మానవాళికి చెట్లు చేసే మేలేమిటో తెలుసుకోవడానికి ఎవరూ గూగుల్‌ను ఆశ్రయించనవసరం లేదు. పర్యావరణవేత్తలు చెబితే తప్ప తెలియని వారెవరూ లేరు. చెట్ల ఉపయోగాల గురించి బడి చదువుల దగ్గరనుంచి గురువులు నూరిపోయడమే ఇందుకు కారణం. దురదృష్టమేమంటే అధికార పీఠాలపై ఉన్న నేతలు, ఉన్నతాధికార వర్గంలో పనిచేస్తున్నవారు ఏ బళ్లో చదువుకుని ఆ స్థాయికి ఎదిగారోగానీ... దేశంలో ‘అభివృద్ధి’ పేరు చెప్పి వృక్ష సంహారం జరగని రోజంటూ దేశంలో ఉండటం లేదు.
ఇప్పుడు ముంబై మెట్రో రైల్ కార్పొరేషన్(ఎంఎంఆర్‌సీ) వంతు వచ్చింది. పర్యవ సానంగా ఆ మహానగరం శివార్లలోని ఆరే కాలనీకి మూడింది. అందులోని వేల చెట్లు నేలకొరి గాయి. ఈ చెట్లను కాపాడటానికి గత నాలుగేళ్లుగా ఆ కాలనీ వాసులు, పర్యావరణ ఉద్యమకారులు చేయని పోరాటమంటూ లేదు. 2015లో వారి ఒత్తిడికి తలొగ్గి మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్ ఒక కమిటీని నియమించారు. ఆ కమిటీకి అనేక ప్రత్యామ్నాయ ప్రతిపాదనలొచ్చాయి.
వాటిల్లో ఏ ఒక్కటీ తమకు ఉపయోగపడదంటూ మెట్రో రైల్ కార్పొరేషన్ తిరస్కరించింది. చివరకు ఆరే కాలనీలో ఓ చీకటి రాత్రి చెట్లు కూల్చే పని ప్రారంభం కాగానే జనం అడ్డుకున్నారు. హైకోర్టును ఆశ్రయించారు. కానీ స్టే ఇవ్వడానికి శనివారం న్యాయస్థానం నిరాకరించడంతో సోమవారం వారు సుప్రీంకోర్టు తలుపుతట్టారు. ఈనెల 21 వరకూ యధాతథ స్థితిని కొనసాగించమని సుప్రీంకోర్టు ఆదేశాలిచ్చింది. చిత్రమేమంటే ఈలోగానే... అంటే రెండురోజుల్లోనే 2,141 చెట్లు నేలకూలాయి.
ముంబై మహా నగర జనాభా దాదాపు రెండు కోట్లు. అక్కడ రోజూ 80 లక్షలమంది ప్రయా ణీకులు(దాదాపు ఇజ్రాయెల్ జనాభా పరిమాణం) ఇప్పుడున్న సిటీ రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తారు. ప్రస్తుతం ఉన్న రెండు మెట్రో లైన్లకు తోడు మరో లైన్ నిర్మిస్తే అంధేరీ ఈస్ట్‌లో ఉన్న అంతర్జాతీయ విమానాశ్రయానికి, శాంతాక్రజ్‌లోని దేశీయ విమానాశ్రయానికి, నగర పరిసరాల్లోని ప్రధాన ప్రాంతాలకూ కూడా రవాణా సౌకర్యం విస్తరిస్తుందని, రోజూ 17 లక్షలమందికి ఉపయో గపడుతుందని ప్రభుత్వం చెబుతోంది. దాన్నెవరూ కొట్టిపారేయడం లేదు.
కానీ అందుకు నగరా నికి ప్రాణవాయువును అందిస్తున్న ఆరే ప్రాంత వృక్షజాలాన్ని ధ్వంసం చేయాలా అని ప్రశ్నిస్తు న్నారు. ఈ కాలనీకి చేర్చి ఉన్న సంజయ్ గాంధీ జాతీయ పార్క్ వన్యమృగాలకూ, వందలాది రకాల పక్షులకూ నిలయం. ఈ పక్షుల్లో అనేకం ఆరే కాలనీ వాసుల్ని కూడా పలకరిస్తాయి. కను విందు చేస్తాయి. భిన్న జాతుల పక్షుల్ని వీక్షించడానికి, తమ కెమెరాల్లో బంధించడానికి విహంగ ప్రేమికులు నిత్యం ఇక్కడికొస్తారు. దీనికి ‘మినీ కశ్మీర్’గా పేరుంది. ఉరుకుల, పరుగుల జీవితాలకు కాస్తంత విరామం ఇచ్చి, ప్రశాంతంగా స్వచ్ఛమైన వాయువు పీల్చి పునీతులు కావడానికి నగర వాసుల్లో అత్యధికులు ఎన్నుకునే చోటిది.
