వాషింగ్టన్: కరోనా వైరస్ మహమ్మారి పరిణామాలను ఎదుర్కొనేందుకు గతేడాది మార్చి నుంచి దాదాపు సున్నా స్థాయి వడ్డీ రేట్లను కొనసాగిస్తున్న అమెరికా క్రమంగా వాటిని పెంచే దిశగా అడుగులు వేస్తోంది. నియామకాలు పుంజుకునే కొద్దీ చౌక వడ్డీ రేట్ల విధానాలను క్రమంగా ఉపసంహరించడం మొదలుపెట్టే అవకాశం ఉందని ఫెడరల్ రిజర్వ్ చైర్మన్ జెరోమ్ పావెల్ సంకేతాలు ఇచ్చారు.
బాండ్ల కొనుగోలు ప్రక్రియను ఈ ఏడాది ఆఖరు మూడు నెలల్లో క్రమంగా తగ్గించుకోనున్నట్లు బ్యాంకర్లు, ఆర్థికవేత్తల సమావేశంలో ఆయన తెలిపారు. ద్రవ్యోల్బణం తాము నిర్దేశించుకున్న 2 శాతం స్థాయికి చేరడంతో బాండ్ల కొనుగోలు ప్రక్రియ నిలిపివేతకు చర్యలు తీసుకోనున్నట్లు పేర్కొన్నారు.
దీర్ఘకాలిక వడ్డీ రేట్లను తక్కువ స్థాయిలో ఉంచడం ద్వారా వ్యవస్థలో రుణాలు, వ్యయాలకు డిమాండ్ కల్పించేందుకు ప్రస్తుతం ఫెడ్ నెలకు 120 బిలియన్ డాలర్ల విలువ చేసే ట్రెజరీ బాండ్లను తిరిగి కొనుగోలు చేస్తోంది. దీన్ని నిలిపివేస్తే తనఖా రుణాలు, క్రెడిట్ కార్డులు, వ్యాపార రుణాలపై వడ్డీ రేట్లు మళ్లీ పెరగడం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. అయితే, బాండ్ల కొనుగోళ్ల ప్రక్రియ పూర్తయ్యే దాకా వడ్డీ రేట్ల పెంపు ఉండదని పావెల్ తెలిపారు. పావెల్ ప్రకటనపై అమెరికా మార్కెట్లు సానుకూలంగా స్పందించాయి. డోజోన్స్ ఇండస్ట్రియల్ యావరేజ్ సూచీ ఒక దశలో 225 పాయింట్లు పెరిగింది.
Comments
Please login to add a commentAdd a comment