న్యూయార్క్: అంచనాలకు అనుగుణంగా యూఎస్ కేంద్ర బ్యాంకు ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేటును 0.25 శాతం పెంచింది. దీంతో ఫెడ్ ఫండ్స్ రేటు 4.75–5 శాతానికి చేరింది. నిజానికి కొద్ది నెలలుగా ద్రవ్యోల్బణ అదుపునకే అధిక ప్రాధాన్యత ఇస్తూ వస్తున్న ఫెడ్.. వడ్డీ రేట్లను వేగంగా పెంచుతూ వస్తోంది. దీంతో 2022 మార్చి నుంచి 2023 ఫిబ్రవరి1 వరకూ దశలవారీగా 4.5 శాతం వడ్డీ రేటును పెంచింది. వెరసి 2022 ఫిబ్రవరిలో 0–0.25 శాతంగా ఉన్న ఫండ్స్ రేటు తాజాగా 5 శాతానికి ఎగసింది. ఫెడ్ చైర్మన్ జెరోమీ పావెల్ అంచనాలను మించి వడ్డీ రేట్లు పెరిగే వీలున్నట్లు ఇటీవల ప్రకటించిన సంగతి తెలిసిందే. b v
అయితే కొద్ది రోజులుగా అమెరికా, యూరప్ బ్యాంకింగ్ రంగాలలో సంక్షోభ పరిస్థితులు తలెత్తడంతో ఫెడ్ పాలసీ సమీక్షకు మరింత ప్రాధాన్యత ఏర్పడింది. యూఎస్‌లో సిల్వర్‌గేట్ క్యాపిటల్, సిలికాన్ వ్యాలీ బ్యాంక్, సిగ్నేచర్ బ్యాంక్ ఇప్పటికే విఫలంకాగా.. ప్రస్తుతం ఫస్ట్ రిపబ్లిక్ బ్యాంకు సంక్షోభంలో ఉంది. మరోవైపు క్రెడిట్ స్వీస్ దివాలా స్థితికి చేరడంతో యూరప్ బ్యాంకింగ్ రంగంలోనూ ప్రకంపనలు పుడుతున్నాయి. స్విస్ కేంద్ర బ్యాంకు కల్పించుకుని యూబీఎస్‌ను రంగంలోకి దించాల్సి వచ్చింది. ఈ నేపథ్యంలో ఫెడరల్ రిజర్వ్ రేట్ల పెంపు వేగానికి బ్రేక్ పడనున్నట్లు పలువురు విశ్లేషకులు భావిస్తూ వచ్చారు.
Comments
Please login to add a commentAdd a comment