
న్యూఢిల్లీ: సరిహద్దుల్లో కొనసాగుతున్న ప్రతిష్టంభన నేపథ్యంలో భారత్-చైనాల మధ్య చర్చలు జరిగిన సంగతి తెలిసిందే. ఆరవ రౌండ్ కార్పస్ కమాండర్-స్థాయి చర్చలు చైనా భూభాగంలోని మోల్డోలో సోమవారం ఉదయం 9 గంటల ప్రాంతంలో మొదలై రాత్రి 9 గంటల వరకు కొనసాగాయి. దాదాపు 12 గంటల పాటు సుదీర్ఘంగా జరిగిన ఈ చర్చల్లో భారత్ ప్రధానంగా ఘర్షణాత్మక ప్రాంతాల్లో నుంచి చైనా బలగాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేసినట్లు తెలిసింది. రెండు దేశాల మధ్య కుదిరిన ఐదు అంశాల ఒప్పందం అమలు లక్ష్యంగా చర్చలు జరిగాయి. చైనా మొదట తన దళాలను వెనక్కి రప్పించాలని భారత్ కోరినట్లు సమాచారం. చైనానే మొదట చొరబాటుకు ప్రయత్నించింది కనుక.. ముందు అదే వెనక్కి తగ్గాలని భారత్ ఆశిస్తున్నట్లు తెలిసింది. (చదవండి:అంతర్జాతీయ సంకేతాలే కీలకం...)
ప్యాంగ్యాంగ్ త్సో, హాట్‌స్ప్రింగ్స్, డెప్సాంగ్, ఫింగర్ ఏరియాలో తక్షణమే చైనా దళాలు ఉపసంహరించుకోవాలని భారత్ డిమాండ్ చేసింది. ఒకవేళ చైనా యథాతథ స్థితిని పునరుద్ధరించకపోతే.. భాతర దళాలు సుదీర్ఘకాలం మోహరిస్తాయని హెచ్చరించింది. ఇప్పటి వరకు జరిగిన ఐదు దఫాలుగా సుదీర్ఘ చర్చలు జరిగినా చెప్పుకోదగ్గ పురోగతి ఏమీ లేకుండానే ముగిసిన విషయం తెలిసిందే. ఇక నిన్నటి చర్చల్లో భారత ప్రతినిధి బృందానికి లేహ్ ఆధారిత 14 కార్పస్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ కమాండర్ లెఫ్టినెంట్ జనరల్ హరీందర్ సింగ్ నాయకత్వం వహించగా.. చైనా వైపు సౌత్ జిన్జియాంగ్ మిలిటరీ కమాండర్ మేజర్ జనరల్ లియు లిన్ నేతృత్వం వహించినట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment