యథాతథ పాలసీ అమలుకే ఆర్‌బీఐ ఓటు | RBI policy announced- Status quo | Sakshi
Sakshi News home page

యథాతథ పాలసీ అమలుకే ఆర్‌బీఐ ఓటు

Published Fri, Oct 9 2020 10:10 AM | Last Updated on Fri, Oct 9 2020 10:28 AM

RBI policy announced- Status quo   - Sakshi

ఆర్‌బీఐ గవర్నర్‌ శక్తికాంత దాస్‌ అధ్యక్షతన మూడు రోజులపాటు నిర్వహించిన పరపతి సమీక్షలో భాగంగా ఎంపీసీ యథాతథ పాలసీ అమలుకే ఓటేసింది. దీంతో వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతంగా అమలుకానుంది. ఇదేవిధంగా రివర్స్‌ రెపో 3.35 శాతం వద్ద, మార్జినల్‌ స్టాండింగ్ ఫెసిలిటీ రేటు 4.2 శాతంగా అమలుకానున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరం(2020-21)లో దేశ జీడీపీ 9.5 శాతం క్షీణించే వీలున్నట్లు ఆర్‌బీఐ తాజాగా అంచనా వేసింది. క్యూ4(జనవరి-మార్చి21)కల్లా ఆర్థిక వ్యవస్థ వృద్ధి బాట పట్టేవీలున్నట్లు అభిప్రాయపడింది. వ్యవసాయం, కన్జూమర్‌ గూడ్స్‌, పవర్‌, ఫార్మా రంగాలు వేగంగా రికవర్‌ అయ్యే వీలున్నట్లు ఆర్‌బీఐ పేర్కొంది. కాగా.. కోవిడ్‌-19 ప్రభావంతో ఆర్థిక పురోగతి మైనస్‌లోకి జారడంతోపాటు.. రిటైల్‌ ధరలు లక్ష్యానికంటే ఎగువనే కొనసాగుతున్నాయి. ఆరు నెలలుగా వినియోగ ధరల ద్రవ్యోల్బణం(సీపీఐ) 6 శాతంకంటే అధికంగా నమోదవుతోంది. 4 శాతం స్థాయిలో సీపీఐను కట్టడి చేయాలన్నది ఆర్‌బీఐ లక్ష్యంకాగా.. ఆహార ధరలు అధిక స్థాయిలలో కొనసాగడం ప్రభావం చూపుతున్నట్లు విశ్లేషకులు తెలియజేశారు. ఆగస్ట్‌ నెలలోనూ సీపీఐ 6.69 శాతానికి ఎగసింది. ముగ్గురు సభ్యుల ఎంపికలో ఆలస్యంకారణంగా గత నెలాఖరున వాయిదా పడిన మానిటరీ పాలసీ కమిటీ(ఎంపీసీ) సమావేశాలు నేడు ముగిశాయి. 

ఇప్పటికే 2.5 శాతం కోత
2019 ఫిబ్రవరి మొదలు ఆర్‌బీఐ ఇప్పటివరకూ రెపో రేటులో 2.5 శాతం(250 బేసిస్‌ పాయింట్లు) కోత విధించింది. 2020 ఫిబ్రవరి నుంచి చూస్తే 1.15 శాతం తగ్గించింది. ఈ ఏడాది ఆగస్ట్‌లో నిర్వహించిన సమీక్షలో యథాతథ పాలసీ అమలుకే ఆర్‌బీఐ మొగ్గు చూపింది. దీంతో ఇప్పటివరకూ వడ్డీ రేట్లకు కీలకమైన రెపో రేటు 4 శాతం, రివర్స్‌ రెపో 3.35 శాతం చొప్పున అమలవుతున్నాయి.  అయితే భవిష్యత్‌లో అవసరమైతే కీలక రేట్లలో మార్పులు చేపట్టడం ద్వారా తగిన చర్యలు తీసుకునే వీలున్నట్లు పేర్కొంది.  

ఎంపీసీ ఇలా
ఆరుగురు సభ్యులలో ముగ్గురుని కొత్తగా ఎంపిక చేయడంలో జరిగిన ఆలస్యంకారణంగా గత నెలలో జరగవలసిన ఎంపీసీ సమావేశాలు అక్టోబర్‌కు వాయిదా పడ్డాయి. ఈ నెల మొదట్లో కేంద్ర ప్రభుత్వం ఆషిమా గోయల్‌, శశాంక బిడే, జయంత్‌ వర్మలను ఎంపీసీ సభ్యులుగా ఎంపిక చేసిన సంగతి తెలిసిందే.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement