శక్తికాంత దాస్
న్యూఢిల్లీ: దేశీ బ్యాంకింగ్ రంగ నియంత్రణ సంస్థ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్‌గా శక్తికాంత దాస్ బాధ్యతలు చేపట్టి సంవత్సరమవుతోంది. గతేడాది డిసెంబర్ 12న ఆర్‌బీఐ గవర్నర్‌గా ఉర్జిత్ పటేల్ అర్ధంతరంగా నిష్క్రమించిన తర్వాత అనూహ్యంగా ఆ స్థానంలో దాస్ నియమితులయ్యారు. బ్యూరోక్రాట్ స్థాయి నుంచి స్వతంత్ర ప్రతిపత్తి గల ఆర్‌బీఐ 25వ గవర్నర్‌గా ఎదిగారాయన. 1980 బ్యాచ్ తమిళనాడు కేడర్ ఐఏఎస్ అధికారి అయిన దాస్.. గతంలో కేంద్ర ఆర్థిక వ్యవహారాల కార్యదర్శి సహా పలు హోదాల్లో సేవలు అందించారు.
అందరినీ కలుపుకుపోవడం, అందరూ తమ అభిప్రాయాలు తెలిపేందుకు అవకాశమివ్వడం .. దాస్ స్టయిల్ అంటారు ఆయన్ను గురించి తెలిసినవారు. ప్రభుత్వానికి నిధుల బదిలీ, మొండిబాకీల పరిష్కారానికి కొత్త విధానం ప్రవేశపెట్టడం మొదలుకుని వరుసగా పలు దఫాలు కీలక రేట్లను తగ్గించడం దాకా ఈ ఏడాది కాలంలో ఆర్‌బీఐ అనేక కీలక నిర్ణయాలు తీసుకుంది. బ్యాంకింగ్ రంగంలో సంక్షోభాలు, మందగిస్తున్న ఆర్థిక వృద్ధి తదితర సవాళ్ల మధ్య దాస్ సారథ్యంలో ఆర్‌బీఐ పనితీరును ఒకసారి సింహావలోకనం చేస్తే ..
► ఆర్థిక వృద్ధికి ఊతమిచ్చే క్రమంలో ఆర్‌బీఐ 2019 ఫిబ్రవరి నుంచి ఇప్పటిదాకా అయిదు విడతల్లో 135 బేసిస్ పాయింట్ల మేర రెపో రేటును తగ్గించింది. ఆగస్టులో అసాధారణంగా 35 బేసిస్ పాయింట్లు తగ్గించింది. అయితే, కచ్చితంగా మరో విడత రేట్లను తగ్గిస్తుందన్న అంచనాలను తల్లకిందులు చేస్తూ నవంబర్‌లో నిర్ణయం తీసుకోవడం అందర్నీ విస్మయపర్చింది.
► స్థూల దేశీయోత్పత్తి(జీడీపీ) వృద్ధి అంచనాలను కూడా మొత్తం మీద 240 బేసిస్ పాయింట్ల మేర తగ్గించింది.
► ఆర్‌బీఐ వద్ద ఎంత మేర నిధులు ఉండాలన్న వివాదాస్పద చర్చకు ముగింపునిచ్చి, కేంద్రానికి రూ. 1,76,051 కోట్ల మేర మిగులు నిధులను రిజర్వ్ బ్యాంక్ బదలాయించింది.
► చిన్న, మధ్యతరహా సంస్థలకు ఊరటనిస్తూ వన్ టైమ్ రుణ పునర్‌వ్యవస్థీకరణ వెసులుబాటు కల్పించింది.
► సత్వర దిద్దుబాటు చర్యలకు (పీసీఏ) సంబంధించిన ఆంక్షలు ఎదుర్కొంటున్న 11 బ్యాంకుల్లో నుంచి మూడు బ్యాంకులను (బ్యాంక్ ఆఫ్ ఇండియా, బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర, ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్) బైటికి తెచ్చింది.
► సంస్కరణలపరంగా చూస్తే.. ద్రవ్య పరపతి విధానాల ప్రయోజనాలు సత్వరం బదిలీ అయ్యేలా... బ్యాంకులు రుణాలకు సంబంధించి రెపో ఆధారిత ఎక్స్‌టర్నల్ బెంచ్‌మార్క్ విధానానికి మళ్లేలా దాస్ కృషి చేశారు.
► రోజంతా చెల్లింపుల వ్యవస్థలు పనిచేసేలా చూసేందుకు నెఫ్ట్ సదుపాయం 24 గంటలూ అందుబాటులో ఉండేలా ఆర్‌బీఐ నిర్ణయం తీసుకుంది. ఇది 2020 జనవరి నుంచి అమల్లోకి వస్తోంది.
ఆర్‌బీఐదే తుది నిర్ణయం..
ఆర్‌బీఐ, ప్రభుత్వం మధ్య చాలా విషయాలపై విస్తృతంగా చర్చలు జరుగుతాయి. కానీ, అంతిమంగా నిర్ణయం తీసుకునేది రిజర్వ్ బ్యాంకే. నిర్ణయాలు తీసుకోవడంలో ఆర్‌బీఐకి 100 శాతం పైగా స్వయం ప్రతిపత్తి ఉంది. ఇందులో ఎవరి జోక్యం ఉండదు.
– శక్తికాంత దాస్, గవర్నర్, ఆర్‌బీఐ
అందర్నీ ఒకే తాటిపైకి తెచ్చారు
నిబద్ధత, పారదర్శకత, నిజాయితీ గల వ్యక్తి శక్తికాంత దాస్. ప్రభుత్వాన్ని, వ్యవస్థను ఒకే తాటిపైకి తేవడంలోనూ, బోర్డును సమగ్రంగా తీర్చిదిద్దడంలోను అన్ని విధాలా సఫలీకృతమయ్యారు.
– సచిన్ చతుర్వేది, ఆర్‌బీఐ సెంట్రల్ బోర్డు సభ్యుడు
Comments
Please login to add a commentAdd a comment