Indian defence sector
-
సీ295 ప్రాజెక్ట్ ఎందుకంత ప్రత్యేకం?
యూరప్ అవతల తొలిసారిగా విదేశంలో తయారవుతున్న సీ295 రకం విమానం ఇప్పుడు భారత రక్షణ విమానయాన రంగంలో కొత్త చర్చకు తెరలేపింది. విదేశీ విమానాల తయారీ యూనిట్ ఆరంభంతో దేశీయంగా విమానయాన రంగం రూపురేఖలు మారే వీలుందని విశ్లేషణలు వెలువడుతున్నాయి. త్రివిధ దళాల సన్నద్ధతనూ ఈ విమానాలు మెరుగు పరుస్తాయని చెబుతున్నారు.మెరుపు స్థాయిలో మోహరింపు కొత్త విమానాల రాకతో భారత సైన్యం సన్నద్ధత స్థాయి పెరగనుంది. యుద్ధ సామగ్రి ఉపకరణాలతోపాటు సైన్యాన్ని సైతం వేగంగా అనుకున్న చోటికి తరలించవచ్చు. దీంతోపాటు సరకులను తీసుకెళ్లవచ్చు. విపత్తుల వేళ వైద్యసాయం కోసం మెడికల్ పరికరాలు, ఔషధాలనూ తరలించవచ్చు. తీరగస్తీ విధుల్లోనూ వీటిని చక్కగా ఉపయోగించుకోవచ్చు. కాలం చెల్లిన సోవియట్ ఆంటోనోవ్ ఏఎన్–32, హిందుస్తాన్ ఏరోనాటిక్స్ ఏవిరో748 విమానాల స్థానంలో వీటిని వినియోగంలోకి తెస్తారు. అధునాతన సాంకేతికతలనూ దీనికి జోడించే వెసులుబాటు ఉందని రక్షణరంగ నిపుణులు కునాల్ బిశ్వాస్ చెప్పారు. పర్వతమయ చైనా, భారత్ సరిహద్దు వెంట అత్యవసరంగా సైనికులను దింపేందుకు వీలుగా చిన్నపాటి స్థలంలోనూ దీనిని ల్యాండ్ చేయొచ్చు. టేకాఫ్‌కు తక్కువ పొడవైన రన్‌వే ఉన్నా సరిపోతుంది. గంటలకు 482 కిలోమీటర్ల వేగంతో దూసుకుపోగలదు. తొమ్మిది టన్నుల బరువులను మోయగలదు. 71 మంది సాధారణ సైనికులను లేదంటే బరువైన ఆయుధాలున్న సాయుధ పారాట్రూప్ సైనికులు 48 మందిని ఒకేసారి తీసుకెళ్లగలదు. దీంతో వాయుసేన సన్నద్థత మెరుగుపడనుంది. జంట టర్బో ఇంజన్లుండే ఈ విమానం ద్వారా గాల్లోంచే సరకులను కిందకు దింపొచ్చు. ఎల్రక్టానిక్ సిగ్నల్ నిఘా, వేగంగా ఇంధనం నింపుకునే సామర్థ్యం ఇలా పలు ప్రత్యేకతలు దీని సొంతం. భారత రక్షణరంగంలో బహుళార్థ ప్రయోజనకారిగా ఈ విమానం పేరొందనుంది. మేక్ ఇన్ ఇండియాకు ఊతంరక్షణ రంగ ఉపకరణాల విడిభాగాలను దేశీయంగా తయారుచేసి ఈ రంగంలో స్వావలంభన సాధించాలనుకున్న మోదీ ప్రభుత్వానికి ఈ ప్రాజెక్ట్ ఎంతగానో దోహదపడనుంది. దిగుమతులు భారం తగ్గడంతో ‘మేక్ ఇన్ ఇండియా’, ‘ఆత్మనిర్భరత భారత్’ఆశయాలు ఈ ప్రాజెక్ట్‌తో మరింతగా సాకారం కానున్నాయి. అన్ని విడిభాగాలు ఇక్కడే తయారుచేసి అసెంబ్లింగ్ చేసి 2026 సెపె్టంబర్‌కల్లా తొలి విమానాన్ని తయారుచేయనున్నారు. ఒప్పందంలో భాగంగా 56 విమానాలు భారత్‌కు అందాల్సి ఉండగా 16 విమానాలను స్పెయిన్‌లోనే తయారుచేసి పంపిస్తారు. మిగతా 40 విమానాలను వడోదరలోని నూతన కర్మాగారంలో అసెంబ్లింగ్ చేస్తారు. సీ295 విమానానికి సంబంధించిన ముఖ్యమైన విడిభాగాల తయారీ హైదరాబాద్‌లో జరగనుంది. అక్కడి టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్స్ మెయిన్ కాంపోనెంట్స్ అసెంబ్లీ యూనిట్లో వీటిని చిన్న భాగాలను జతచేస్తారు. తర్వాత పెద్ద భాగాలను వడోదరలో అసెంబ్లింగ్ చేసి పూర్తి విమానాన్ని తయారుచేస్తారు. ఏరోస్పేస్ మౌలిక సదుపాయాల వృద్ధి ఏరోస్పేస్ మౌలికవసతుల విభాగంలో శిక్షణ, నిర్వాహణ వ్యవస్థలూ విస్తరించనున్నాయి. ఈ విమానాలను నడిపేందుకు, రిపేర్, మెయింటెనెన్స్ వంటి పనులకు వాయుసేనలో అదనపు సిబ్బంది అవసరమవుతారు. దీంతో అదనపు ఉద్యోగాలు అందుబాటులోకి వస్తాయి. వాడుతున్న విమానాలకు నిర్వహణ, విడిభాగాల తయారీ, సరఫరా గొలుసు వంటి ఇతరత్రా విభాగాలూ విస్తరించనున్నాయి. ఈ మొత్తం వ్యవస్థల కోసం ఉత్తరప్రదేశ్‌లోని ప్రయాగ్‌రాజ్‌లో స్టిక్ హోల్డింగ్ విభాగం, ఆగ్రాలోని ఎయిర్‌ఫోర్స్ స్టేషన్లో శిక్షణాకేంద్రాన్ని కొత్తగా నెలకొల్పనున్నారు. దీంతో ఇన్నాళ్లూ ఎయిర్‌బస్, బోయింగ్, ఏటీఆర్సహా ప్రభుత్వరంగ హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌కు తోడుగా టాటా వారి సంస్థలూ ఈ రంగంలో మరింతగా విస్తరించనున్నాయి. ఎగుమతులకూ ప్రోత్సాహం దేశీయ అవసరాలకు తీరాక అదనపు ఉత్పత్తుల ఎగుమతికీ ఈ ప్రాజెక్ట్ బాటలు వేయనుంది. సైనిక, సరకు రవాణా విమానాల తయారీకి ఉద్దేశించిన ఈ ప్రాజెక్ట్ అనుకున్నదానికంటే బాగా విజయవంతమైతే భవిష్యత్తులో పౌరవిమానాల తయారీ చేపట్టే వీలుంది. అప్పుడిక వేల కోట్లు ఖర్చు పెట్టి విదేశీ విమానాలను కొనుగోలుచేసే బదులు దేశీయంగానే పౌరవిమానాలను తయారుచేయొచ్చు. తయారీ ఖర్చు సైతం గణనీయంగా తగ్గనుంది. భారతీయ ఏవియేషన్ రంగంలో ఆత్మనిర్భరతకు హామీ ఇస్తున్న ఈ ప్రాజెక్ట్ మరిన్ని కొత్త ప్రాజెక్టుల రాకపై ఆశలు పెంచుతోంది. – సాక్షి, నేషనల్ డెస్క్ పెరగనున్న ఉపాధి అవకాశాలుఇన్నాళ్లూ హైదరాబాద్, బెల్గామ్, బెంగళూరులకే అధికంగా పరిమితమైన ఏరోస్పేస్ పరిశ్రమ కొత్త ప్రాజెక్ట్ కారణంగా వడోదరలో విస్తరించనుంది. స్థానికంగా ఉపాధి అవకాశాలు మెరుగుపడనున్నాయి. ఇది ఆర్థికాభివృద్ధికి దోహదపడనుంది. ప్రత్యక్షంగా 3,000 మందికి, పరోక్షంగా 15,000 మందికి ఉపాధి లభించనుంది. ఒక్కో విమానం తయారీకి 10 లక్షల పని గంటల సమయం పట్టనుంది. అంటే ఆమేరకు సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమలకు సంబంధించి వేలాది మందికి పని దొరుకుతుంది. -
కేంద్రం కీలక నిర్ణయం.. వారికి రూ.3వేల ఆర్థిక సాయం
Rajnath Singh.. కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. భారత రక్షణ దళాల్లో పనిచేసి ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలు అందించి మృతి చెందిన కుటుంబాల పిల్లలకు ఆర్థికంగా బాసటగా నిలిచేందుకు సిద్ధమైంది. ఈ క్రమంలో కేంద్రం వారికి ఆర్థిక సాయాన్ని పెంచుతున్నట్టు పేర్కొంది. కాగా, సైనికుల అనాథ పిల్లలకు నెలకు ఇచ్చే ఆర్థిక సాయాన్ని రూ. 3వేలకు పెంచేందుకు కేంద్రం ఆమోదం తెలిపిందని రక్షణ శాఖ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ తెలిపారు.అయితే, అనాథ పిల్లలకు ఇప్పటి వరకు వీరికి నెలకు రూ. 1,000 చెప్పున ఇస్తున్నారు. కాగా, రక్షణ దళాల్లో సేవలందించిన వారి కుటుంబాలను ఆదుకునేందుకే కేంద్రం ఈ నిర్ణయం తీసుకుందని రాజ్‌నాథ్ సింగ్ స్పష్టం చేశారు. ఇదిలా ఉండగా.. అనాథ పిల్లలు(కుమార్తె, కుమారుడు)21 సంవత్సరాల లోపు ఉండాలి. వారికి వివాహం కాకపోతే వారు ఈ పథకానికి అర్హులు అవుతారు. ఇక, కేంద్రీయ సైనిక్ బోర్డు నిర్వహిస్తున్న పథకం ద్వారా ఆర్థిక సాయాన్ని మాజీ సైనికుల అనాథ పిల్లలకు అందిస్తున్నారు. ఇది కూడా చదవండి: స్మృతి ఇరానీ కూతురు బార్ కేసులో ట్విస్ట్.. కాంగ్రెస్ నేతలకు షాక్ -
శతమానం భారతి: భారత రక్షణ వ్యవస్థకు వెన్నుదన్నుగా డి.ఆర్.డి.ఓ
భారత సాయుధ దళాల కోసం అత్యాధునిక రక్షణ సాంకేతికతలను, యుద్ధంలో గెలిపించే ఆయుధ వ్యవస్థలను రూపొందించేందుకు స్వాతంత్య్రం వచ్చిన మరుసటి సంవత్సరమే 1948 లో డాక్టర్ డి.ఎస్.కొఠారి ప్రారంభించిన రక్షణ సర్వీసు వ్యవస్థ (డి.ఎస్.ఓ.) భారత రక్షణ రంగానికి వెన్ను దన్నుగా నిలిచింది. 1958 జనవరి 1న డి.ఆర్.డి.ఓ.గా పేరు మార్చుకున్న డి.ఎస్.ఓ. సాయుధ దళాలకు కావలసిన ఆయుధాలు, ఇతర సామగ్రిని తయారు చేసి అందించే స్థాయికి చేరుకుంది. ప్రారంభంలో ఈ సంస్థ నుంచి రక్షణ రంగానికి సలహాలు మాత్రమే లభించేవి. 1970–80 లలో డి.ఆర్.డి.ఓ. శాంతియుత ప్రయోజనాలకోసం అణుపరీక్షలు నిర్వహించింది. దూరాన్ని కచ్చితంగా కొలిచే సాధనాలను; రాకెట్లకు ఘన, ద్రవ ఇంధనాలను కనిపెట్టింది. మోర్టార్లు, క్షిపణులు, ఫిరంగులు, నిఘా రాడార్లు తయారు చేసింది.1980–90 మధ్య సమగ్ర క్షిపణి అభివృద్ధి కార్యక్రమం, ప్రధాన యుద్ధ ట్యాంకు అర్జున్, తేలికపాటి యుద్ధ విమానం తేజస్ తయారీకి డి.ఆర్.డి.ఓ. ఆధ్వర్యంలో సన్నాహాలు మొదలయ్యాయి. సఫలం అయ్యాయి. డి.ఆర్.డి.ఓ. ప్రస్తుత చైర్మన్ డాక్టర్ జి. సతీశ్‌రెడ్డి ఇటీవల మాట్లాడుతూ, వచ్చే 25 ఏళ్లలో దేశం ఆయుధాల ఎగుమతి సామర్థ్యం పెంచుకునే దిశగా, ప్రధాని మోదీ పిలుపు మేరకు రక్షణ రంగంలో ఆత్మనిర్భరతసాధన వైపు వడివడిగా అడుగులు వేస్తున్నట్లు తెలిపారు. డి.ఆర్.డి.ఓ. కు దేశవ్యాప్తంగా 50 కి పైగా çపరిశోధనాలయాలు ఉన్నాయి. ఢిల్లీలో కేంద్ర కార్యాలయం ఉంది. ఈ భారత రక్షణ రంగ పరిశోధనా సంస్థలో సుమారు 5000 మంది సైంటిస్టులు, 25 వేల మంది సహాయక సిబ్బంది పని చేస్తున్నారు. (చదవండి: భారత్-చైనా యుద్ధం) -
Indian Defence Sector: మన ‘రక్షణ’కు అవరోధాలెన్నో!
