక స్థిరత్వం లక్ష్యం
ఆర్థికాభివృద్ధికి ఊతం ఇవ్వడానికి, ఆర్థిక స్థిరత్వానికి తగిన చర్యల తీసుకుంటున్నామని ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ పేర్కొన్నారు. ‘ద్రవ్యోల్బణం తగ్గుతుందన్న అంచనాల నేపథ్యంలో సరళతర ద్రవ్య పరపతి విధానాన్నే ఆర్‌బీఐ కొనసాగించనుంది. మహమ్మారి ప్రభావాన్ని జాగ్రత్తగా అంచనావేస్తూ, ఆర్థిక వ్యవస్థ పురోగతికి తగిన నిర్ణయాలను తీసుకుంటాం.  ఆర్థిక వ్యవస్థ వేగంగా రికవరీ చెందుతోందని కీలక గణాంకాలు వెల్లడిస్తున్నాయి. అక్టోబర్‌లో పాసింజర్, మోటార్‌సైకిల్‌ అమ్మకాల్లో రెండంకెల వృద్ధి కనబడుతోంది. రైల్వే రవాణా పెరిగింది. విద్యుత్‌ డిమాండ్‌ మెరుగుపడింది. నాన్‌ బ్యాంకింగ్‌ ఫైనాన్షియల్‌ కంపెనీ(ఎన్‌బీఎఫ్‌సీ), అర్బన్‌ సహకార బ్యాంకులపై  నిర్వహణా పరంగా మరింత పర్యవేక్షణ ఉంటుంది. గ్రామీణ ప్రాంతాల్లో రికవరీ మరింత పటిష్టం అవుతోంది. పట్టణ డిమాండ్‌ మరింత మెరుగుపడుతోంది. వ్యాక్సిన్‌ వస్తోందన్న వార్తలు ఆశావహ పరిస్థితులను మెరుగుపరుస్తోంది. రానున్న 2021–22 బడ్జెట్‌ వృద్ధికి దోహదపడేదిగా ఉంటుందని విశ్వసిస్తున్నాం’ అని చెప్పారు.

కార్పొరేట్లకు బ్యాంకింగ్‌ లైసెన్స్‌... ఆర్‌బీఐ యోచనకాదు
బ్యాంకింగ్‌ రెగ్యులేషన్‌ యాక్ట్, 1949కు అవసరమైన సవరణలు చేస్తూ, స్వయంగా బ్యాంకులను తెరవడానికి బడా కార్పొరేట్‌ సంస్థలకు అనుమతి ఇవ్వవచ్చని  ఆర్‌బీఐ ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ చేసిన సిఫారసు అంశాన్ని ఆర్‌బీఐ గవర్నర్‌ తన పాలసీ ప్రకటనలో ప్రస్తావించారు. ఈ ప్రతిపాదన ఆర్‌బీఐ అంతర్గత కమిటీ చేసిన సూచన తప్ప, ఆర్‌బీఐది కాదన్న విషయాన్ని గుర్తెరగాలని అన్నారు. నిపుణుల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకున్న తర్వాతే ఆర్‌బీఐ ఇందుకు సంబంధించి తుది నిర్ణయం తీసుకుంటుందన్నారు. రేటింగ్‌ దిగ్జజం ఎస్‌అండ్‌పీ సహా ఆర్‌బీఐ మాజీ గవర్నర్‌ రఘురామ్‌ రాజన్, మాజీ డిప్యూటీ గవర్నర్‌ విరాల్‌ ఆచార్య,  ప్రపంచబ్యాంక్‌ మాజీ చీఫ్‌ ఎకనమిస్ట్‌ కౌశిక్‌ బసు  ఈ ప్రతిపాదనను బహిరంగంగానే తీవ్రంగా విమర్శించిన సంగతి తెలిసిందే.

