మందుబాబులకు కాస్త ఊరట
మందుబాబులకు సుప్రీంకోర్టు కాస్తంత ఊరటనిచ్చింది. కేరళలో బార్లు ఈ నెలాఖరు వరకు మద్యం అమ్ముకోవచ్చంటూ స్టేటస్ కో (యథాతథ స్థితి) కొనసాగించాలని ఉత్తర్వులిచ్చింది. జస్టిస్ అనిల్ ఆర్ దవే, జస్టిస్ యు.యు. లలిత్లతో కూడిన సుప్రీంకోర్టు బెంచి ఈ మేరకు ఆదేశాలు జారీ చేసింది. సంపూర్ణ మద్య నిషేధం విధిస్తూ కేరళ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సవాలు చేస్తూ బార్ యజమానులు దాఖలు చేసిన పిటిషన్ను విచారించాలని కేరళ హైకోర్టుకు సుప్రీం ధర్మాసనం సూచించింది.
హైకోర్టు ఈ మొత్తం వ్యవహారాన్ని నెలాఖరులోగా తేలుస్తుందన్న ఆశాభావాన్ని సుప్రీంకోర్టు వ్యక్తం చేసింది. ఒక్క ఫైవ్ స్టార్ హోటళ్లలో తప్ప రాష్ట్రంలో మరెక్కడా మద్యం అమ్మకూడదంటూ కేరళ ప్రభుత్వం విధించిన నిషేధం గురువారం రాత్రి 11 గంటల నుంచి అమలులోకి వస్తుంది. ఇస్పుడు సుప్రీంకోర్టు ఉత్తర్వులతో ఇటు బార్ యజమానులకు, అటు మందుబాబులకు కూడా కొంతమేర ఊరట కలుగుతుంది.