రక్షణ మంత్రిత్వ శాఖ ఈమధ్య విడుదల చేసిన పత్రంలో రక్షణ రంగంలో ప్రవేశపెట్టిన 20 రకాల సంస్కరణలను పొందుపరిచారు. సాధారణంగా జాతీయ భద్రత పేరిట ఇలాంటివి బాహాటంగా వెల్లడించే సంప్రదాయం మన దేశంలో లేదు. ఈసారి రక్షణ శాఖ ఇందుకు భిన్నమైన మార్గాన్ని అనుసరించటం స్వాగతించదగ్గది. ఇందులో రెండు కీలకమైన అంశాలున్నాయి. రక్షణ రంగానికి ఆత్మ నిర్భరత తీసుకురావటం, రక్షణ రంగ పరిశోధనలను సంస్కరించటం. దేశీయ విధానాల ద్వారా మన సాయుధ దళాల అవసరాలను తీర్చేందుకే ఈ రెండింటినీ ఉద్దేశించారు. అదే సమయంలో మన దేశాన్ని రక్షణ సామగ్రి తయారీ రంగ కేంద్రంగా రూపొందించటం కూడా ఈ సంస్కరణల ధ్యేయం. రక్షణ రంగంలో స్వావలంబన గురించి, ఆ లక్ష్య సాధన గురించి దశాబ్దాలుగా అనేక ప్రభు త్వాలు మాట్లాడటం మనకు తెలియనిదేమీ కాదు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం పరిపాలించినా ఈ లక్ష్యం గురించి ఘనంగా చెప్పడం ఎప్పటినుంచో మనం చూస్తున్నదే. కానీ విచారకరమైన విషయమేమంటే అంతర్జాతీయంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో ఈనాటికీ మనది రెండో స్థానం. మాటలకు దీటుగా చేతలు ఉండటం లేదని ఈ పరిస్థితి తెలియజెబుతోంది. రక్షణ, పరిశోధన రెండూ రక్షణ మంత్రిత్వశాఖ ఛత్రఛాయలో ఉంచటం సరైందికాదని ఎప్పటినుంచో అనేక మంది నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఎవరూ పట్టించు కోలేదు. పాశ్చాత్య దేశాల్లో ఈ నమూనా ఎక్కడా అమల్లో లేదు. మంచిదేగానీ... ఈ సందర్భంగా నేను రెండు ఉదాహరణలు ఇవ్వద ల్చుకున్నాను. రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఇటీవల రక్షణ నవీకరణ సంస్థ(డీఐఓ)కింద రక్షణ రంగంలో ఉత్కృష్టమైన సృజనాత్మకతను ప్రోత్సహించటానికి ఉద్దేశించిన ఐడెక్స్‌కు బడ్జెట్ కేటాయింపులు చేస్తున్నట్టు ప్రకటించారు. రక్షణ రంగంలో కొత్త ఆలోచనలతో ముందుకొచ్చేవారిని, రక్షణ, ఎయిరో స్పేస్ రంగాల్లో సాంకేతికతను అభివృద్ధి చేసేవారిని ప్రోత్సహించటానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేయటం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ చొరవ వెనకున్న స్ఫూర్తి కొనియా డదగినది. అయితే డీఐఓ సైతం రక్షణ మంత్రిత్వశాఖలోని రక్షణ ఉత్పత్తి విభాగంకింద పనిచేస్తుందని చెప్పటం కొంత నిరాశ కలిగిస్తుంది. బ్యూరోక్రసీ మన దేశంలో ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియనిది కాదు. ఇక కాగ్, సీబీఐ, సీవీసీ వగైరా సంస్థల నీడ సరేసరి. ప్రయోగశాలలు, సాంకే తిక రంగంలో కొత్త పుంతలు తొక్కే సంస్థలు మేధోపరమైన కృషిలో నిమగ్నమవుతాయి. నిబంధనలు, సంప్రదాయాల పేరుచెప్పి వాటికి అడ్డంకులు సృష్టిస్తే అవి ఎప్పటికీ ఎదగ లేవు. విభిన్నంగా