న్యూయార్క్: గత మూడు దశాబ్దాలలోలేని విధంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ తాజాగా వడ్డీ రేట్లను 0.75 శాతంమేర పెంచింది. దీంతో ప్రస్తుతం ఫెడ్ ఫండ్స్ రేట్లు 1.5–1.75 శాతానికి చేరాయి. మంగళవారం ప్రారంభమైన ఫెడరల్ రిజర్వ్ ఓపెన్ మార్కెట్ కమిటీ(ఎఫ్‌వోఎంసీ) సమావేశాలు బుధవారం ముగిశాయి. ద్రవ్యోల్బణం ఇటీవల అదుపు తప్పడంతో ఫెడరల్ రిజర్వ్ కఠిన తర విధానాలవైపు మొగ్గు చూపుతోంది.
గత నెల(మే)లో ద్రవ్యోల్బణం 8.6 శాతాన్ని తాకింది. ఇది 40ఏళ్లలోనే అత్యధికంకాగా.. మే నెలలో జరిగిన గత సమావేశం తదుపరి కూడా ఫెడ్ 0.5 శాతం ఫండ్స్ రేట్లను హెచ్చించిన సంగతి తెలిసిందే. 2000 సంవత్సరం తరువాత ఈ స్థాయిలో వడ్డీ రేట్లను పెంచడం గత నెలలోనే జరిగింది. కాగా.. ఆర్థిక మందగమనం, ద్రవ్యోల్బణ పరిస్థితులు(స్టాగ్‌ఫ్లేషన్) తలెత్తనున్నట్లు విశ్లేషకులు ఇటీవల అంచనా వేస్తున్నారు. దీంతో కొద్ది రోజులుగా యూఎస్ మార్కెట్లు పతన బాటలో సాగుతున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment