న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం బుల్డోజర్ చర్యలపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కోర్టు ఆదేశాల్ని ధిక్కరిస్తే చర్యలు కఠినంగా ఉంటాయంటూ పరోక్షంగా సీఎం యోగి యోగీ ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని హెచ్చరించింది. యూపీలో బుల్దోజర్ చర్యలపై దాఖలైన పిటిషన్లపై విచారణ పూర్తయ్యే వరకూ ఎలాంటి కూల్చివేతలకు ఉపక్రమించవద్దని ఇప్పటికే ఆదేశాలు జారీ చేయగా, వాటిని సుప్రీంకోర్టు మరోసారి గుర్తు చేసింది. ‘‘వారు దేశ అత్యున్నత న్యాయస్థానం ఆదేశాల్ని అతిక్రమించి రిస్క్ చేయాలనుకుంటున్నారా?’’అని ఘాటుగా స్పందించింది.
ఉత్తరప్రదేశ్ బహ్రైచ్‌లో ‘ఆపరేషన్ బుల్డోజర్’ను సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్‌పై జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం మంగళవారం(అక్టోబర్22న) విచారణ చేపట్టింది.
విచారణ సందర్భంగా బహ్రైచ్ బాధితుల తరుఫున సుప్రీం కోర్టులో సీనియర్ న్యాయవాది సీయూ సింగ్ వాదించారు. స్థానిక అధికారులు అక్టోబర్ 13న బహ్రైచ్‌లో ఆపరేషన్ బుల్డోజర్‌పై నోటీసులు జారీ చేశారు. అనంతరం జరిగిన బుల్డోజర్ చర్యల కారణంగా మత ఘర్షణలు జరిగాయని, ఓ వ్యక్తి సైతం ప్రాణాలు కోల్పోయారని కోర్టుకు తెలిపారు. ఈ అంశంపై వివరణ ఇవ్వాలంటూ విన్నవించారు.
అనంతరం,జస్టిస్ బీఆర్ గవయ్, జస్టిస్ కేవీ విశ్వనాథన్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు.. సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వాన్ని బుల్డోజర్ చర్యను పరోక్షంగా హెచ్చరించింది. అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలను ఉల్లంఘించాలనుకుంటే అది ప్రభుత్వ నిర్ణయం.అయితే, కూల్చివేతలను ఎదుర్కొంటున్న నిర్మాణాలు చట్ట విరుద్ధమైతే, తాము జోక్యం చేసుకోబోమని పేర్కొంది.
బహ్రైచ్‌లో ప్రభుత్వ బుల్డోజర్ చర్యలపై ఇప్పటికే సుప్రీంకోర్టులో పలు పిటిషన్లు దాఖలయ్యాయి. ఆ పిటిషన్లపై బుధవారం విచారణ చేపట్టనుంది. విచారణ నేపథ్యంలో ఎలాంటి బుల్డోజర్ చర్యలరకు ఉపక్రమించొద్దని సుప్రీంకోర్టు ధర్మాసనం ఉత్తరప్రదేశ్ ప్రభుత్వానికి ఆదేశాలు జారీ చేసింది.
Comments
Please login to add a commentAdd a comment