ఇక్కడున్న లక్షలాది వృక్షాల్లో అనేకం 110 ఏళ్లపైబడినవి. దాదాపు 3,180 ఎకరాల్లో విస్తరించి ఉన్న ఆ చెట్లనుంచి వీచే గాలిని ఆస్వాదిస్తూ వందలమంది ఇక్కడ సైక్లింగ్, జాగింగ్ చేస్తుంటారు. మెట్రో రైలు అయినా, మరొకటైనా నగర ప్రజలకు ఉపయో గపడేదే కావొచ్చు. కానీ అందుకోసం ఇంత ప్రాణప్రదమైన ప్రాంతాన్ని పాక్షికంగానైనా నాశనం చేయవచ్చా? మెట్రో రైలు బోగీలను పరిశుభ్రం చేయడం, వాటికి అవసరమైన మరమ్మత్తులు చేయడం వంటి అవసరాలకు షెడ్లు నిర్మించడం కోసం ఈ చెట్ల కూల్చివేత పర్వం మొదలైంది.
ముంబైతో సహా మన మహానగరాలు వేల కోట్లు ఆర్జించే పెట్టే బంగారు గనులే కావొచ్చు. అక్కడ అనేకులకు ఉపాధి దొరుకుతుండవచ్చు. కానీ వాటికి కావలసినంత అపకీర్తి కూడా ఉంది. అందులో అనేకం కాలుష్యకారకాలు. ప్రపంచంలో అత్యంత కాలుష్యభరిత నగరాలు 20 ఉంటే అందులో 15 మన నగరాలే! తీవ్ర ఉష్ణోగ్రతలతో అల్లాడుతున్న ప్రపంచంలోని 15 నగరాల్లో మన వాటా 11! ఈ నగరాల వాతావరణంలో, ఇక్కడి తాగునీటిలో మృత్యువు దాగుందని నిపుణులు చాన్నాళ్లుగా చెబుతున్నారు. నగర పౌరుల ఊపిరితిత్తుల్లోకి కొంచెం కొంచెంగా చొరబడుతున్న కాలుష్యం వారిని రోగగ్రస్తులుగా మారుస్తోంది.
కేన్సర్, గుండె జబ్బులు వగైరాలకు కారణ మవుతోంది. అనేకుల్లో అకాల వృద్ధాప్యాన్ని కలిగిస్తోంది. వారిని పనిపాటలకు దూరం చేస్తోంది. ఇదంతా మన పాలకులకు ఆందోళన కలిగించాలి. దీన్ని సరిచేయడానికి అవసరమైన ప్రణాళికలు రూపొందించడానికి పురిగొల్పాలి. ఆరే కాలనీ తరహాలో చెట్లు పెంచాలి. తొలగించకతప్పదను కుంటే ఆ చెట్లను మరొకచోట పాతడానికి ప్రయత్నించవచ్చు. కానీ జరుగుతున్నదంతా అందుకు విరుద్ధం. ప్రపంచ అధ్యయన సంస్థలు చెబుతున్న వాస్తవాలేవీ వారిలో కదలిక తీసుకురావడం లేదు.
ఇల్లు కట్టుకుందామనో, ఉన్న ఇంటిని విస్తరించుకుందామనో ఎవరైనా తమ ఆవరణలో చెట్లు కొట్టాలంటే అందుకు అనుమతులు తీసుకోవడం అవసరం. కానీ తమకు అలాంటి నిబంధనలు వర్తించవన్నట్టు అధికార యంత్రాంగాలు ప్రవర్తిస్తున్నాయి. ఆరే కాలనీ చెట్ల నరికివేత వ్యవహారం తీసుకుంటే చట్ట ప్రకారం పాటించాల్సిన నిబంధనలన్నిటినీ తుంగలో తొక్కారు. 1975నాటి చట్టం ప్రకారం ఏ చెట్టు తొలగించాలన్నా అందుకు అనుమతి ఉండాలి. అలా తొలగించడానికి పక్షం రోజులముందు ప్రజలందరికీ తెలిసేలా ఆ అనుమతిని పత్రికల్లో ప్రచురించాలి.
ఆరేళ్లక్రితం బొంబాయి హైకోర్టు ఇచ్చిన ఆదేశం ప్రకారం సంబంధిత సంస్థలు తమ తమ వెబ్‌సైట్లలో అనుమతి కాపీలను అప్‌లోడ్ చేయాలి. కానీ ఆరే కాలనీ చెట్ల కూల్చివేతలో ఈ నిబంధనలేవీ పాటించలేదు. చెట్లు కూల్చడం మొదలుపెట్టిన శుక్రవారం రాత్రే అనుమతి కాపీని కూడా బృహన్ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ వెబ్‌సైట్‌లో ఆదరా బాదరాగా అందుబాటులోకి తెచ్చారు. పాలనా సంస్థలే ఇలా చట్టాల్ని ధిక్కరించే స్థితికి దిగజారడం, ప్రశ్నించినవారిని నిర్బంధించడం దిగ్భ్రాంతి కలిగిస్తుంది.
Comments
Please login to add a commentAdd a comment