status quo
-
వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ రిట్ పిటిషన్‌ను హైకోర్టు బుధవారం విచారించింది. వైఎస్సార్సీపీ కార్యాలయాల కూల్చివేతకు నోటీసులపై ఏపీ హైకోర్టు స్టేటస్ కో విధించింది. రేపటి వరకు స్టేటస్కో విధించింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలుచేయాలని ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది. రేపు(గురువారం) మరోసారి కోర్టు విచారణ జరపనుంది. మొత్తం 10 జిల్లా కార్యాలయాలపై లేళ్ల అప్పిరెడ్డి పిటిషన్ దాఖలు చేశారు.కాగా, రాష్ట్ర వ్యాప్తంగా నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయాలపై టీడీపీ సర్కారు కక్షగట్టింది. గతం మరచిపోయి కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది. గుంటూరు జిల్లా తాడేపల్లిలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇటీవల చీకటిలో కూల్చి వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న వైఎస్సార్ సీపీ కార్యాలయాలను కూల్చేయడానికి పావులు కదుపుతోంది. -
మార్కెట్‌కు ‘ఫెడ్’ బూస్ట్!
ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఊహించినట్లే యథాతథంగా ఉంచడంతో పాటు సరళతర ద్రవ్య విధాన అమలు వ్యాఖ్యలు ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. దేశీయంగా వాహన విక్రయాలు రికార్డు గరిష్టానికి చేరుకోవడం, జీఎస్టీ వసూళ్లు పెరగడం, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించడం కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 490 పాయింట్లు పెరిగి 64,081 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 144 పాయింట్లు బలపడి 19,133 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆద్యంతం జోరు కనబరిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 611 పాయింట్లు దూసుకెళ్లి 64,203 వద్ద, నిఫ్టీ 186 పాయింట్లు బలపడి 19,175 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి. రియల్టీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్, ఎఫ్ఎంసీజీ, ఫార్మా షేర్లకు చిన్న, మధ్య తరహా షేర్లు భారీ డిమాండ్ లభించింది. దీంతో బీఎస్ఈ మిడ్, స్మాల్ సూచీలు ఒకశాతానికి పైగా ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,261 కోట్ల షేర్లను అమ్మేయగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1380 కోట్ల షేర్లు కొన్నారు. ఫెడ్ రిజర్వ్ నుంచి సానుకూల సంకేతాలు, జపాన్ ప్రభుత్వం 113 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి ప్రకటన, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సైతం వడ్డీరేట్ల జోలికెళ్లకపోవడం తదితర పరిణామాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు 1–2% ర్యాలీ చేశాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు 1–1.5 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి. ► సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్ఈలో ఇన్వెస్టర్లు సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.1 లక్షల కోట్లు పెరిగి రూ. 313.32 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 30 షేర్లలో టెక్ మహీంద్రా(1%), బజాజ్ ఫైనాన్స్(0.25%) మాత్రమే నష్టపోయాయి. ► క్యూ2 నికర లాభం ఐదు రెట్లు వృద్ధి సాధించడంతో జేకే టైర్ షేరు 10% లాభపడి రూ.337 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 14% ర్యాలీ చేసి రూ.351 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది. ► క్యూ2 ఫలితాల ప్రకటన తర్వాత హీరో మోటో కార్ప్ షేరులో లాభాల స్వీకరణ జరిగింది. 1% నష్టపోయి రూ.3050 వద్ద స్థిరపడింది. -
RBI Monetary Policy: ధరల కట్టడే ధ్యేయం..
ముంబై: ధరల కట్టడికే అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నట్లు గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన కమిటీ (ఎంపీసీ) స్పష్టం చేసింది. బ్యాంకులకు ఆర్బీఐ తానిచ్చే రుణాలపై వసూలు చేసే వడ్డీరేటు– రెపోను యథాతథంగా 6.5 శాతంగా కొనసాగించాలని ఏకగ్రీవ నిర్ణయం తీసుకుంది. ఈ తరహా ‘యథాతథ రెపో రేటు కొనసాగింపు’ నిర్ణయం తీసుకోవడం వరుసగా ఇది నాల్గవసారి. రిటైల్ ద్రవ్యోల్బణం 4%గా కొనసాగించడమే ప్రధాన లక్ష్యమని ఉద్ఘాటించిన ఎంపీసీ, ఈ దిశలో వ్యవస్థలో అదనపు ద్రవ్య లభ్యతను (లిక్విడిటీ) వెనక్కు తీసుకునే విధానాన్ని కొనసాగిస్తామని పేర్కొంది. ఇందులో భాగంగా బాండ్ విక్రయాల ను చేపడుతున్నట్లు తెలిపింది. ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణికే కట్టుబడి ఉన్నట్లు పాలసీ కమిటీ స్పష్టం చేసింది. మూడు రోజులపాటు జరిగిన కమిటీ సమావేశాల నిర్ణయాలను గవర్నర్ శక్తికాంతదాస్ మీడియాకు తెలిపారు. ‘ఆర్బీఐ ద్రవ్యోల్బణం లక్ష్యం 4%. 