ఢిల్లీ: జహంగీర్‌పురి కూల్చివేత ఉద్రిక్తతలపై ఉత్తర ఢిల్లీ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ స్పందించారు. తాజాగా జరిగిన మత ఘర్షణలకు, ఇవాళ(బుధవారం) చేపట్టిన అక్రమ కట్టడాల కూల్చివేతకు ఎలాంటి సంబంధం లేదని ఆయన అంటున్నారు.
కోర్టు ఆదేశించినా.. రెండు గంటలపాటు కూల్చివేతలు కొనసాగించడంపై ఆయన్ని మీడియా ప్రశ్నించింది. న్యాయవ్యవస్థపై తమకు వంద శాతం గౌరవం ఉందని, తామేమీ కోర్టు ధిక్కరణకు పాల్పడలేదని వెల్లడించారాయన. అయితే కోర్టు ఆదేశాల కాపీ అందలేదు కాబట్టే తమ చర్యలు కొనసాగించామని, అందాక పనుల్ని వెంటనే ఆపేశామని మేయర్ రాజా ఇక్బాల్ సింగ్ వెల్లడించారు.
కేవలం ఆ ఏరియా మాత్రమే కాదు.. ఢిల్లీ మొత్తానికి మేం అక్రమ కట్టడాల విషయంలో హెచ్చరికలు జారీ చేయాలనుకుంటున్నాం. దయచేసి మీ అంతట మీరే తొలగించాలని, ఒకవేళ తొలగించకపోతే తరువాతి వంతు మీదే వస్తుందని ఎప్పుడో చెప్పామని మేయర్ గుర్తుచేశారు. పైగా ఇవాళ తొలగించిన వాటిలో తాత్కాలికమైన దుకాణాలే ఎక్కువ ఉన్నాయని చెప్తున్నారాయన.‘‘ప్రజల మద్దతుతోనే ఈ కూల్చివేతలు సాగాయి. రోడ్లు ఇప్పుడు క్లియర్ అయ్యాయి. ప్రజలు సంతోషంగా ఉన్నారు. ఇది రోటీన్ చర్యలో భాగమే. దీనివెనుక ఎలాంటి ఎజెండా లేదు అని ప్రకటించారాయన.
సంబంధిత వార్త: జహంగీర్‌పురి కూల్చివేతలపై సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు
Comments
Please login to add a commentAdd a comment