సాక్షి, ఢిల్లీ: దేశ రాజధానికి చేరిన ‘బుల్డోజర్ ట్రీట్‌మెంట్’ రాజకీయాలు.. బుధవారం రసవత్తరంగా సాగాయి. జహంగీర్‌పురి ప్రాంతంలో అక్రమ కట్టాల పేరిట ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ కూల్చివేతలకు ఉపక్రమించిన విషయం తెలిసిందే. అయితే సుప్రీం కోర్టు కలుగజేసుకోవడంతో ఈ కూల్చివేత నిలిచిపోయింది. కానీ, అధికారులు మాత్రం సుప్రీం కోర్టు ఆదేశాలిచ్చినా.. దాదాపు రెండు గంటలపాటు తమ పనిని కొనసాగించడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
ఉదయం 10 గంటల సమయంలో.. ఎక్కడైతే హానుమాన్ జయంతి శోభాయాత్ర సందర్భంగా అల్లర్లు జరిగాయో.. అదే ప్రాంతంలో అక్రమ కట్టాలంటూ కూల్చివేత పనులు మొదలుపెట్టారు అధికారులు. భద్రత కోసం సుమారు 400 మందిని పోలీస్ సిబ్బందిని వెంటపెట్టుకుని.. తొమ్మిది బుల్డోజర్లతో అక్రమ నిర్మాణలంటూ కూల్చేసుకుంటూ పోయారు.
ఈ క్రమంలో పిటిషనర్ సుప్రీం కోర్టును హుటాహుటిన ఆశ్రయించారు. యూపీ, గుజరాత్, మధ్యప్రదేశ్ తరహాలో మత ఘర్షణలను సాకుగా చూపిస్తూ ఒక వర్గం వాళ్ల కట్టడాలను కూల్చేస్తున్నారంటూ పిటిషన్ దాఖలు చేశారు. అంతేకాదు మున్సిపల్ కార్పొరేషన్ ఇందుకు సంబంధించి ఎలాంటి ముందస్తు సమాచారం, నోటీసులు ఇవ్వలేదని పేర్కొన్నాడు. ఈ నేపథ్యంలో వాదనలు విన్న చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ నేతృత్వంలోని ముగ్గురు న్యాయమూర్తుల ధర్మాసనం కూల్చివేతను ఆపేయాలని ఆదేశించింది. కానీ..
కోర్టు ఆదేశాలు అందలేదని..
తమకింకా కోర్టు ఆదేశాలు అందలేదని చెబుతూ.. అధికారులు తమ పని చేసుకుంటూ ముందుకు పోయారు. అలా ఓ మసీదు గోడ, గేటును సైతం కూల్చేయడంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. సుమారు 12 గంటల ప్రాంతంలో సీపీఎం నేత బృందా కారత్.. కోర్టు ఫిజికల్ కాపీతో అక్కడికి చేరుకున్నారు. కూల్చివేత ఆపేయాలంటూ ఆమె అధికారులతో వాగ్వాదానికి దిగారు. అంతేకాదు బల్డోజర్‌కు ఎదురెళ్లి అడ్డుకునే ప్రయత్నం చేసిన వీడియో సైతం ఒకటి బయటకు వచ్చింది.
"The MCD is ignoring the Supreme Court's order staying the demolition. I am here to stop the demolitions and see to it that the court order is implemented": Brinda Karat, CPI(M) leader pic.twitter.com/x34D6oYzit
— NDTV (@ndtv) April 20, 2022
స్పందించిన సీజే..
అదే సమయంలో సుప్రీం కోర్టులో పిటిషనర్ సైతం కూల్చివేత ఆగలేదనే విషయం ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు వాళ్లకు(ఢిల్లీ మున్సిపల్ అధికారులకు) అందలేదని, దయచేసి ఈ విషయం వాళ్లకు తెలియజేయాలని సీనియర్ న్యాయవాది దుశ్యంత్ దవే.. చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణను కోరారు. అంతేకాదు మీడియాలోనూ ఇది చూపిస్తున్నారని, ఇది సరైందని కాదని, ఆలస్యమైతే తీవ్ర నష్టం జరిగే అవకాశం ఉంటుందని ఆయన కోర్టుకు విన్నవించారు. ఈ క్రమంలో.. సెక్రటరీ జనరల్ ద్వారా గానీ, సుప్రీం కోర్టు రిజిస్టర్ జనరల్ ద్వారాగానీ తక్షణమే మున్సిపల్ అధికారులతో మాట్లాడించాలని చీఫ్ జస్టిస్ ఎన్వీ రమణ సూచించారు. న్యాయవాది దవే నుంచి సంబంధిత అధికారుల ఫోన్ నెంబర్లు తీసుకుని.. సుప్రీం ఆదేశాల గురించి తెలియజేయాలని కోర్టు సిబ్బందిని ఆదేశించారు. అలా రెండు గంటల హైడ్రామా తర్వాత.. ఎట్టకేలకు ఢిల్లీ జహంగీర్‌పురి బుల్డోజర్ కూల్చివేతలు నిలిచిపోయాయి. ఇక పిటిషన్‌పై స్టేటస్ కో ఆదేశాలు జారీ చేసిన సుప్రీం కోర్టు.. గురువారం వాదనలు విననుంది.
Comments
Please login to add a commentAdd a comment