2 నుంచి 6% కాదు’ అని ఉద్ఘాటించారు. ప్లస్ 2, మైనస్ 2తో 4% వద్ద ద్రవ్యోల్బణం ఉండాలని ఆర్బీఐకి కేంద్రం నిర్దేశిస్తున్న సంగతి తెలిసిందే. పాలసీ ముఖ్యాంశాలు... ► 2023–24లో జీడీపీ 6.5 శాతం. ► రిటైల్ ద్రవ్యోల్బణం 5.4 శాతం. ► అర్బన్ కో ఆపరేటివ్ బ్యాంకుల బుల్లెట్ రీపేమెంట్ స్కీమ్ కింద పసిడి రుణాల పరి మితి రూ. 2 లక్షల నుంచి రూ. 4లక్షలకు పెంపు. రూ. 2,000 నోట్లు ఇప్పటికీ మార్చుకోవచ్చు.. రూ.2,000 నోట్లను అక్టోబర్ 8 నుంచి కూడా మార్చుకునే అవకాశాలన్నీ ఆర్బీఐ కలి్పంచింది. గవర్నర్ ఈ విషయంపై మాట్లాడుతూ రూ. 3.43 లక్షల కోట్ల రూ. 2,000 డినామినేషన్ నోట్లు ఇప్పటి వరకూ బ్యాంకింగ్ వ్యవస్థలోకి తిరిగి వచ్చాయ న్నారు. ఇంకా రూ.12,000 కోట్లకుపైగా విలువైన నోట్లు చెలామణీలో ఉన్నాయన్నారు. అక్టోబర్ 8 నుండి 19 ఆర్బీఐ కార్యాలయాల్లో వీటిని మార్చుకోవచ్చన్నారు. నోట్లను డిపాజిట్ చేయడానికి లేదా మార్చుకోవడానికి మొదట సెపె్టంబర్ 30 వరకు గడువిచి్చన ఆర్బీఐ, ఈ తేదీని అక్టోబర్ 7 వరకూ పొడిగించింది. రాష్ట్ర రాజధానుల్లో ఆర్బీఐ కార్యాలయాలు ఉన్నందున, ఎక్కడివారైనా, 2,000 నోట్లను మార్చు కోవడానికి పోస్టల్ శాఖ సేవలను పొందవచ్చని దాస్ సూచించారు. కఠిన ద్రవ్య విధానం కొనసాగింపు.. ఆర్బీఐ 2022 మే నుంచి 250 బేసిస్ పాయింట్లు రెపో రేటును పెంచింది. అయితే ఇటు డిపాజిట్ల విషయంలో అటు రుణాల విషయంలో బ్యాంకులు కస్టమర్లకు ఈ రేట్లను పూర్తిగా బదలాయించలేదు. ఈ పరిస్థితుల్లో ‘సరళతర ద్రవ్య విధానాన్ని వెనక్కుతీసుకునే’ ధోరణినే కొనసాగించాలని ఆర్బీఐ భావిస్తోంది. అంటే ఇప్పటి వరకూ తీసుకున్న నిర్ణయాలు వ్యవస్థలో ఇంకా ప్రతిఫలించాల్సి ఉంది. – శక్తికాంత దాస్, ఆర్బీఐ గవర్నర్ అంతర్జాతీయ ఆర్థిక అనిశి్చతిలోనూ దేశ ఆర్థికాభివృద్ధి పటిష్టతే లక్ష్యంగా ఉంది. – దినేష్ ఖారా, ఎస్బీఐ చీఫ్ ద్రవ్యోల్బణం గరిష్ట స్థాయికి చేరుకున్నట్లు కనిపిస్తోంది. సమీపకాలంలో ధరలు తగ్గవచ్చు. – సుభ్రకాంత్ పాండా, ఫిక్కీ ప్రెసిడెంట్ వృద్ధికి మద్దతునిస్తూ, ద్రవ్యోల్బణం కట్టడే ఆర్బీఐ ధ్యేయంగా కనబడుతోంది – ప్రసేన్‌జిత్ బసు, చీఫ్ ఎకనమిస్ట్, ఐసీఐసీఐ సెక్యూరిటీస్ -
ఆహార ధరల పెరుగుదలే ప్రధాన ఆందోళన
ముంబై: ఆహార ధరల పెరుగుదలే వ్యవస్థలో ప్రధాన ఆందోళనకర అంశమని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) గవర్నర్ శక్తికాంతదాస్ నేతృత్వంలోని ఆరుగురు సభ్యుల ద్రవ్య పరపతి విధాన (ఎంపీసీ) కమిటీ అభిప్రాయపడింది. ఈ పరిస్థితిలో కఠిన ద్రవ్య విధానవైపే మొగ్గుచూపాలని ప్రస్తుతానికి బ్యాంకులకు తానిచ్చే రుణాలపై ఆర్బీఐ వసూలు చేసే వడ్డీరేటు– రెపో (6.5 శాతం) యథాతథంగానే కొనసాగించాలని ఎండీ పాత్ర, శశాంక భిడే, అషిమా గోయల్, జయంత్ ఆర్ వర్మ, రాజీవ్ రంజన్‌లతో సహా మొత్తం ఆరుగురు సభ్యులు ఓటు వేశారు. ఆగస్టు 8 నుంచి 10వ తేదీ వరకూ జరిగిన ఆర్బీఐ ద్వైమాసిక ద్రవ్య పరపతి విధాన సమీక్ష మినిట్స్ గురువారం విడుదలయ్యాయి. ‘మా పని (ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడం) ఇంకా ముగియలేదు. కూరగాయలు తదితర ఆహార పదార్థాల ధరల ప్రాతిపదికన మొదటి రౌండ్ ద్రవ్య విధాన నిర్ణయాలు ఉంటాయి. అదే సమయంలో, విస్తృత ద్రవ్యోల్బణ ఒత్తిళ్లు, ద్రవ్యోల్బణం అంచనాలు, ఆందోళనల ప్రాతిపదికన రెండవ–రౌండ్ ప్రభావాన్ని ముందస్తుగా తొలగించడానికి మేము సిద్ధంగా ఉండాలి. దీనికి తక్షణం కఠిన విధానమే సరైందని కమిటీ భావిస్తోంది’’ అని దాస్ సమావేశంలో అభిప్రాయపడ్డారు. 2022 నుంచి 250 బేసిస్ పాయింట్లు పెంపు ఉక్రేయిన్‌పై రష్యా యుద్ధం, క్రూడ్ ధరల తీవ్రత, అంతర్జాతీయంగా పెరిగిన క్రూడ్ ధరలు, దీనితో ప్రపంచ వ్యాప్తంగా ద్రవ్యోల్బణం భయాల నేపథ్యంలో ఈ సవాలును అధిగమించడానికి ఆర్బీఐ 2022 మే నుంచి 2023 ఫిబ్రవరి నాటికి రెపో రేటును 250 బేసిస్ పాయింట్లు పెంచింది. దీనితో ఈ రేటు 6.5 శాతానికి చేరింది. అయితే ద్రవ్యోల్బణం కొద్దిగ అదుపులోనికి వస్తుందన్న సంకేతాల నేపథ్యంలో ఈ నెల సమీక్షసహా గడచిన మూడు సమావేశాల్లో యథాతథ రేటు కొనసాగింపునకే ఆర్బీఐ పెద్దపీట వేసింది. అయితే ద్రవ్యోల్బణం భయాలు తొలగిపోలేదని, అవసరమైతే కఠిన ద్రవ్య విధానానికే (రేటు పెంపు) మొగ్గుచూపుతామని కూడా ఆయా సందర్భాల్లో స్పష్టం చేస్తూ వచి్చంది. ఇదే విషయాన్ని ఈ నెల తాజా సమీక్షా సమావేశం అనంతరం కూడా ఆర్బీఐ గవర్నర్ పునరుద్ఘాటించారు. తాజాగా వెలువడిన మినిట్స్ కూడా ఇదే విషయాన్ని సూచించింది. అంచనాలకు అనుగుణంగానే... ఆర్బీఐ ఆందోళనకు అనుగుణంగానే పాలసీ తదనంతరం వెలువడిన జూలై నెల ద్రవ్యోల్బణం తీవ్ర రూపం దాల్చడం గమనార్హం. ఆర్బీఐ కీలక ద్రవ్య పరపతి విధానానికి ప్రాతిపదిక అయిన వినియోగ ధరల సూచీ (సీపీఐ) ఆధారిత రిటైల్ ద్రవ్యోల్బణం జూలైలో ఏకంగా 7.44 శాతంగా (2022 ఇదే నెల ధరలతో పోల్చి ధరల పెరుగుదల) నమోదయ్యింది. గడచిన 15 నెలల్లో ఈ స్థాయి రిటైల్ ద్రవ్యోల్బణం ఇదే తొలిసారి. సూచీలో కీలక విభాగాలైన కూరగాయలు, ఇతర ఆహార పదార్థాల ధరలు తీవ్రంగా పెరగడం దీనికి కారణం. ఆర్బీఐకి కేంద్రం నిర్దేశాల ప్రకారం, రిటైల్ ద్రవ్యోల్బణం ప్లస్ లేదా మైనస్‌తో 4 శాతం వద్ద ఉండాలి. అంటే అప్పర్ బ్యాండ్‌లో 6 శాతం అధిగమిస్తే... దానిని ఎకానమీలో డేంజర్ బెల్సా్గ పరిగణించాల్సి ఉంటుంది. జూలైలో అంకెలు ఈ స్థాయిని అధిగమించడం గమనార్హం. 2022 జూలైలో రిటైల్ ద్రవ్యోల్బణం 6.71 శాతం ఉంటే, ఈ ఏడాది జూన్‌లో 4.87గా నమోదయ్యింది. జూలైలో మళ్లీ తీవ్ర రూపం దాలి్చంది. వినియోగ ధరల సూచీలో కీలక విభాగాలు చూస్తే.. ఒక్క ఫుడ్ బాస్కెట్ ద్రవ్యోల్బణం జూలైలో 11.51%గా నమోదయ్యింది. జూన్‌లో ఈ రేటు 4.55%. జూలై 2022లో ఈ రేటు 6.69%గా ఉంది. ఒక్క కూరగాయల ధరలు జూలై లో ఏకంగా 37.43% ఎగశాయి. తృణ ధాన్యాలు, సంబంధిత ఉత్పత్తుల ధరలు 13 శాతం పెరిగాయి. కీలక అంచనాలు ఇవీ... వృద్ధి తీరు: 2023–24లో దేశ జీడీపీ 6.5 శాతం ఉంటుందని ఆర్బీఐ అంచనావేస్తుండగా, క్యూ1లో 8%, క్యూ2లో 6.5%, క్యూ3లో 6%, క్యూ4లో 5.7 శాతంగా అంచనా. 2024–25 మొదటి త్రైమాసికంలో వృద్ధిరేటు 6.6%గా అంచనా. ద్రవ్యోల్బణం ధోరణి: 2023–24లో వినియోగ ధరల సూచీ ఆధారిత ద్రవ్యోల్బణం 5.4 శాతంగా ఉంటుందని అంచనావేస్తుండగా, క్యూ2లో 6.2%, క్యూ3లో 5.7%, క్యూ4లో 5.2 శాతంగా అంచనా. వచ్చే ఏడాది మొదటి త్రైమాసికంలో అంచనా 5.2 శాతం. -
ఆర్బీఐ బూస్ట్: బుల్ రన్, లాభాల్లోకి సూచీలు
సాక్షి,ముంబై: కీలక వడ్డీరేట్లపై ఆర్బ్‌ఐ ప్రకటన వెలువడిన వెంటనే కీలక లాభాల్లోకి మళ్లాయి. కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచడంతో ఇన్వెస్టర్లు కొనుగోళ్లకు ఎగబడ్డారు. ఫలితంగా సెన్సెక్స్ 146 పాయింట్లు ఎగిసి 59,835 వద్ద, నిఫ్టీ 36 పాయింట్లు ఎగిసి 17592 వద్ద కొనసాగుతున్నాయి. దాదాపు అన్ని రంగాల షేర్లలో కొనుగోళ్లు కనిపిస్తున్నాయి. కాగా రెపో రేట్లను యథాతథంగా ఉంచిన ఆర్బీఐ అందర్నీ ఆశ్చర్యపర్చింది. తాజా నిర్ణయంతో రెపోటు 6.50 శాతంగా కొనసాగనుంది. ద్రవ్యోల్బణంపై యుద్ధం కొనసాగుతుందని ఆర్బీఐ గవర్నర్ శక్తి కాంత దాస్ ప్రకటించారు. అయితే ప్రస్తుత గ్లోబల్ అనిశ్చిత పరిస్థితుల్లో మరోసారి 25పాయింట్ల మేర రెపో రేటు పెంపుఉంటుందనే అంచనాలు ఎక్కువగా వినిపించాయి. (గుడ్ న్యూస్ యథాతథంగా కీలక వడ్డీరేట్లు) -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. జులై 31 వరకు స్టేటస్ కో..
సాక్షి, న్యూఢిల్లీ: బీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసు విచారణను సుప్రీం కోర్టు జులై 31కి వాయిదా వేసింది. కేసు న్యాయస్థానం పరిధిలో ఉన్నందున దర్యాప్తు కొనసాగించవద్దని నిబంధన ఉందని న్యాయమూర్తి స్పష్టం చేశారు. అప్పటి వరకు దర్యాప్తు రికార్డులు సీబీఐకి అందించాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. దర్యాప్తుపై స్టేటస్ కో కొనసాగించాలని ఈమేరకు జస్టిస్ సంజీవ్ ఖన్నా ధర్మాసనం సోమవారం ఆదేశాలు ఇచ్చింది. కాగా.. ఎమ్మెల్యేల ఈ కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తూ హైకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని సవాల్ చేస్తూ తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే. సిట్ దర్యాప్తు రద్దుచేస్తూ.. కేసుకు సంబంధించిన రికార్డులన్నీ సీబీఐకి ఇవ్వాలని హైకోర్టు ఆదేశించిన తెలిసిందే. దీంతో సీబీఐ దర్యాప్తు జరపాలన్న హైకోర్టు తీర్పుపై స్టే విధించాలని తెలంగాణ సర్కార్ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తు సంస్థలన్నీ కేంద్రం గుప్పిట్లోనే ఉన్నాయని, కేసు విచారణను సీబీఐకి అప్పగిస్తే నీరు గారిపోతుందని తెలంగాణ ప్రభుత్వం తరఫు న్యాయవాది కోర్టులో వాదించిన విషయం తెలిసిందే. చదవండి: నాటు నాటు గీతం తెలంగాణ సంస్కృతికి అద్దం పట్టింది.. -
Aston University: వైరస్‌కు ప్రతి సృష్టి!
లండన్: మానవ చరిత్రలో తొలిసారిగా వైరస్‌కు కంప్యూటర్ సాయంతో యథాతథంగా ప్రతి సృష్టి చేశారు! గతంలోనూ ఇలాంటివి జరిగినా జీవపరంగా, 3డి నిర్మాణపరంగా, జన్యుపరంగా ఓ వైరస్‌ను అచ్చుగుద్దినట్టుగా పునర్నిర్మించడం ఇదే తొలిసారట! బ్రిటన్‌లోని ఆస్టన్ యూనివర్సిటీ డిపార్ట్మెంట్ ఆఫ్ మ్యాథమెటిక్స్ ప్రొఫెసర్ ద్మిత్రీ నెరుక్ ఈ ఘనత సాధించారు! అత్యాధునిక సూపర్ కంప్యూటర్లు వాడినా కూడా ఈ పరిశోధనకు ఏకంగా మూడేళ్లు పట్టిందట! ప్రస్తుతం అందుబాటులో ఉన్న వైరస్ నిర్మాణాలను క్రయో ఎలక్ట్రాన్ మైక్రోస్కొపీ, కంప్యుటేషనల్ మోడలింగ్ సాయంతో పరిశీలించారు. ‘‘ఇంతకాలం పాటు వైరస్ల పూర్తి జన్యు నిర్మాణక్రమం అందుబాటులో లేని కారణంగా వాటి తాలూకు జీవక్రియలపై మనకు సంపూర్ణ అవగాహన లేదు. తాజా అధ్యయనం ఈ విషయంలో దారి చూపగలదు’’ అని సైంటిస్టులు చెబుతున్నారు. ‘‘అంతేగాక ఈ పరిశోధన వల్ల యాంటీబయాటిక్స్‌కు మెరుగైన, సమర్థమైన ప్రత్యామ్నాయాల దిశగా కొత్త దారి దొరుకుతుంది. యాంటీబయాటిక్స్‌కు లొంగని మొండి బ్యాక్టీరియా సమస్యకూ పరిష్కారం లభిస్తుంది’’ అని వారంటున్నారు. ఈ అధ్యయనం ఫారడే డిస్కషన్స్ జర్నల్‌లో పబ్లిషైంది. -
Jahangirpuri Bulldozers: రెండు గంటల హైడ్రామా తర్వాతే..
