ముంబై: అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను ఊహించినట్లే యథాతథంగా ఉంచడంతో పాటు సరళతర ద్రవ్య విధాన అమలు వ్యాఖ్యలు ఈక్విటీ మార్కెట్లలో సానుకూలతలు నింపాయి. దేశీయంగా వాహన విక్రయాలు రికార్డు గరిష్టానికి చేరుకోవడం, జీఎస్‌టీ వసూళ్లు పెరగడం, కార్పొరేట్ క్యూ2 ఆర్థిక ఫలితాలు మెప్పించడం కలిసొచ్చాయి. ఫలితంగా గురువారం సెన్సెక్స్ 490 పాయింట్లు పెరిగి 64,081 వద్ద స్థిరపడింది.
నిఫ్టీ 144 పాయింట్లు బలపడి 19,133 వద్ద నిలిచింది. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి సానుకూల సంకేతాలు అందుకున్న సూచీలు ఉదయం భారీ లాభాల్లో మొదలయ్యాయి. ట్రేడింగ్ ప్రారంభం నుంచి అన్ని రంగాల షేర్లకు కొనుగోళ్ల మద్దతు లభించడంతో సూచీలు ఆద్యంతం జోరు కనబరిచాయి. ఒక దశలో సెన్సెక్స్ 611 పాయింట్లు దూసుకెళ్లి 64,203 వద్ద, నిఫ్టీ 186 పాయింట్లు బలపడి 19,175 వద్ద ఇంట్రాడే గరిష్టాన్ని తాకాయి.
రియల్టీ, ప్రభుత్వరంగ బ్యాంకులు, మెటల్, ఎఫ్‌ఎంసీజీ, ఫార్మా షేర్లకు చిన్న, మధ్య తరహా షేర్లు భారీ డిమాండ్ లభించింది. దీంతో బీఎస్‌ఈ మిడ్, స్మాల్ సూచీలు ఒకశాతానికి పైగా ర్యాలీ చేశాయి. విదేశీ ఇన్వెస్టర్లు రూ.1,261 కోట్ల షేర్లను అమ్మేయగా, సంస్థాగత ఇన్వెస్టర్లు రూ.1380 కోట్ల షేర్లు కొన్నారు. ఫెడ్ రిజర్వ్ నుంచి సానుకూల సంకేతాలు, జపాన్ ప్రభుత్వం 113 బిలియన్ డాలర్ల ఉద్దీపన ప్యాకేజీకి ప్రకటన, బ్యాంక్ ఆఫ్ ఇంగ్లండ్ సైతం వడ్డీరేట్ల జోలికెళ్లకపోవడం తదితర పరిణామాలతో ఆసియా, యూరప్ మార్కెట్లు 1–2% ర్యాలీ చేశాయి. అమెరికా స్టాక్ మార్కెట్లు 1–1.5 శాతం లాభాల్లో ట్రేడవుతున్నాయి.
► సెన్సెక్స్ ర్యాలీతో బీఎస్‌ఈలో ఇన్వెస్టర్లు సంపదగా భావించే కంపెనీల మొత్తం మార్కెట్ విలువ రూ.3.1 లక్షల కోట్లు పెరిగి రూ. 313.32 లక్షల కోట్లకు చేరింది. సెన్సెక్స్ 30 షేర్లలో టెక్ మహీంద్రా(1%), బజాజ్ ఫైనాన్స్(0.25%) మాత్రమే నష్టపోయాయి.
► క్యూ2 నికర లాభం ఐదు రెట్లు వృద్ధి సాధించడంతో జేకే టైర్ షేరు 10% లాభపడి రూ.337 వద్ద స్థిరపడింది. ట్రేడింగ్‌లో 14% ర్యాలీ చేసి రూ.351 వద్ద ఏడాది గరిష్టాన్ని తాకింది.
► క్యూ2 ఫలితాల ప్రకటన తర్వాత హీరో మోటో కార్ప్ షేరులో లాభాల స్వీకరణ జరిగింది. 1% నష్టపోయి రూ.3050 వద్ద స్థిరపడింది.
Comments
Please login to add a commentAdd a comment