వృద్ధి పరుగు ఇక గ్యారంటీ
* మేక్ ఇన్ ఇండియాపై టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ
* అవకాశాలు అందిపుచ్చుకోవాలని ఉద్యోగులకు సూచన
న్యూఢిల్లీ: కేంద్రం ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో రాబోయే సంవత్సరాల్లో ఇక వృద్ధి మళ్లీ పరుగులు పెట్టగలదని టాటా గ్రూప్ చైర్మన్ సైరస్ మిస్త్రీ ఆశాభావం వ్యక్తం చేశారు. భౌగోళిక..రాజకీయ పరిస్థితులు సంక్లిష్టంగానూ, అనూహ్యంగానూ మారిపోతున్న తరుణంలో అనేక అవకాశాలు తెరపైకి వస్తున్నాయన్నారు. అయితే, దానికి సమానంగా అనేక సవాళ్లు కూడా ఉన్నాయని చెప్పారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఇటీవల తీసుకుంటున్న విధానపరమైన చర్యలు, వ్యూహాత్మకంగా అనుసరిస్తున్న మార్గం..ముఖ్యంగా మేక్ ఇన్ ఇండియా కార్యక్రమంతో వృద్ధి మళ్లీ పుంజుకోగలదని ఆయన తెలిపారు. బుధవారం గ్రూప్‌లోని 5.82 లక్షల మంది ఉద్యోగులకు పంపిన నూతన సంవత్సర సందేశంలో మిస్త్రీ ఈ విషయాలు పేర్కొన్నారు. గడచిన ఏడాదిపై సింహావలోకనం చేస్తూ.. అంతర్జాతీయంగా ప్రధాన మార్కెట్లలో రెండు భిన్నమైన వృద్ధి ధోరణులు కనిపిస్తున్నాయని మిస్త్రీ వివరించారు. అమెరికా, బ్రిటన్ వంటి కొన్ని దేశాలు మెల్లగా రికవరీ సంకేతాలు కనపరుస్తుండగా.. చైనా, యూరప్ వంటి భారీ ఆర్థిక వ్యవస్థలు అంచనాలను అందుకోలేకపోయాయని ఆయన తెలిపారు.
టెక్నాలజీపై అవగాహన పెంచుకోవాలి ..
ఎప్పటికప్పుడు కస్టమర్ల అవసరాలు మారిపోతుండటంతో.. గ్రూప్ సంస్థలన్నీ కొంగొత్త టెక్నాలజీలను అందిపుచ్చుకోవాలని, తదనుగుణమైన సేవలు అందించాలని ఉద్యోగులకు మిస్త్రీ సూచించారు. ప్రస్తుతం డిజిటల్ రంగంలోనూ, భౌతికంగానూ కొత్త టెక్నాలజీలు.. అత్యంత వేగంగా వ్యాపార ముఖ చిత్రాన్ని మార్చివేస్తున్నాయని చెప్పారు. కాబట్టి డిజిటైజేషన్, బిగ్ డేటా అనలిటిక్స్ మొదలైన వాటిపై అవగాహన మరింత పెంచుకోవాలని.. నవకల్పనలపై దృష్టి సారించాలని మిస్త్రీ తెలిపారు.
ఇందుకోసం గ్రూప్ కూడా పరిశోధన, అభివృద్ధి కార్యకలాపాలపై మరింత ఇన్వెస్ట్ చేయడం కొనసాగిస్తుందని వివరించారు. ప్రస్తుతం పోటీ కారణంగా మార్జిన్లపై ఒత్తిడి పెరిగిపోతున్నందున.. గ్రూప్ కంపెనీలు పరస్పరం అనుభవాలను పంచుకోవడంతో పాటు అంతర్జాతీయంగా పాటిస్తున్న ఉత్తమ విధానాల గురించి కూడా తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు.
టార్గెట్ 2025 ..
కస్టమర్ల జీవన విధానాలను మెరుగుపర్చేందుకు కట్టుబడి ఉన్న తమ నిబద్ధతతో వచ్చే పదేళ్లలో ప్రపంచ జనాభాలో 25 శాతం మందికి చేరువ కాగలమని 2025 నాటికి టాటా గ్రూప్ నిర్దేశించుకున్న లక్ష్యాలను మిస్త్రీ తెలిపారు. ఫలితంగా అంతర్జాతీయంగా 25 అత్యంత ప్రశంసనీయ కార్పొరేట్ బ్రాండ్స్‌లో ఒకటిగా టాటా గ్రూప్ ఎదగగలదని ధీమా వ్యక్తం చేశారు.
అప్పటికి ప్రపంచంలోనే 25 అత్యంత విలువైన కంపెనీలతో పోల్చతగిన మార్కెట్ క్యాపిటలైజేషన్ సాధించగలమన్నారు. దీన్ని సాకారం చేసుకోవాలంటే టాటా గ్రూప్‌లోని ప్రతి కంపెనీ కూడా కస్టమర్ ప్రధానంగా ప్రత్యేక వ్యూహాన్ని అనుసరించాల్సి ఉంటుందని తెలిపారు. 2014లో టాటా బ్రాండ్ అత్యంత విలువైన బ్రాండ్లలో 34వ స్థానాన్ని దక్కించుకుందని, అంతర్జాతీయంగా 60 గ్లోబల్ సంస్థలకు పోల్చతగిన మార్కెట్ క్యాపిటలైజేషన్ కలిగి ఉందని వివరించారు.
మరోవైపు మహిళా ఉద్యోగుల సాధికారతకు తోడ్పాటు అందించాల్సిన అవసరం ఉందని..ఇందులో భాగంగానే టాటా లీడ్ విధానాన్ని ప్రవేశపెట్టామన్నారు. దీంతో రాబోయే సంవత్సరాల్లో గ్రూప్‌లో నాయకత్వ స్థానాల్లో మహిళల సంఖ్య మరింత పెరగగలదని మిస్త్రీ చెప్పారు. గ్రూప్‌లోని 1,40,000 మహిళా ఉద్యోగులు సంస్థ ఎదుగుదలకు ఎంతగానో తోడ్పడుతున్నారని కితాబిచ్చారు. స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లోనూ కంపెనీ ఉద్యోగులు మరింత చురుగ్గా పాలుపంచుకోవాలని పిలుపునిచ్చారు.