ఆలోచించటం, ఎలాంటి ఇబ్బందుల నైనా, అవరోధాలనైనా ఎదుర్కొనటానికి సిద్ధపడటం వంటి గుణాలు సృజనాత్మక పరిష్కారాలకు దోహదపడతాయి. కానీ డీఐఓను ప్రభుత్వ విభాగం పరిధిలో ఉంచితే ఇవెలా సాధ్యం? రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్డీఓ) పరిధిలో, అది అందజేసే నిధులతో అత్యాధునిక రక్షణ సాంకేతి కతలను అభివృద్ధి కోసం కృషిచేస్తున్న సంస్థలు చాలా వున్నాయి. అయినా మన దేశానికి ఒక కొత్త నవీకరణ సంస్థ అవసరం వున్నదని రక్షణ శాఖ భావించిందంటేనే ఆ సంస్థల పని తీరు ఎలావున్నదో అర్థం చేసుకోవచ్చు. విక్రమ్ సారాభాయ్ విలువైన సూచన దేశీయంగా హెచ్ఎఫ్–24 యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయాలని 50వ దశకంలో అప్పటి ప్రధాని నెహ్రూ సూచించారు. ఆ తర్వాతే 1956లో హిందూస్థాన్ ఏరోనాటికల్ సంస్థ(హెచ్ఏఎల్) ఆవిర్భవించింది. ఆ యుద్ధ విమానం 1967లో వైమానిక దళ సర్వీసులోకి ప్రవేశించింది. 1970లో భారత అంతరిక్ష రంగ పితామ హుడు విక్రమ్ సారాభాయ్ అణు శక్తి, అంతరిక్ష రంగం, ఎర్త్ సైన్సు, ఎయిరోనాటికల్ రంగాలకు ప్రత్యేక కమిషన్‌లుండాలని, ఇవన్నీ శాస్త్ర, సాంకేతిక రంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేయాలని పాలనారంగ సంస్కరణల కమిషన్‌కు సూచించారు. ఆయన ఎంతో ముందు చూపుతో చేసిన ఆ ప్రతిపాదనను ఆనాటి ప్రభుత్వం ఆమోదించింది. అది కార్యరూపం దాల్చాక ఆ రంగాలన్నీ ఎన్నో విధాల అభివృద్ధి సాధించాయి. కానీ ఎయిరోనాటిక్స్ రంగం ఎదుగూ బొదుగూ లేకుండా మిగిలి పోయింది. ఎందుకంటే ఆ ఒక్క రంగం మాత్రం రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండిపోయింది. కనుకనే ఇన్ని దశాబ్దాలు గడిచినా రక్షణ రంగ దిగుమతులు మన దేశానికి తప్పడం లేదు. అందుకోసం వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేయవలసి వస్తోంది. ఇన్ని దశాబ్దాలవుతున్నా ప్రభుత్వాల సారథులు దీనిపై తగిన దృష్టి సారించలేక పోయారు. వీగిపోయిన ప్రతిపాదన దేశానికి వైమానిక రంగ విధానం ఎంతో అవసరమని 1994లో ఏపీజే అబ్దుల్ కలామ్ రాష్ట్రపతిగా వుండగా ఎయిరోనాటికల్ సొసైటీ ప్రతిపాదించింది. వర్తమాన కాలంలో ఈ రంగంలో జరిగే సాంకేతికాభివృద్ధి రక్షణరంగానికి, దేశ భద్రతకు దోహదపడుతుందని, మన దేశం అంతర్జాతీయ భాగస్వామ్యం పొందటానికి ఉపయోగపడుతుందని, అందువల్ల ఆర్థికంగా కూడా దేశానికి లాభదాయకమని ఆ ప్రతిపాదన సూచించింది. పౌరవిమానయాన రంగం, సైనిక విమాన రంగాలమధ్య ఎన్నో సారూప్యతలుంటాయి. ఎయిరోనాటిక్స్‌ను ప్రోత్సహిస్తే దేశ భద్రతతోపాటు లాభదాయకమైన వ్యాపారం చేయటానికి కూడా అవకాశం వుంటుంది. అంతేకాదు... వైమానిక రంగంలో అంతర్జాతీయంగా మనదైన ప్రత్యేక ముద్ర వుంటుంది. కానీ విచారకరమైన