డేరా బాబాకు ‘సుప్రీం’ నోటీసులు | Supreme Court Issues Notice To Dera Baba In 2002 Former Manager Ranjit Singh Case | Sakshi
Sakshi News home page

‘సుప్రీం’ నోటీసులు.. డేరా బాబాకు భారీ ఝులక్‌

Published Fri, Jan 3 2025 4:22 PM | Last Updated on Fri, Jan 3 2025 5:14 PM

Supreme Court Issues Notice To Dera Baba In 2002 Former Manager Ranjit Singh Case

ఛండీగఢ్‌: ఇద్దరు మహిళలపై లైంగికదాడికి పాల్పడ్డాడన్న కేసులో జైలు శిక్షను అనుభవిస్తున్న డేరా సచ్చా సౌదా అధిపతి గుర్మీత్‌ రామ్‌ రహీమ్‌ (dera baba)కు వరుసగా ఎదురు దెబ్బలు తగులుతున్నాయి. 2002లో డేరా బాబా మాజీ మేనేజర్ రంజిత్ సింగ్ హత్య కేసుకు సంబంధించి డేరా బాబాతో పాటు మరో నలుగురికి సుప్రీం కోర్టు (supreme court) ధర్మాసనం శుక్రవారం నోటీసులు జారీ చేసింది.

రంజిత్ సింగ్ హత్య కేసులో డేరా బాబా, అతని సహ నిందితులను నిర్దోషులుగా ప్రకటిస్తూ పంజాబ్, హర్యానా హైకోర్టు ఇచ్చిన నిర్ణయాన్ని సవాలు చేస్తూ సీబీఐ సుప్రీం కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. ఇవాళ ఆ పిటిషన్‌పై విచారణ చేపట్టిన దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు నోటీసులు పంపింది. కేసులో విచారణకు కోర్టు ఎదుట హాజరు కావడం లేదంటే, విచారణకు సహకరించాలని సూచించింది.  

ఈ కేసును సుప్రీం కోర్టు జస్టిస్ బేలా ఎం త్రివేది నేతృత్వంలోని సంజీవ్ ఖన్నా, జస్టిస్ సంజయ్ కుమార్‌లతో కూడిన ధర్మాసనం ఈ కేసును విచారించనుంది.  

24ఏళ్ల నాటి కేసు పూర్వా పరాల్ని పరిశీలిస్తే  
2002లో పంజాబ్‌ విద్యార్థిని, డేరాబాబా శిష్యురాలు పేరుతో నాటి ప్రధాని అటల్‌ బిహారీ వాజ్‌పేయీ (atal bihari vajpayee), కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు, సీబీఐ, జాతీయ మానవ హక్కుల కమిషన్ (nhrc), పంజాబ్‌, హర్యానా ముఖ్యమంత్రులకు హిందీలో ఓ ఆకాశ రామన్న ఉత్తరం అందింది. 

ఆ లేఖలో సిర్సా కేంద్రంగా డేరా సచ్చా సౌదా నిర్వహిస్తున్న గుర్మీత్‌ దైవత్వం పొందే మార్గమంటూ దాదాపు 400 మంది శిష్యులను నంపుసకులుగా మార్చారని, సాధ్వీలపై అత్యాచారానికి పాల్పడ్డారని, తిరగబడిన వారిని హత్య చేసేవారంటూ పలు ఆధారాల్ని ఆ లేఖలో పొందుపరిచింది. అప్పటి వరకు కోట్లాది మంది భక్తులకు దైవంగా విరాజిల్లిన డేరాబాబాకు ఆ లేఖతో పతనం మొదలైంది. ఆయన భక్తులు డేరా బాబాపై తిరగబడ్డారు.

ఆకాశ రామన్న ఉత్తరం రాసింది ఎవరంటే 
అయితే అదే సమయంలో 2002, జులై 10న డేరా బాబా మేనేజర్‌ రంజిత్‌ సింగ్‌ హర్యానా రాష్ట్రం కురుక్షేత్ర నగరానికి చెందిన కాన్పూర్‌ కాలనీలో అనుమానాస్పద రీతిలో మరణించారు. డేరాబాబా ఆకృత్యాలను ఎదిరించేలా రాసింది శిష్యురాలు కాదని,  మేనేజర్‌ రంజిత్‌ సింగేనన్న ఊహాగానాలు ఊపందుకున్నాయి. 

హత్యకేసులో దోషులుగా
అదే సమయంలో రంజిత్‌ సింగ్‌ దారుణు హత్యకు గురయ్యాడు. అనుమానాస్పద మృతి కేసును 2021లో హర్యానా పంచాకుల సీబీఐ విచారించింది. విచారణలో రంజిత్‌ సింగ్‌ మృతిలో డేరాబాబాతో పాటు అవతార్‌ సింగ్‌, కృష్ణలాల్‌, జస్బీర్‌ సింగ్‌, సబ్దీల్‌ సింగ్‌లను దోషులుగా పరిగణించింది. నిందితులకు జీవిత ఖైదు విధించింది.

కేసుల నుంచి విముక్తి కల్పించండి
ఈ నేపథ్యంలో మే 2024లో డేరాబాబా తనపై నమోదైన అత్యాచార కేసులు, జర్నలిస్ట్‌ రామచందర్‌ ఛత్రపతి హత్యకేసులో తనని నిర్ధోషిగా ప్రకటించాలని కోరుతూ కోర్టులలో పిటిషన్లు దాఖలు చేశారు. విచారణ చేపట్టిన పంజాబ్, హర్యానా హైకోర్టు, సీబీఐ కోర్టు డేరాబాకుకు విధించిన శిక్షను రద్దు చేసింది. రంజిత్ సింగ్ హత్య కేసులో మొత్తం ఐదుగురు నిందితులను నిర్దోషులుగా ప్రకటించింది.

తాజాగా, ఈ కేసులో సీబీఐ సుప్రీంకోర్టును ఆశ్రయించింది. దీంతో సుప్రీం కోర్టు సైతం కేసు తదుపరి విచారణ చేపట్టేందుకు సిద్ధమైంది. 

2017 నుంచి జైలు జీవితం
2017లో ఇద్దరు శిష్యులపై అత్యాచారానికి పాల్పడిన కేసులో దోషిగా నిర్ధారణ అయిన తరువాత సీబీఐ కోర్టు అతనికి 20 సంవత్సరాల జైలు శిక్ష విధించింది. రెండు అత్యాచారాలకు సంబంధించిన కేసులో దోషిగా శిక్ష అనుభవించడంతో పాటు పలు హత్యల్లో హర్యానాలోని రోహ్‌తక్‌ జైలులో జీవిత ఖైదు ఎదుర్కొంటున్నాడు. రోహ్‌తక్‌ జైలులో శిక్ష అనుభవిస్తుండగా రంజిత్‌ సింగ్‌ కేసులో సీబీఐ జీవిత ఖైదు విధించింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement