యూరప్ అవతల తొలిసారిగా విదేశంలో తయారవుతున్న సీ295 రకం విమానం ఇప్పుడు భారత రక్షణ విమానయాన రంగంలో కొత్త చర్చకు తెరలేపింది. విదేశీ విమానాల తయారీ యూనిట్ ఆరంభంతో దేశీయంగా విమానయాన రంగం రూపురేఖలు మారే వీలుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. త్రివిధ దళాల సన్నద్ధతనూ ఈ విమానాలు మెరుగు పరుస్తాయని చెబుతున్నారు.
మెరుపు స్థాయిలో మోహరింపు
కొత్త విమానాల రాకతో భారత సైన్యం సన్నద్ధత స్థాయి పెరగనుంది. యుద్ధ సామగ్రి ఉపకరణాలతోపాటు సైన్యాన్ని సైతం వేగంగా అనుకున్న చోటికి తరలించవచ్చు. దీంతోపాటు సరకులను తీసుకెళ్లవచ్చు. విపత్తుల వేళ వైద్యసాయం కోసం మెడికల్ పరికరాలు, ఔషధాలనూ తరలించవచ్చు. తీరగస్తీ విధుల్లోనూ వీటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాలం చెల్లిన సోవియట్ ఆంటోనోవ్ ఏఎన్–32, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఏవిరో748 విమానాల స్థానంలో వీటిని వినియోగంలోకి తెస్తారు. అధునాతన సాంకేతికతలనూ దీనికి జోడించే వెసులుబాటు ఉందని రక్షణరంగ నిపుణులు కునాల్ బిశ్వాస్ చెప్పారు.
పర్వతమయ చైనా, భారత్ సరిహద్దు వెంట అత్యవసరంగా సైనికులను దింపేందుకు వీలుగా చిన్నపాటి స్థలంలోనూ దీనిని ల్యాండ్ చేయొచ్చు. టేకాఫ్‌కు తక్కువ పొడవైన రన్‌వే ఉన్నా సరిపోతుంది. గంటలకు 482 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. తొమ్మిది టన్నుల బరువులను మోయగలదు. 71 మంది సాధారణ సైనికులను లేదంటే బరువైన ఆయుధాలున్న సాయుధ పారాట్రూప్ సైనికులు 48 మందిని ఒకేసారి తీసుకెళ్లగలదు. దీంతో వాయుసేన సన్నద్థత మెరుగుపడనుంది. జంట టర్బో ఇంజన్లుండే ఈ విమానం ద్వారా గాల్లోంచే సరకులను కిందకు దింపొచ్చు. ఎల్రక్టానిక్ సిగ్నల్ నిఘా, వేగంగా ఇంధనం నింపుకునే సామర్థ్యం ఇలా పలు ప్రత్యేకతలు దీని సొంతం. భారత రక్షణరంగంలో బహుళార్థ ప్రయోజనకారిగా ఈ విమానం పేరొందనుంది.
మేక్ ఇన్ ఇండియాకు ఊతం
రక్షణ రంగ ఉపకరణాల విడిభాగాలను దేశీయంగా తయారుచేసి ఈ రంగంలో స్వావలంభన సాధించాలనుకున్న మోదీ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడనుంది. దిగుమతులు భారం తగ్గడంతో ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భరత భారత్’ఆశయాలు ఈ ప్రాజెక్ట్‌తో మరింతగా సాకారం కానున్నాయి. అన్ని విడిభాగాలు ఇక్కడే తయారుచేసి అసెంబ్లింగ్ చేసి 2026 సెపె్టంబర్‌కల్లా తొలి విమానాన్ని తయారుచేయనున్నారు.
ఒప్పందంలో భాగంగా 56 విమానాలు భారత్‌కు అందాల్సి ఉండగా 16 విమానాలను స్పెయిన్‌లోనే తయారుచేసి పంపిస్తారు. మిగతా 40 విమానాలను వడోదరలోని నూతన కర్మాగారంలో అసెంబ్లింగ్ చేస్తారు. సీ295 విమానానికి సంబంధించిన ముఖ్యమైన విడిభాగాల తయారీ హైదరాబాద్‌లో జరగనుంది. అక్కడి టాటా అడ్వాన్స్‌డ్ సిస్టమ్స్ మెయిన్ కాంపోనెంట్స్ అసెంబ్లీ యూనిట్‌లో వీటిని చిన్న భాగాలను జతచేస్తారు. తర్వాత పెద్ద భాగాలను వడోదరలో అసెంబ్లింగ్ చేసి పూర్తి విమానాన్ని తయారుచేస్తారు.
ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల వృద్ధి
ఏరోస్పేస్ మౌలికవసతుల విభాగంలో శిక్షణ, నిర్వాహణ వ్యవస్థలూ విస్తరించనున్నాయి. ఈ విమానాలను నడిపేందుకు, రిపేర్, మెయింటెనెన్స్ వంటి పనులకు వాయుసేనలో అదనపు సిబ్బంది అవసరమవుతారు. దీంతో అదనపు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. వాడుతున్న విమానాలకు నిర్వహణ, విడిభాగాల తయారీ, సరఫరా గొలుసు వంటి ఇతరత్రా విభాగాలూ విస్తరించనున్నాయి. ఈ మొత్తం వ్యవస్థల కోసం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో స్టిక్ హోల్డింగ్ విభాగం, ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్‌లో శిక్షణాకేంద్రాన్ని కొత్తగా నెలకొల్పనున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఎయిర్‌బస్, బోయింగ్, ఏటీఆర్‌సహా ప్రభుత్వరంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌కు తోడుగా టాటా వారి సంస్థలూ ఈ రంగంలో మరింతగా విస్తరించనున్నాయి.
ఎగుమతులకూ ప్రోత్సాహం
దేశీయ అవసరాలకు తీరాక అదనపు ఉత్పత్తుల ఎగుమతికీ ఈ ప్రాజెక్ట్ బాటలు వేయనుంది. సైనిక, సరకు రవాణా విమానాల తయారీకి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ అనుకున్నదానికంటే బాగా విజయవంతమైతే భవిష్యత్తులో పౌరవిమానాల తయారీ చేపట్టే వీలుంది. అప్పుడిక వేల కోట్లు ఖర్చు పెట్టి విదేశీ విమానాలను కొనుగోలుచేసే బదులు దేశీయంగానే పౌరవిమానాలను తయారుచేయొచ్చు. తయారీ ఖర్చు సైతం గణనీయంగా తగ్గనుంది. భారతీయ ఏవియేషన్ రంగంలో ఆత్మనిర్భరతకు హామీ ఇస్తున్న ఈ ప్రాజెక్ట్ మరిన్ని కొత్త ప్రాజెక్టుల రాకపై ఆశలు పెంచుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్
పెరగనున్న ఉపాధి అవకాశాలు
ఇన్నాళ్లూ హైదరాబాద్, బెల్గామ్, బెంగళూరులకే అధికంగా పరిమితమైన ఏరోస్పేస్ పరిశ్రమ కొత్త ప్రాజెక్ట్ కారణంగా వడోదరలో విస్తరించనుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఇది ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది. ప్రత్యక్షంగా 3,000 మందికి,
పరోక్షంగా 15,000 మందికి ఉపాధి లభించనుంది.
ఒక్కో విమానం తయారీకి 10 లక్షల పని గంటల సమయం పట్టనుంది. అంటే ఆమేరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి వేలాది మందికి పని దొరుకుతుంది.
Comments
Please login to add a commentAdd a comment