విషయమేమంటే ఈ ప్రతిపాదన ఉన్నతాధికార వర్గం ధర్మమా అని వీగిపోయింది. దీనికి మరింత మెరుగులు దిద్ది, మార్పులు చేర్పులు చేసి 2004లో మరోసారి ప్రతిపాదించారు. దానికి కూడా అదే గతి పట్టింది. ప్రభుత్వ నిర్ణయాలపై, విధానాలపై సౌత్ బ్లాక్ పట్టు ఎంతగా వుంటుందో ఈ స్థితి తెలియజేస్తుంది. ఆ బ్లాక్‌లో వేరే మంత్రిత్వ శాఖల సచివాలయాలతోపాటు రక్షణ మంత్రిత్వ శాఖ సచివాలయం కూడా ఉంటుంది. రక్షణ పరిశ్రమ రంగంలో నవీకరణను ప్రోత్సహిం చటానికి ఒక సంస్థ అవసరమున్నదని ఇన్నేళ్ల తర్వాత ఎన్డీఏ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి నాయకత్వం భావించటం నిజంగా హర్షించదగ్గ పరిణామం. ఈ విషయంలో గతం తాలూకు అనవసర భారాన్ని వదల్చు కోవాలని చూడటం కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. ప్రభుత్వ ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది గనుక భారత వైమానిక రంగానికి ఇకముందైనా సరైన స్థానం దక్కాలని, ప్రస్తుత సానుకూల వాతావరణంలో అది అన్ని రకాలుగా లబ్ధి పొందాలని అందరమూ ఆశించాలి. అసలు మన జాతీయ భద్రతా వ్యవస్థలో సృజనాత్మక దృక్పథం పెంపొందాలంటే పూర్తి స్థాయి పాలనా రంగ సంస్కరణలు చాలా చాలా అవసరమని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి. –ఎయిర్ మార్షల్ బ్రిజేష్ జయల్(రిటైర్డ్) రక్షణ రంగ వ్యాఖ్యాత (‘ది ట్రిబ్యూన్’ సౌజన్యంతో) చదవండి: చైనాతో ప్రతిష్టంభన నేపథ్యంలో రక్షణ మంత్రి లద్దాఖ్ పర్యటన హిందీభాషకు దక్షిణ వారధి పీవీ -
రక్షణ సామగ్రి కోసం 83వేల కోట్ల ఆర్డర్లు
న్యూఢిల్లీ: భారత రక్షణ రంగం 2011-2014 వరకు రూ.83,858 కోట్ల విలువైన రక్షణ పరికరాలకు ఆర్డర్లు ఇచ్చిందని రక్షణ శాఖ మంత్రి మనోహర్ పారికర్ శుక్రవారం లోక్‌సభలో తెలిపారు. దేశీయ రక్షణ పరిశ్రమలు రూ.69 కోట్ల విలువైన రక్షణ పరికరాలను ఎగుమతి చేశాయని చెప్పారు. విదేశీ విక్రేతలకు 2011-12, 2013-14లలో భారత వైమానిక దళం రూ.55,406 కోట్లు, సైనిక దళం రూ.25,454 కోట్లు, నావికా దళం రూ.2,998 కోట్ల విలువైన ఆర్డర్లు ఇచ్చాయని మంత్రి లోక్‌సభలో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. కాగా, అత్యాచారాలకు పాల్పడితే కాళ్లు, చేతులు నరికే చట్టం తీసుకురావాలని ఎంపీ రామదాస్ అథవాలే రాజ్యసభలో డిమాండ్ చేశారు. మహిళలపై యాసిడ్ దాడులకు పాల్పడేవారిని శిక్షించేందుకు కఠినమైన చట్టాలు తీసుకురావాలని కేసీ త్యాగి(జేడీయూ) డిమాండ్ చేశారు. ఇంటర్నెట్లో అసభ్య సమాచారాన్ని ఉంచే సైట్లను గుర్తించే పనిని ఇంటర్నెట్ అండ్ మొబైల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా(ఐఏఎంఏఐ)కి అప్పగించామని టెలికాం మంత్రి రవిశంకర్ ప్రసాద్ తెలిపారు.