సాక్షి, ఢిల్లీ: దేశ రాజధానికి చేరిన ‘బుల్డోజర్ ట్రీట్మెంట్’ రాజకీయాలు.. బుధవారం రసవత్తరంగా సాగాయి. జహంగీర్‌పురి ప్రాంతంలో అక్రమ కట్టాల పేరిట ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు కలుగజేసుకోవడంతో ఈ కూల్చివేత నిలిచిపోయింది. కానీ, అధికారులు మాత్రం సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా.. దాదాపు రెండు గంటలపాటు తమ పనిని కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఉదయం 10 గంటల సమయంలో.. ఎక్కడైతే హానుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా అల్లర్లు జరిగాయో.. అదే ప్రాంతంలో అక్రమ కట్టాలంటూ కూల్చివేత పనులు మొదలుపెట్టారు అధికారులు. భద్రత కోసం సుమారు 400 మందిని పోలీస్ సిబ్బందిని వెంటపెట్టుకుని.. తొమ్మిది బుల్డోజర్లతో అక్రమ నిర్మాణలంటూ కూల్చేసుకుంటూ పోయారు. ఈ క్రమంలో పిటిషనర్ సుప్రీం కోర్టును హుటాహుటిన ఆశ్రయించారు. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ తరహాలో మత ఘర్షణలను సాకుగా చూపిస్తూ ఒక వర్గం వాళ్ల కట్టడాలను కూల్చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు మున్సిపల్ కార్పొరేషన్ ఇందుకు సంబంధించి ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కూల్చివేతను ఆపేయాలని ఆదేశించింది. కానీ.. కోర్టు ఆదేశాలు అందలేదని.. తమకింకా కోర్టు ఆదేశాలు అందలేదని చెబుతూ.. అధికారులు తమ పని చేసుకుంటూ ముందుకు పోయారు. అలా ఓ మసీదు గోడ, గేటును సైతం కూల్చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు 12 గంటల ప్రాంతంలో సీపీఎం నేత బృందా కారత్.. కోర్టు ఫిజికల్ కాపీతో అక్కడికి చేరుకున్నారు. కూల్చివేత ఆపేయాలంటూ ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు బల్డోజర్‌కు ఎదురెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన వీడియో సైతం ఒకటి బయటకు వచ్చింది. "The MCD is ignoring the Supreme Court's order staying the demolition. I am here to stop the demolitions and see to it that the court order is implemented": Brinda Karat, CPI(M) leader pic.twitter.com/x34D6oYzit — NDTV (@ndtv) April 20, 2022 స్పందించిన సీజే.. అదే సమయంలో సుప్రీం కోర్టులో పిటిషనర్ సైతం కూల్చివేత ఆగలేదనే విషయం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు వాళ్లకు(ఢిల్లీ మున్సిపల్ అధికారులకు) అందలేదని, దయచేసి ఈ విషయం వాళ్లకు తెలియజేయాలని సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కోరారు. అంతేకాదు మీడియాలోనూ ఇది చూపిస్తున్నారని, ఇది సరైందని కాదని, ఆలస్యమైతే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో.. సెక్రటరీ జనరల్ ద్వారా గానీ, సుప్రీం కోర్టు రిజిస్టర్ జనరల్ ద్వారాగానీ తక్షణమే మున్సిపల్ అధికారులతో మాట్లాడించాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. న్యాయవాది దవే నుంచి సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లు తీసుకుని.. సుప్రీం ఆదేశాల గురించి తెలియజేయాలని కోర్టు సిబ్బందిని ఆదేశించారు. అలా రెండు గంటల హైడ్రామా తర్వాత.. ఎట్టకేలకు ఢిల్లీ జహంగీర్‌పురి బుల్డోజర్ కూల్చివేతలు నిలిచిపోయాయి. ఇక పిటిషన్‌పై స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు.. గురువారం వాదనలు విననుంది. -
వడ్డీ రేట్లు యథాతథం: ఆర్బీఐ
ముంబై, సాక్షి: వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటును యథాతథంగా 4 శాతం వద్దనే కొనసాగించేందుకు మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) తాజాగా నిర్ణయించింది. ద్వైపాక్షిక పరపతి విధాన సమీక్షలో భాగంగా రిజర్వ్ బ్యాంక్ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన ఎంపీసీ మూడు రోజులపాటు సమాశాలు నిర్వహించింది. దీనిలో భాగంగా యథాతథ పాలసీ అమలుకే కట్టుబడుతున్నట్లు ఏకగ్రీవంగా ప్రకటించింది. దీంతో రివర్స్ రెపో రేటు 3.35 శాతం వద్ద కొనసాగనుంది. అంచనాల సవరణ ఈ ఆర్థిక సంవత్సరానికి(2020-21) జీడీపీపై తొలుత వేసిన -9.5 శాతం అంచనాలను ఆర్బీఐ తాజాగా -7.5 శాతానికి సవరించింది. ద్వితీయార్థం(అక్టోబర్- మార్చి)లో ఆర్థిక వ్యవస్థ సానుకూల వృద్ధిని సాధించనున్నట్లు భావిస్తోంది. ఈ బాటలో క్యూ3(అక్టోబర్-డిసెంబర్)లో 0.1 శాతం వృద్ధి సాధించవచ్చని ఊహిస్తోంది. ఇంతక్రితం 5.6 శాతం క్షీణతను అంచనా వేయడం గమనార్హం. ఇదే విధంగా క్యూ4(జనవరి- మార్చి)కి జీడీపీ వృద్ధి అంచనాలను సైతం 0.5 శాతం నుంచి 0.7 శాతానికి పెంచింది. కాగా.. క్యూ3లో రిటైల్ ధరలు(సీపీఐ) 6.8 శాతంగా నమోదుకావచ్చని ఆర్బీఐ తాజాగా అంచనా వేసింది. క్యూ4లో 5.8 శాతానికి దిగిరావచ్చని భావిస్తోంది. -
యథాతథ పాలసీ అమలుకే ఆర్బీఐ ఓటు
ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ అధ్యక్షతన మూడు రోజులపాటు నిర్వహించిన పరపతి సమీక్షలో భాగంగా ఎంపీసీ యథాతథ పాలసీ అమలుకే ఓటేసింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతంగా అమలుకానుంది. ఇదేవిధంగా రివర్స్ రెపో 3.35 శాతం వద్ద, మార్జినల్ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.2 శాతంగా అమలుకానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో దేశ జీడీపీ 9.5 శాతం క్షీణించే వీలున్నట్లు ఆర్బీఐ తాజాగా అంచనా వేసింది. క్యూ4(జనవరి-మార్చి21)కల్లా ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టేవీలున్నట్లు అభిప్రాయపడింది. వ్యవసాయం, కన్జూమర్ గూడ్స్, పవర్, ఫార్మా రంగాలు వేగంగా రికవర్ అయ్యే వీలున్నట్లు ఆర్బీఐ పేర్కొంది. కాగా.. కోవిడ్-19 ప్రభావంతో ఆర్థిక పురోగతి మైనస్‌లోకి జారడంతోపాటు.. రిటైల్ ధరలు లక్ష్యానికంటే ఎగువనే కొనసాగుతున్నాయి. ఆరు నెలలుగా వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 6 శాతంకంటే అధికంగా నమోదవుతోంది. 4 శాతం స్థాయిలో సీపీఐను కట్టడి చేయాలన్నది ఆర్బీఐ లక్ష్యంకాగా.. ఆహార ధరలు అధిక స్థాయిలలో కొనసాగడం ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆగస్ట్ నెలలోనూ సీపీఐ 6.69 శాతానికి ఎగసింది. ముగ్గురు సభ్యుల ఎంపికలో ఆలస్యంకారణంగా గత నెలాఖరున వాయిదా పడిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశాలు నేడు ముగిశాయి. ఇప్పటికే 2.5 శాతం కోత 2019 ఫిబ్రవరి మొదలు ఆర్బీఐ ఇప్పటివరకూ రెపో రేటులో 2.5 శాతం(250 బేసిస్ పాయింట్లు) కోత విధించింది. 2020 ఫిబ్రవరి నుంచి చూస్తే 1.15 శాతం తగ్గించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో నిర్వహించిన సమీక్షలో యథాతథ పాలసీ అమలుకే ఆర్బీఐ మొగ్గు చూపింది. దీంతో ఇప్పటివరకూ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతం, రివర్స్ రెపో 3.35 శాతం చొప్పున అమలవుతున్నాయి. అయితే భవిష్యత్‌లో అవసరమైతే కీలక రేట్లలో మార్పులు చేపట్టడం ద్వారా తగిన చర్యలు తీసుకునే వీలున్నట్లు పేర్కొంది. ఎంపీసీ ఇలా ఆరుగురు సభ్యులలో ముగ్గురుని కొత్తగా ఎంపిక చేయడంలో జరిగిన ఆలస్యంకారణంగా గత నెలలో జరగవలసిన ఎంపీసీ సమావేశాలు అక్టోబర్‌కు వాయిదా పడ్డాయి. ఈ నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం ఆషిమా గోయల్, శశాంక బిడే, జయంత్ వర్మలను ఎంపీసీ సభ్యులుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే. -
చైనాకు భారత్ స్ట్రాంగ్ వార్నింగ్
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్-చైనాల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఆరవ రౌండ్ కార్పస్ కమాండర్-స్థాయి చర్చలు చైనా భూభాగంలోని మోల్డోలో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదలై రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చల్లో భారత్ ప్రధానంగా ఘర్షణాత్మక ప్రాంతాల్లో నుంచి చైనా బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఐదు అంశాల ఒప్పందం అమలు లక్ష్యంగా చర్చలు జరిగాయి. చైనా మొదట తన దళాలను వెనక్కి రప్పించాలని భారత్ కోరినట్లు సమాచారం. చైనానే మొదట చొరబాటుకు ప్రయత్నించింది కనుక.. ముందు అదే వెనక్కి తగ్గాలని భారత్ ఆశిస్తున్నట్లు తెలిసింది. (చదవండి:అంతర్జాతీయ సంకేతాలే కీలకం...) ప్యాంగ్యాంగ్ త్సో, హాట్‌స్ప్రింగ్స్, డెప్సాంగ్, ఫింగర్ ఏరియాలో తక్షణమే చైనా దళాలు ఉపసంహరించుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఒకవేళ చైనా యథాతథ స్థితిని పునరుద్ధరించకపోతే.. భాతర దళాలు సుదీర్ఘకాలం మోహరిస్తాయని హెచ్చరించింది. ఇప్పటి వరకు జరిగిన ఐదు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ లేకుండానే ముగిసిన విషయం తెలిసిందే. ఇక నిన్నటి చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి లేహ్ ఆధారిత 14 కార్పస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నాయకత్వం వహించగా.. చైనా వైపు సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ నేతృత్వం వహించినట్లు తెలిసింది. -
మా దళాలు ఎల్ఏసీని దాటలేదు: చైనా
న్యూఢిల్లీ: చైనా దళాలు తూర్పు లద్దాఖ్, ప్యాంగ్యాంగ్ త్సో సరస్సు ప్రాంతాల్లో యథాతథ స్థితిని మార్చేందుకు ప్రయత్నించినట్లు భారత్ ప్రకటించిన కొన్ని గంటల వ్యవధిలోనే చైనా దీనిపై స్పందించింది. తమ ఆర్మీ ఎల్ఏసీని దాటలేదని స్పష్టం చేసింది. భారత్‌తో తాజా సరిహద్దు వివాదంపై చైనా విదేశాంగ శాఖ ప్రతినిధి జావో లిజియన్ మాట్లాడుతూ పీఎల్ఏ(పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ) దళాలు ఎల్ఏసీని ఎప్పుడూ దాటలేదని తెలిపారు. సరిహద్దు వివాదానికి సంబంధించి ఇరు దేశాల మధ్య చర్చలు నడుస్తున్నాయన్నారు. ఆగస్టు 29న ఎల్ఏసీ వెంబడి యథాతథ స్థితిని మార్చడానికి గాను 150-200 మంది చైనా సైనికులు ప్రయత్నించినట్లు భారత సైన్యం గుర్తించింది. వెంటనే రంగంలోకి దిగిన ఇండియన్ దళాలు.. డ్రాగన్ చర్యలను తిప్పికొట్టాయి. (చదవండి: చైనా కవ్వింపు చర్యలు.. బదులిచ్చిన భారత్) మే నెలలో ఇరు దేశాల మధ్య ఘర్షణ జరిగిన దక్షిణ బ్యాంకు పరిసర ప్రాంతాల్లో చైనా శిబిరాలను ఏర్పాటు చేయడమే కాక.. మౌళిక సదుపాయాలను పెంచే ప్రయత్నం చేస్తోంది. చైనా కదలికలను గమనించిన భారత సైన్యం పీఎల్ఏ చర్యలను అడ్డుకున్నట్లు ఆర్మీ వర్గాలు తెలిపాయి. తూర్పు లద్దాఖ్‌లో కొనసాగుతున్న ప్రతిష్టంభనపై ఇరు దేశాల మధ్య సైనిక, దౌత్యపరమైన చర్చలు జరుగుతున్నాయి. ఉద్రిక్తతలను తగ్గించే క్రమంలో ప్రస్తుతం చుషుల్ వద్ద బ్రిగేడ్ కమాండర్ స్థాయిలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్న సంగతి తెలిసిందే. -
ఆర్బీఐ దెబ్బ, చివరికి నష్టాలే
సాక్షి,ముంబై: దేశీయ స్టాక్‌మార్కెట్లు చివరికి నష్టాల్లో ముగిసాయి. ఆర్బీఐ ఊహించని విధంగా వడ్డీరేట్లపై యథాతథ నిర్ణయాన్ని ప్రకటించడంతో కీలక సూచీలు లాభ నష్టాల మధ్య తీవ్రంగా ఊగిసలాడాయి. 100పాయింట్లకు పైగా ఎగిసిన మార్కెట్లు చివరికి నష్టాలను మూటగట్టుకున్నాయి. సెన్సెక్స్ 70 పాయింట్లు క్షీణించి 40779 వద్ద, నిఫ్టీ 25 పాయింట్లు నష్టపోయి 12018 వద్ద ముగిసాయి. తద్వారా 12050 స్థాయిని కోల్పోయింది. నిఫ్టీ బ్యాంకు 400 పాయింట్లు కుప్పకూలింది. అలాగే సెన్సెక్స్ డే హై నుంచి 223 పాయింట్లు, నిఫ్టీ 63 పాయింట్లు కోల్పోయింది. ఐటీ తప్ప దాదాపు అన్ని రంగాలు నష్టపోగా, ఆర్బీఐ దెబ్బతో బ్యాంకింగ్ రంగ షేర్లు కుదేలయ్యాయి. వీటితోపాటు జెఎస్ డబ్ల్యు స్టీల్, కోల్ ఇండియా, భారతి ఎయిర్టెల్, టాటా స్టీల్, గ్రాసింగ్, టాటా మోటార్స్, బీపీసీఎల్, సిప్లా, హీరోమోటో, గెయల్ నష్టపోగా జీ, టీసీఎస్, ఐటీసీ, ఎల్ అండ్‌టీ, బ్రిటానియాటాప్ గెయినర్స్‌గా నిలిచాయి. -
ఎన్నాళ్లీ ‘వృక్షసంహారం’?
మానవాళికి చెట్లు చేసే మేలేమిటో తెలుసుకోవడానికి ఎవరూ గూగుల్‌ను ఆశ్రయించనవసరం లేదు. పర్యావరణవేత్తలు చెబితే తప్ప తెలియని వారెవరూ లేరు. చెట్ల ఉపయోగాల గురించి బడి చదువుల దగ్గరనుంచి గురువులు నూరిపోయడమే ఇందుకు కారణం. దురదృష్టమేమంటే అధికార పీఠాలపై ఉన్న నేతలు, ఉన్నతాధికార వర్గంలో పనిచేస్తున్నవారు ఏ బళ్లో చదువుకుని ఆ స్థాయికి ఎదిగారోగానీ... దేశంలో ‘అభివృద్ధి’ పేరు చెప్పి వృక్ష సంహారం జరగని రోజంటూ దేశంలో ఉండటం లేదు. ఇప్పుడు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్(ఎంఎంఆర్‌సీ) వంతు వచ్చింది. పర్యవ సానంగా ఆ మహానగరం శివార్లలోని ఆరే కాలనీకి మూడింది. అందులోని వేల చెట్లు నేలకొరి గాయి. ఈ చెట్లను కాపాడటానికి గత నాలుగేళ్లుగా ఆ కాలనీ వాసులు, పర్యావరణ ఉద్యమకారులు చేయని పోరాటమంటూ లేదు. 2015లో వారి ఒత్తిడికి తలొగ్గి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీకి అనేక ప్రత్యామ్నాయ ప్రతిపాదనలొచ్చాయి. వాటిల్లో ఏ ఒక్కటీ తమకు ఉపయోగపడదంటూ మెట్రో రైల్ కార్పొరేషన్ తిరస్కరించింది. చివరకు ఆరే కాలనీలో ఓ చీకటి రాత్రి చెట్లు కూల్చే పని ప్రారంభం కాగానే జనం అడ్డుకున్నారు. హైకోర్టును ఆశ్రయించారు. కానీ స్టే ఇవ్వడానికి శనివారం న్యాయస్థానం నిరాకరించడంతో సోమవారం వారు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఈనెల 21 వరకూ యధాతథ స్థితిని కొనసాగించమని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. చిత్రమేమంటే ఈలోగానే... అంటే రెండురోజుల్లోనే 2,141 చెట్లు నేలకూలాయి. ముంబై మహా నగర జనాభా దాదాపు రెండు కోట్లు. అక్కడ రోజూ 80 లక్షలమంది ప్రయా ణీకులు(దాదాపు ఇజ్రాయెల్ జనాభా పరిమాణం) ఇప్పుడున్న సిటీ రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తారు. ప్రస్తుతం ఉన్న రెండు మెట్రో లైన్లకు తోడు మరో లైన్ నిర్మిస్తే అంధేరీ ఈస్ట్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి, శాంతాక్రజ్‌లోని దేశీయ విమానాశ్రయానికి, నగర పరిసరాల్లోని ప్రధాన ప్రాంతాలకూ కూడా రవాణా సౌకర్యం విస్తరిస్తుందని, రోజూ 17 లక్షలమందికి ఉపయో గపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. దాన్నెవరూ కొట్టిపారేయడం లేదు. కానీ అందుకు నగరా నికి ప్రాణవాయువును అందిస్తున్న ఆరే ప్రాంత వృక్షజాలాన్ని ధ్వంసం చేయాలా అని ప్రశ్నిస్తు న్నారు. ఈ కాలనీకి చేర్చి ఉన్న సంజయ్ గాంధీ జాతీయ పార్క్ వన్యమృగాలకూ, వందలాది రకాల పక్షులకూ నిలయం. ఈ పక్షుల్లో అనేకం ఆరే కాలనీ వాసుల్ని కూడా పలకరిస్తాయి. కను విందు చేస్తాయి. భిన్న జాతుల పక్షుల్ని వీక్షించడానికి, తమ కెమెరాల్లో బంధించడానికి విహంగ ప్రేమికులు నిత్యం ఇక్కడికొస్తారు. దీనికి ‘మినీ కశ్మీర్’గా పేరుంది. ఉరుకుల, పరుగుల జీవితాలకు కాస్తంత విరామం ఇచ్చి, ప్రశాంతంగా స్వచ్ఛమైన వాయువు పీల్చి పునీతులు కావడానికి నగర వాసుల్లో అత్యధికులు ఎన్నుకునే చోటిది. ఇక్కడున్న లక్షలాది వృక్షాల్లో అనేకం 110 ఏళ్లపైబడినవి. దాదాపు 3,180 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ చెట్లనుంచి వీచే గాలిని ఆస్వాదిస్తూ వందలమంది ఇక్కడ సైక్లింగ్, జాగింగ్ చేస్తుంటారు. మెట్రో రైలు అయినా, మరొకటైనా నగర ప్రజలకు ఉపయో గపడేదే కావొచ్చు. కానీ అందుకోసం ఇంత ప్రాణప్రదమైన ప్రాంతాన్ని పాక్షికంగానైనా నాశనం చేయవచ్చా? మెట్రో రైలు బోగీలను పరిశుభ్రం చేయడం, వాటికి అవసరమైన మరమ్మత్తులు చేయడం వంటి అవసరాలకు షెడ్లు నిర్మించడం కోసం ఈ చెట్ల కూల్చివేత పర్వం మొదలైంది. ముంబైతో సహా మన మహానగరాలు వేల కోట్లు ఆర్జించే పెట్టే బంగారు గనులే కావొచ్చు. అక్కడ అనేకులకు ఉపాధి దొరుకుతుండవచ్చు. కానీ వాటికి కావలసినంత అపకీర్తి కూడా ఉంది. అందులో అనేకం కాలుష్యకారకాలు. ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత నగరాలు 20 ఉంటే అందులో 15 మన నగరాలే! తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రపంచంలోని 15 నగరాల్లో మన వాటా 11! ఈ నగరాల వాతావరణంలో, ఇక్కడి తాగునీటిలో మృత్యువు దాగుందని నిపుణులు చాన్నాళ్లుగా చెబుతున్నారు. నగర పౌరుల ఊపిరితిత్తుల్లోకి కొంచెం కొంచెంగా చొరబడుతున్న కాలుష్యం వారిని రోగగ్రస్తులుగా మారుస్తోంది. కేన్సర్, గుండె జబ్బులు వగైరాలకు కారణ మవుతోంది. అనేకుల్లో అకాల వృద్ధాప్యాన్ని కలిగిస్తోంది. వారిని పనిపాటలకు దూరం చేస్తోంది. ఇదంతా మన పాలకులకు ఆందోళన కలిగించాలి. దీన్ని సరిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి పురిగొల్పాలి. ఆరే కాలనీ తరహాలో చెట్లు పెంచాలి. తొలగించకతప్పదను కుంటే ఆ చెట్లను మరొకచోట పాతడానికి ప్రయత్నించవచ్చు. కానీ జరుగుతున్నదంతా అందుకు విరుద్ధం. ప్రపంచ అధ్యయన సంస్థలు చెబుతున్న వాస్తవాలేవీ వారిలో కదలిక తీసుకురావడం లేదు. ఇల్లు కట్టుకుందామనో, ఉన్న ఇంటిని విస్తరించుకుందామనో ఎవరైనా తమ ఆవరణలో చెట్లు కొట్టాలంటే అందుకు అనుమతులు తీసుకోవడం అవసరం. కానీ తమకు అలాంటి నిబంధనలు వర్తించవన్నట్టు అధికార యంత్రాంగాలు ప్రవర్తిస్తున్నాయి. ఆరే కాలనీ చెట్ల నరికివేత వ్యవహారం తీసుకుంటే చట్ట ప్రకారం పాటించాల్సిన నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కారు. 1975నాటి చట్టం ప్రకారం ఏ చెట్టు తొలగించాలన్నా అందుకు అనుమతి ఉండాలి. అలా తొలగించడానికి పక్షం రోజులముందు ప్రజలందరికీ తెలిసేలా ఆ అనుమతిని పత్రికల్లో ప్రచురించాలి. ఆరేళ్లక్రితం బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం సంబంధిత సంస్థలు తమ తమ వెబ్సైట్లలో అనుమతి కాపీలను అప్లోడ్ చేయాలి. కానీ ఆరే కాలనీ చెట్ల కూల్చివేతలో ఈ నిబంధనలేవీ పాటించలేదు. చెట్లు కూల్చడం మొదలుపెట్టిన శుక్రవారం రాత్రే అనుమతి కాపీని కూడా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెబ్సైట్లో ఆదరా బాదరాగా అందుబాటులోకి తెచ్చారు. పాలనా సంస్థలే ఇలా చట్టాల్ని ధిక్కరించే స్థితికి దిగజారడం, ప్రశ్నించినవారిని నిర్బంధించడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది. -
ప్రభాస్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట
సాక్షి, హైదరాబాద్ : సినీహీరో ప్రభాస్‌కు హైకోర్టులో స్వల్ప ఊరట లభించింది. ఆయన పిటిషన్‌ను విచారించిన హైకోర్టు ప్రభాస్ గెస్ట్‌హౌజ్ సీజ్ చేసిన వ్యవహారంలో స్టేటస్ కో ఉత్తర్వులను జారీచేసింది. అక్కడ యధాతథంగా పరిస్థితి కొనసాగించాలని తెలిపింది. శేరిలింగంపల్లి మండల పరిధిలోని రాయదుర్గం సర్వే నెంబర్ 46లో గల ప్రభాస్ గెస్ట్‌హౌజ్‌ను నాలుగు రోజుల క్రితం రెవెన్యూ అధికారులు సీజ్ చేసిన విషయం తెలిసిందే. కాగా గతంలో ఈ భూమిని జీవో నంబర్ 59 కింద రెగ్యులరైజ్ చేయాలని కోరుతూ ప్రభాస్ దరఖాస్తు చేసుకున్నట్టుగా తెలిసింది. (హైకోర్టును ఆశ్రయించిన ప్రభాస్) సర్వే నంబర్ 46లోని స్థలం ప్రభుత్వ స్థలం గా సుప్రీంకోర్టు ఆదేశాలు ఇచ్చింది. ఈ సర్వే నంబర్లో 84.30 ఎకరాల స్థలం ఉన్నట్లు తెలిసింది. ఇందులో 2,200 గజాల్లో ప్రభాస్ గెస్ట్‌హౌజ్‌ను నిర్మించారు. దీంతో ప్రభుత్వ స్థలంలోని నిర్మాణాలను సీజ్ చేసి రెవెన్యూ అధికారులు నోటీసులు అంటించారు. దీనిని సవాల్ చేస్తూ హైకోర్టులో ప్రభాస్ పిటిషన్ వేశారు. స్పందించిన హైకోర్టు గెస్ట్‌హౌజ్ సీజ్ వ్యవహారంలో యధాతథ స్థితిని కొనసాగించాలని ఉత్తర్వులిచ్చింది. కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ నెల 31కి విచారణ వాయిదా వేసింది. -
యథాతథంగా ఆర్బీఐ కీలక వడ్డీరేట్లు
సాక్షి, ముంబై: రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పాలసీ రివ్యూను ప్రకటించింది. ఆర్బీఐ చేపట్టిన ద్వైమాసిక సమీక్షలో అంచనాలకు అనుగుణంగానే కీలక వడ్డీరేట్లను యథాతథంగా ఉంచింది. రెపోను 6.0 శాతంగా, రివర్స్ రెపోను 5.75 శాతంగానే ఉంచుతున్నట్టు తెలిపింది. కాగా.. బ్యాంక్ రేటు 6.25 శాతంగా ఉంది. ఆరుగురు మానిటరీ పాలసీ సభ్యుల్లో అయిదుగురు యథాతథానికి ఓటు వేశారు. మైఖేల్ పాత్రో ఒక్కరే వడ్డీరేటు పెంపువైపు మొగ్గు చూపారు. దీంతో నిఫ్టీ ప్రభుత్వ రంగ బ్యాంకింగ్ షేర్లలో పాజిటివ్ ధోరణి కనిపిస్తోంది. తొలి క్వార్టర్లో వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 4.4 శాతం నుంచి 5.1 శాతానికి పుంజుకుంటుందని ఆర్బీఐ అంచనా వేసింది. కాగా.. 2018-19లో రియల్ జీడీపీ వృద్ధి 7.4 శాతంగా నమోదుకావచ్చని విశ్లేషించింది ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి ఆర్బీఐ మొదటి పరపతివిధాన సమీక్ష ఇది. గ్లోబల్ అనిశ్చితి, ద్రవ్యోల్బణం, పెరుగుతున్న ముడి చమురు ధరలు ఆర్బీఐ నిర్ణయాన్ని ప్రభావితం చేసినట్టు ఎనలిస్టులు భావిస్తున్నారు. -
టాటా గ్రూపునకు ఊరట
న్యూఢిల్లీ: టాటా మిస్త్రీ వివాదంలో తంటాలు పడుతున్న టాటా గ్రూపునకు సుప్రీంకోర్టు ఊరటనిచ్చింది. టాటా గ్రూప్‌నకు చెందిన ఇండియన్ హోటల్స్ కు చెందిన ప్రతిష్ఠాత్మక తాజ్ మాన్సింగ్ హోటల్ వేలం ప్రక్రియలో యథాతథ స్థితిని కొనసాగించాలని సుప్రీంకోర్టు గురువారం ఆదేశించింది. తాజ్ మాన్సింగ్ హోటల్ వేలాన్ని అడ్డుకోవాలన్న ఇండియన్ హోటల్స్ కంపెనీ లిమిటెడ్ (ఐహెచ్సిఎల్). పిటీషన్ ను విచారించిన న్యాయమూర్తులు పీసీ ఘోష్, యుయు లలిత్ నేతృత్వంలోని ధర్మాసనం ఈ ఆదేశాలు జారీచేసింది.. ఎన్డీఎంసీ (న్యూఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ ) పిటీషన్ ను తిరస్కరించిన కోర్టు అత్యద్భతమైన ఈ ప్రాచీన హోటెల్ ను కాపాడుకోవాల్సిన అవసరం ఉందని వ్యాఖ్యానించింది. నడుస్తున్న హోటల్ కు సంబంధించి తాజా బుకింగ్స్ అడ్డుకోవడం కష్టమని, సంయమని పాటించాలని పేర్కొంది. తదుపరి వాదనల సందర్భంగా దీనిపై నిర్ణయం తీసుకోవచ్చని తెలిపింది. అనంతరం తదుపరి విచారణను జనవరి రెండో వారానికి వేసింది కాగా ఢిల్లీలోని మాన్సింగ్ రోడ్డులో అత్యంత కీలకమైన ప్రాంతంలో ఇండియన్ హోటల్స్‌కు ఎన్డీఎంసీ 33 ఏళ్లకు లీజుకు ఇచ్చింది. ఈ గడువు 2011తో ముగిసింది. తదుపరి 9 సార్లు లీజును పొడిగించారు. ఈ వివాదంలో ఈ హెటెల్ వేలానికి ఎన్డీఎంసీ నిర్ణయించింది. అయితే దీన్ని నిలిపి వేయాలని కోరుతూ 2013 ఏప్రిల్‌లో ఢిల్లీ హైకోర్టులో ఇండియన్ హోటల్స్ పిటిషన్‌ను ఢిల్లీ హైకోర్టు నవంబర్ 8న కొట్టివేసింది. దీనిపై ఇండియన్ హెటల్స్ సుప్రీంను ఆశ్రయించింది. -
అరుణాచల్ లో ప్రభుత్వ ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్
న్యూఢిల్లీ: రాజకీయ సంక్షోభం బారిన అరుణాచల్ ప్రదేశ్ లో ప్రభుత్వ ఏర్పాటుకు అడ్డంకులు తొలిగిపోయాయి. అరుణాచల్ లో రాష్ట్రపతి పాలనపై విధించిన స్టేటస్ కోను సుప్రీంకోర్టు గురువారం ఎత్తివేసింది. కొత్త ప్రభుత్వం చేత ప్రమాణ స్వీకారం చేయించకుండా గవర్నర్‌ను నియంత్రించటంతో పాటు యథాతథ స్థితిని కొనసాగిస్తూ ఆదేశాలు జారీ చేయాలన్న కాంగ్రెస్ అభ్యర్థనను అత్యున్నత న్యాయస్థానం నిన్న తిరస్కరించింది. రాష్ట్రపతి పాలనను ఉపసంహరించాలని రాష్ట్రపతికి కేంద్ర కేబినెట్ బుధవారం సిఫారసు చేసింది. కొత్త ప్రభుత్వం ఏర్పాటుకు తమకు మెజారిటీ ఉందని కాంగ్రెస్ అసమ్మతి నేత పుల్ సారథ్యంలోని 31 మంది ఎమ్మెల్యేలు సోమవారం గవర్నర్‌ను కలిశారు. 60 మంది సభ్యులున్న అరుణాచల్ అసెంబ్లీలో కాంగ్రెస్‌కు 47 మంది సభ్యులుండగా.. అసమ్మతి నేత కాలిఖోపుల్ సారథ్యంలో 21 మంది అధికార పార్టీ ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయటం తెలిసిందే. నబమ్ టుకీ సీఎంగా గల ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు 11 మంది బీజేపీ ఎమ్మెల్యేలు, ఇద్దరు స్వతంత్ర సభ్యులు మద్దతిచ్చారు. -