డిజిటల్‌ బ్యాంకింగ్‌పై విశ్వాసం పెంచాలన్నదే లక్ష్యం...  
కొత్త కార్డుల జారీ నిలిపివవేతసహా హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌పై తీసుకున్న పలు చర్యలను ఆర్‌బీఐ గవర్నర్‌ పాలసీ ప్రకటన సందర్భంగా ప్రస్తావించారు. డిజిటల్‌ బ్యాంకింగ్‌ పట్ల వినియోగదారుల విశ్వాసాన్ని చెక్కుచెదరకుండా కొనసాగించాలన్నదే ఆర్‌బీఐ నిర్ణయం ఉద్దేశమని తెలిపారు. సాంకేతిక విభాగంపై బ్యాంకర్లు మరింత పెట్టుబడులు పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.  ఐటీ వ్యవస్థ పటిష్టతకు తగిన చర్యలన్నింటినీ హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ యాజమాన్యం తీసుకుంటుందన్న విశ్వాసాన్నీ దాస్‌ వ్యక్తం చేశారు.  బ్యాంకింగ్‌ దిగ్గజం స్టేట్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా (ఎస్‌బీఐ) ఆన్‌లైన్‌ సేవల అంతరాయల అంశాన్ని కూడా ఆర్‌బీఐ పరిశీలిస్తోందని తెలిపారు.

వృద్ధికి దోహదం
యథాతథ వడ్డీరేట్ల విధానాన్ని సెంట్రల్‌ బ్యాంక్‌ కొనసాగిస్తుందన్నది ఊహించిందే. అయితే సరళతర ఆర్థిక విధానాన్ని కొనసాగిస్తున్నట్లు చేస్తున్న ప్రకటన వృద్ధికి, మార్కెట్లకు ఊతం ఇచ్చే అంశం. పటిష్ట డిమాండ్‌ కొనసాగడానికి దోహదపడుతుంది.  
– దినేష్‌ ఖారా, ఎస్‌బీఐ చైర్మన్‌

అరశాతం వరకూ తగ్గే చాన్స్‌
వృద్ధి పునరుద్ధరణ లక్ష్యంగా రెపో రేటు మరింత తగ్గడానికి తగిన వెసులుబాటు ఉంది. 2020–21 తదుపరి ద్వైమాసిక సమీక్షల సందర్భంగా రేటు పావు శాతం నుంచి అరశాతం వరకూ తగ్గే అవకాశం ఉంది. ద్రవ్యోల్బణం కట్టడికి పటిష్ట చర్యలు అవసరం.  
– అభీక్‌ బారువా, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్‌ చీఫ్‌ ఎకనమిస్ట్‌

ప్రోత్సాహకరం..
ఆర్థిక వ్యవస్థ క్షీణ రేట్లు సవరిస్తూ పాలసీ నిర్ణయం ప్రోత్సాహకరమైనది.   కేంద్రం, ఆర్‌బీఐ తీసుకుంటున్న చర్యలతో దేశం ఆర్థిక పురోగతితో వచ్చే ఏడాదిలోకి ప్రవేశిస్తుందని మేము ఆశిస్తున్నాం. సరఫరాల వ్యవస్థ మరింత మెరుగుపడాల్సి ఉంటుంది.      
–సంగీతా రెడ్డి, ఫిక్కీ ప్రెసిడెంట్‌

గృహ డిమాండ్‌కు ఊతం
సరళతర ద్రవ్య పరపతి విధానాన్నే కొనసాగిస్తున్నట్లు పాలసీ ప్రకటన గృహ డిమాండ్‌కు ఊతం ఇవ్వడానికి దోహదపడుతుంది. తగిన వడ్డీరేట్లు కస్టమర్లకు అందుబాటులో ఉంటాయి. డిమాండ్‌ పునరుద్ధరణ దిశలో ప్రత్యేకించి మధ్య తరగతికి హర్షదాయకమైన పాలసీ నిర్ణయం ఇది.  
– నిరంజన్‌ హిరనందని, నరెడ్కో ప్రెసిడెంట్‌

వడ్డీరేట్ల తగ్గింపు కష్టమే
రిటైల్‌ ద్రవ్యోల్బణం తీవ్రంగా ఉంది. ఈ నేపథ్యంలో రేటు తగ్గింపు కష్టం. భవిష్యత్తులోనూ ఇదే ధోరణి ఉంటుందని భావిస్తున్నాం. అయితే సరళతర విధానాన్నే కొనసాగించాలన్న నిర్ణయం దీర్ఘకాలంపాటు వడ్డీరేట్లు తక్కువగా ఉంటాయనడానికి సంకేతంగా భావించవచ్చు.
– అదితీ నయ్యర్, ప్రిన్సిపల్‌ ఎకనమిస్ట్, ఐసీఆర్‌ఏ  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement