ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ) ద్రవ్య పరపతి సమీక్షా విధాన కీలక నిర్ణయాలు దాదాపు మెజారిటీ విశ్లేషకుల అంచనాలకు అనుగుణంగానే వెలువడ్డాయి. 2020 ఆగస్టు నుంచి చూస్తే, వరుసగా పదవ ద్వైమాసిక సమావేశంలోనూ గవర్నర్ శక్తికాంత దాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) రెపో రేటును యథాతథంగా కనిష్ట స్థాయిల్లో 4 శాతం వద్దే కొనసాగించాలని నిర్ణయించింది. బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్‌బీఐ వసూలు చేసే వడ్డీరేటు రెపో యథాతథంగా కొనసాగించాలన్న నిర్ణయానికి ఆరుగురు సభ్యులు ఏకగ్రీవంగా ఓటు చేశారు. ఇక వ్యవస్థలో ద్రవ్య లభ్యత (లిక్విడిటీ) నిర్వహణకు కీలకమైన రివర్స్ రెపో (బ్యాంకులు తమ వద్ద ఉండే అదనపు నిల్వలను ఆర్‌బీఐ వద్ద డిపాజిట్ చేసి పొందే వడ్డీరేటు– ప్రస్తుతం 3.35 శాతం)ను కూడా యథాతథంగా కొనసాగిస్తూ ఆర్‌బీఐ కమిటీ విధాన నిర్ణయం తీసుకుంది.
2020 ఆగస్టు నుంచి యథాతథమే..: కరోనా సవాళ్లు ఎదుర్కొనడం, వృద్ధి లక్ష్యంగా 2020 మార్చి తర్వాత రెపో రేటును ఆర్‌బీఐ 115 బేసిస్ పాయింట్లు (1.15 శాతం) తగ్గించింది. 2020 ఆగస్టు నాటికి ఈ రేటు 4 శాతానికి దిగివచ్చింది. ఇక అప్పటి నుంచి (2020 ఆగస్టు ద్వైమాసిక సమావేశం) రెపో రేటును యథాతథంగా కొనసాగించడానికే ఆరుగురు సభ్యుల ఎంపీసీ ఏకగ్రీవ నిర్ణయాలు తీసుకుంటూ వస్తోంది. 2019 ప్రారంభంతో పోల్చితే ఇప్పుడు రెపో రేటు 2.5 శాతం తక్కువగా ఉంది. వడ్డీ రేట్ల పెంపులో సుదీర్ఘ విరామం, నిరంతర సరళతర విధాన వైఖరిని మీడియా సమావేశంలో గవర్నర్ శక్తికాంతదాస్ సమర్థించుకుంటూ, ప్రస్తుత కాలంలో ‘ద్రవ్య– ఆర్థిక విధానాలు ఒకదానికొకటి లేదా ఒకదానితో ఒకటి కలిసి వెళ్లాలి’’ అని వ్యాఖ్యానించారు. రెండు విధానాల్లో ‘అదా–ఇదా’ అనే ప్రశ్నే ప్రస్తుతం తలెత్తబోదని గవర్నర్ అన్నారు.
సరళతరానికి ఐదుగురు ఓటు
కాగా, పాలసీకి సంబంధించి అనుసరిస్తూ వస్తున్న ‘సరళతర’ వైఖరిని ‘తటస్థం’కు మార్చాలన్న ప్రతిపాదనను ఆరుగురు సభ్యుల్లో ఐదుగురు వ్యతిరేకించగా, ఒక్కరు మాత్రమే అనుకూలంగా ఓటు చేశారు. పాలసీ నిర్ణయాలకు ప్రాతిపదిక అయిన రిటైల్ ద్రవ్యోల్బణం 2021–22 ఆర్థిక సంవత్సరంలో సగటున 5.3 శాతంగా అంచనా వేయగా, 2022–23 ఆర్థిక సంవత్సరంలో ఈ రేటు 4.5 శాతానికి దిగివస్తుందని ఆర్‌బీఐ అంచనావేసింది. ఈ నేపథ్యంలో వృద్ధి రికవరీ, పటిష్టత లక్ష్యంగా అవసరమైనంతకాలం ‘సరళతర’ విధానాన్నే అనుసరించడం ఉత్తమమని ఐదుగురు సభ్యులు అభిప్రాయపడ్డారు. ఆర్‌బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం 2–6 శాతం శ్రేణిలో కొనసాగేలా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది.
వేగవంతమైన వృద్ధి
ఇక భారత్ ఎకానమీ వృద్ధి తీరు ఇతర ప్రపంచ దేశాలతో పోల్చితే విభిన్నంగా ఉందని ఆర్‌బీఐ అభిప్రాయపడింది. ప్రపంచంలో వేగవంతమైన ఆర్థిక వ్యవస్థగా భారత్ ఎకానమీ కొనసాగుతుందన్న భరోసాను వ్యక్తం చేసింది. స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ) వృద్ధి 2021–22లో 9.2 శాతం ఉంటే, 2022–23లో ఈ రేటు 7.8 శాతానికి తగ్గుతుందని విశ్లేషించింది. మహమ్మారి పరిస్థితిపై అస్పష్టత, క్రూడ్‌సహా అంతర్జాతీయ కమోడిటీ ధరల పెరుగుదల వంటి అంశాలు 2022–23 ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటును 7.8 శాతానికి తగ్గించడానికి కారణం. 2021–22లో ఎకానమీ వృద్ధి 8 నుంచి 8.5 శాతం శ్రేణిలో ఉంటుందని ఎకనమిక్ సర్వే అంచనా. అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థకు సంబంధించి ఈ అంచనా 9 శాతంగా ఉంది. ఈ అంచనాలకన్నా కొంత అధికంగానే ఆర్‌బీఐ అంచనాలు 9.2 శాతం వద్ద కొనసాగుతుండడం గమనార్హం.
మరికొన్ని కీలక నిర్ణయాలు...
► కోవిడ్–19 సంక్షోభం నేపథ్యంలో అత్యవసర ఆరోగ్య సేవల రంగానికి గత ఏడాది మేలో ప్రకటించిన రూ.50,000 కోట్ల ఆన్–ట్యాప్ లిక్విడిటీ రుణ సౌలభ్యతను మరో 3 నెలలు అంటే 2022 జూన్ 30 వరకు పొడిగించాలని ఆర్‌బీఐ నిర్ణయించింది.
► ప్రస్తుత అనిశ్చితి పరిస్థితులను ఎదుర్కొనడానికి బ్యాంకులు, బ్యాంకింగ్ యేతర ఫైనాన్షియల్ కంపెనీలు మూలధన పెంపు ప్రక్రియపై నిరంతరం దృష్టి సారించాలని సూచించింది.
► దేశానికి వచ్చీ–పోయే విదేశీ మారకపు ద్రవ్యం మధ్య నికర వ్యత్యాసాన్ని తెలియజేసే కరెంట్ అకౌంట్– ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2 శాతం (జీడీపీ విలువలో) లోటును నమోదుచేస్తుంది. ► వచ్చే ఆర్థిక సంవత్సరం (2022–23)లో
తొలి ద్వైమాసిక పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) సమావేశం ఏప్రిల్ 6వ తేదీ నుంచి 8వ తేదీ వరకు జరుగుతుంది.
రూ. లక్ష వరకు ఈ–రూపీ పరిమితి
ఈ–రూపీ (ప్రీ–పెయిడ్ డిజిటల్ ఓచర్) గరిష్ట పరిమితిని రూ. 10,000 నుండి రూ. 1 లక్షకు పెంచుతూ పాలసీ కమిటీ నిర్ణయం తీసుకుంది. అంటే ఇప్పుడు లబ్దిదారుడు బ్యాంక్ అకౌంట్, ఇంటర్‌నెట్ లేకుండా కేవలం ఫీచర్ ఫోన్ ద్వారా కూడా రూ. 1 లక్ష వరకు ప్రభుత్వ ప్రయోజనాలను పొందవచ్చు. వివిధ ప్రభుత్వ పథకాలను మరింత సమర్ధవంతంగా అందించడానికి వీలుగా మొత్తం పూర్తిగా రీడీమ్ అయ్యే వరకు ఈ–రూపీ వోచర్‌ను లబ్దిదారులకు ఒకటి కంటే ఎక్కువసార్లు ఉపయోగించవచడానికి ఆర్‌బీఐ అనుమతి ఇచ్చింది.
ప్రభుత్వ పథకాల ప్రయోజనాల సమర్థ పంపిణీకి ప్రస్తుతం ఈ–రూపీ కీలకంగా ఉంది. కేవైసీ, కార్డ్, డిజిటల్ చెల్లింపుల యాప్ లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ యాక్సెస్ వంటి వాటితో సంబంధం లేకుండా వోచర్‌ను రిడీమ్ చేయడంలో లబ్దిదారులకు సహాయపడే వన్–టైమ్ (ఇప్పటివరకూ... ఇకపై పూర్తిగా రీడీమ్ అయ్యే వరకూ) కాంటాక్ట్‌లెస్, నగదు రహిత వోచర్ ఆధారిత చెల్లింపు విధానమే– ఈ–రూపీ. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌పీసీఐ) రూపొందించిన ఈ–రూపీ నగదు రహిత డిజిటల్ ఓచర్‌ను ‘వ్యక్తిగత వినియోగం, సింగిల్ టైమ్ రెడెమ్షన్ సౌలభ్యంతో’ 2021 జూలైలో ప్రధాని నరేంద్ర మోదీ ఆవిష్కరించారు.
డిజిటల్ లెండింగ్‌పై మార్గదర్శకాలు
డిజిటల్ రుణ విధానాలపై త్వరలో ఆర్‌బీఐ మార్గదర్శకాలను జారీచేయనుంది. గత ఏడాది నవంబర్‌లో ఈ విధానంపై ఏర్పాటు చేసిన కమిటీ తన సిఫారసులను ఇప్పటికే సమర్పించినట్లు డిప్యూటీ గవర్నర్ ఎం రాజేశ్వర్ రావు తెలిపారు. ఇప్పటికే దీనిపై ప్రజల నుంచి అభిప్రాయాలను స్వీకరించడం జరిగిందని, దీని అధారంగా మార్గదర్శకాలు రూపొందుతున్నాయని తెలిపారు. రిటైల్ పేమెంట్ వ్యవస్థకు కొత్త నేతృత్వ సంస్థ ఖరారుకు ఇంకా సమయం పడుతుందని సూచించారు.
క్రిప్టో... తులిప్ కన్నా దిగదుడుపే
బిట్‌కాయిన్ వంటి క్రిప్టో కరెన్సీల విషయంలో ఆర్‌బీఐ కమిటీ తన కఠిన వైఖరిని పునరుద్ఘాటించింది. ఆర్థిక వ్యవస్థ, ఫైనాన్షియల్ స్థిరత్వాలకు ఈ కరెన్సీ ముప్పని స్పష్టం చేసింది. ఈ విషయంలో జాగ్రత్తగా ఉండాలని ఇన్వెస్టర్లను గవర్నర్ హెచ్చరించారు. అటువంటి అసెట్స్‌కు ఎటువంటి అంతర్లీన విలువా ఉండదని గవర్నర్ అన్నారు. క్రిప్టో కరెన్సీ... తులిప్ పువ్వుకన్నా దిగదుడుపని ఆయన వ్యాఖ్యానించారు. ఈ సందర్భంగా ఆయన 17వ శతాబ్దంలో వచ్చిన ‘తులిప్ మ్యానియా’ను గుర్తుచేశారు.
డిజిటల్ కరెన్సీపై తొందరలేదు..
ఆర్‌బీఐ 2022–23లో డిజిటల్ కరెన్సీని ప్రవేశపెడుతుందని ప్రభుత్వం చేసిన ప్రకటనపై గవర్నర్ శక్తికాంతదాస్ ఆచితూచి స్పందించారు. హడావిడిగా దీనిపై ముందుకు వెళ్లాలని సెంట్రల్ బ్యాంక్ కోరుకోవడం లేదని అన్నారు. సెంట్రల్ బ్యాంక్ డిజిటల్ కరెన్సీ (సీబీడీసీ)ని ప్రవేశపెట్టే ముందు అన్ని అంశాలనూ ఆర్‌బీఐ జాగ్రత్తగా పరిశీలిస్తుందని తెలిపారు. సీబీడీసీ ఆవిష్కరణకు ఎటువంటి కాలపరమితిని ఆయన ప్రస్తావించలేదు.
లక్ష్యాలకు అనుగుణంగా నిర్ణయాలు...
ఆచితూచి, లక్ష్యసాధనకు ఉద్దేశించి పరపతి విధాన నిర్ణయాలను ఆర్‌బీఐ విధాన పరపతి కమిటీ తీసుకుంది. రిటైల్ ద్రవ్యోల్బణం తగిన స్థాయిలో ఉంటుందన్న అంచనాల ప్రాతిపదికన, వృద్ధే లక్ష్యంగా సరళతర విధానం కొనసాగించాలని కమిటీ నిర్ణయించింది. ఈ ఆర్థిక సంవత్సరం నాల్గవ త్రైమాసికంలో (2022 జనవరి–మార్చి) ద్రవ్యోల్బణం ఆమోదనీయ బ్యాండ్‌లోనే పైకి వెళ్లొచ్చు.
అయితే 2022–23 ద్వితీయ ఆరు నెలల కాలంలో 4.5% శ్రేణికి దిగొస్తుందని కమిటీ విశ్వసిస్తోంది. దీనికితోడు కోవిడ్ కొత్త వేరియంట్ ఒమిక్రాన్ అనిశ్చితి, ప్రపంచ ఆర్థిక వ్యవస్థ నుంచి సవాళ్లు వంటి అంశాల నేపథ్యంలో విస్తృత ప్రాతిపదికన రికవరీ జరగడానికి ఎకానమీకి పాలసీ మద్దతు అవసరమని కమిటీ భావించింది. సరళతర విధానాన్ని కొనసాగించాలన్న నిర్ణయం వల్ల రివర్స్ రెపోను కూడా యథాతథంగా కొనసాగించాలని కమిటీ అభిప్రాయపడింది. వ్యవస్థలో ప్రైవేటు పెట్టుబడులు పెరుగుతాయన్న విశ్వాసం ఉంది. ప్రభుత్వ మూలధన వ్యయ ప్రణాళికలు, ఎగుమతులు ఉత్పాదక సామర్థ్యం పెరుగుదల, డిమాండ్ పటిష్టతకు దారితీస్తాయని, ఈ వాతావరణం ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహిస్తాయని విశ్వసిస్తున్నాం.
– శక్తికాంతదాస్, ఆర్‌బీఐ గవర్నర్
ఎకానమీకి భరోసా
ఇప్పుడిప్పుడే రికవరీ బాట పడుతున్న ఎకానమీ వృద్ధికి పాలసీ నిర్ణయాలు భరోసాను ఇస్తాయి. అంతర్జాతీయ అనిశ్చితుల నేపథ్యంలో మార్కెట్ సెంటిమెంట్ బలోపేతానికి పాలసీ తగిన మద్దతునిచ్చింది. ప్రభుత్వ బాండ్లలో తగిన సమతౌల్యతను కొనసాగించడానికి సంకేతాలను ఇచ్చింది.
– దినేష్ ఖారా, ఎస్‌బీఐ చైర్మన్
అంచనాలకు అనుగుణంగా...
పాలసీ నిర్ణయాలు అంచనాలకు అనుగుణంగా ఉన్నాయి. వృద్ధిని మరింత పటిష్టం చేయడానికి సెంట్రల్ బ్యాంక్ అధిక ప్రాధాన్యత ఇచ్చింది. ఎకానమీలోని పలు రంగాల బలహీనత నేపథ్యంలో ‘సరళతర’ విధానాన్నే కొనసాగించాలని ఎంపీసీ నిర్ణయించడం హర్షణీయం.
– అతుల్ కుమార్ గోయెల్, ఐబీఏ చైర్మన్
డిమాండ్‌కు దోహదం
సరళతర ద్రవ్య విధానాన్నే కొనసాగించాలన్న నిర్ణయం వ్యవస్థలో డిమాండ్‌కు ప్రోత్సాహాన్ని ఇస్తుంది. వృద్ధి అన్ని రంగాల్లో విస్తృత ప్రాతిపదికన జరగాలని పరిశ్రమ కోరుతోంది. ఈ దిశలోనే ఆర్‌బీఐ నిర్ణయాలు ఉన్నాయి. ప్రభుత్వంతో సన్నిహిత సహకారంతో వృద్ధి పురోగతికి మరిన్ని చర్యలు ఉంటాయని విశ్వసిస్తున్నాం.
– సంజీవ్ మెహతా, ఫిక్కీ ప్రెసిడెంట్
హర్షణీయం
సరళ విధానం కొనసాగించాన్న నిర్ణయం హర్షణీయం. పాలసీ రేట్లను యథాతథంగా కొనసాగించడం రియల్టీకి సానుకూలాంశం. బ్యాంకింగ్‌లో అందుబాటులో ఉన్న అదనపు లిక్విడిటీ అన్ని రంగాలకూ అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలి. ఇది ఉపాధి కల్పన, ఎకానమీ పురోగతికి దారితీస్తుంది.
– హర్షవర్థన్ పటోడియా, క్రెడాయ్ ప్రెసిడెంట్
Comments
Please login to add a commentAdd a comment