కోడి పందేలపై స్టేటస్ కో
హైకోర్టు ఉత్తర్వులను నిలుపుదలచేసిన సుప్రీంకోర్టు సాక్షి, హైదరాబాద్, న్యూఢిల్లీ: కోడి పందేల నిర్వహణ విషయంలో హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన ఉత్తర్వులను సుప్రీంకోర్టు సోమవారం నిలుపుదల చేసింది. ఈ మొత్తం వ్యవహారంలో యథాతథస్థితి (స్టేటస్ కో) కొనసాగించాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ కేసును తిరిగి విచారించాలని హైకోర్టుకు స్పష్టం చేసింది. అప్పటివరకు యథాతథస్థితి కొనసాగుతుందని తేల్చి చెప్తూ.. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ హెచ్.ఎల్.దత్తు, న్యాయమూర్తి జస్టిస్ ఎ.కె.సిక్రిల నేతృత్వంలోని ధర్మాసనం ఉత్తర్వులు జారీ చేసింది. పశ్చిమగోదావరి జిలా ఏలూరుకు చెందిన నరహరి జగదీష్‌కుమార్ కోడి పందేలపై ఇటీవల హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు. దాన్ని విచారించిన ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని ధర్మాసనం, కోడి పందేలు, జూదం, అక్రమ మద్యం అమ్మకాలు చేపట్టే వారిపై చర్యలు తీసుకోవాలని పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీకి ప్రభుత్వం నుంచి సూచనలు ఉన్నందున, వాటిని అర్థవంతంగా అమలు చేయాలని ఆదేశాలు జారీ చేసింది. దీన్ని సవాల్ చేస్తూ బీజేపీ నాయకుడు రఘురామకృష్ణంరాజు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. హైకోర్టు ఉత్తర్వులను రద్దు చేయాలని కోరారు. యానిమల్ వెల్ఫేర్ బోర్డ్ ఆఫ్ ఇండియా, పీపుల్స్ ఫర్ యానిమల్స్ సంస్థలు ఈ కేసులో ఇంప్లీడ్ పిటిషన్ దాఖలు చేశాయి. వాటన్నింటిపై ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు నేతృత్వంలోని ధర్మాసనం విచారణ చేపట్టింది. సోమవారం పిటిషనర్ రఘురామకృష్ణంరాజు తరఫు న్యాయవాది అనూప్చౌదరి తమ వాదనలు వినిపించారు. చివరికి ప్రధాన న్యాయమూర్తి హెచ్.ఎల్.దత్తు గత నెల 29న హైకోర్టు ధర్మాసనం ఇచ్చిన తీర్పును పక్కన పెడుతున్నామని ఆదేశాలు జారీచేశారు. కోడి పందేలపై దాఖలైన పిల్‌పై తిరిగి విచారణ చేపట్టాలని హైకోర్టును ఆదేశించింది. హైకోర్టు తుది ఉత్తర్వు లు ఇచ్చే వరకూ యథాతథస్థితిని కొనసాగించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఇక యథాతథస్థితి విషయంలో ఎవరికి వారు తమ తోచిన భాష్యాలు చెప్పుకుంటున్నారు. కోడి పందాలు జరపొద్దనే కోర్టు ఉద్దేశమని పీపుల్స్ ఫర్ యానిమల్స్ సంస్థ ప్రతినిధిగౌరీములేఖీ చెప్పగా, పందేలకు తీర్పు అనుకూలమేనని రఘు రామకృష్ణంరాజు తరపు న్యాయవాదులు చెప్తున్నారు. -
మందుబాబులకు కాస్త ఊరట
మందుబాబులకు సుప్రీంకోర్టు కాస్తంత ఊరటనిచ్చింది. కేరళలో బార్లు ఈ నెలాఖరు వరకు మద్యం అమ్ముకోవచ్చంటూ స్టేటస్ కో (యథాతథ స్థితి) కొనసాగించాలని ఉత్తర్వులిచ్చింది. జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ యు.యు. లలిత్‌లతో కూడిన సుప్రీంకోర్టు బెంచి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సంపూర్ణ మద్య నిషేధం విధిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ బార్ యజమానులు దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించాలని కేరళ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది. హైకోర్టు ఈ మొత్తం వ్యవహారాన్ని నెలాఖరులోగా తేలుస్తుందన్న ఆశాభావాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఒక్క ఫైవ్ స్టార్ హోటళ్లలో తప్ప రాష్ట్రంలో మరెక్కడా మద్యం అమ్మకూడదంటూ కేరళ ప్రభుత్వం విధించిన నిషేధం గురువారం రాత్రి 11 గంటల నుంచి అమలులోకి వస్తుంది. ఇస్పుడు సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఇటు బార్ యజమానులకు, అటు మందుబాబులకు కూడా కొంతమేర ఊరట కలుగుతుంది. -
ఏపీ ఎన్జీవో భూములపై హైకోర్టు స్టేటస్కో
హైదరాబాద్: ఏపీ ఎన్జీవో భూములపై హైకోర్టు స్టేటస్కో విధించింది. విచారణను కోర్టు 4 వారాలకు వాయిదా వేసింది. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి మండలం గోపనపల్లి సర్వే నెంబర్ 36, 37లలోని 189 ఎకరాలను 2004లో వైఎస్ రాజశేఖర రెడ్డి ప్రభుత్వం ఏపి ఎన్జీఓ సోసైటీకి కేటాయించింది. అయితే అప్పటి నుంచి ఇక్కడ నిర్మాణాలు ఏమీ జరగలేదు. ఆ కారణం చూపుతూ ఆ భూమి స్వాధీనానికి తెలంగాణ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రభుత్వం ఆదేశాల మేరకు రాజేంద్రనగర్ ఆర్డీవో సురేష్ ఒడ్డార్, శేరిలింగంపల్లి తహశీల్దార్ విద్యాసాగర్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆ భూమిని స్వాధీనం చేసుకున్నారు. ఈ భూముల్లో ప్రభుత్వ భూములు అని బోర్డు కూడా పెట్టారు. ఇదిలా ఉండగా, ఈ భూములకు సంబంధించి సుప్రీం కోర్టులో కేసులు ఉన్నందునే అక్కడ ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని ఏపీ ఏన్జీవో అధ్యక్షుడు అశోక్‌బాబు వివరణ ఇచ్చారు. ఈ వ్యవహారాన్ని రాజకీయ కోణంలో చూడరాదని ఆయన కోరారు. తెలంగాణ ప్రభుత్వ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఏపీఎన్జీవోల సంఘం హైకోర్టును ఆశ్రయించింది. ఆ భూములపై హైకోర్టు స్టేటస్కో విధించింది.