Indian Defence Sector: మన ‘రక్షణ’కు అవరోధాలెన్నో!  | Retired Air Marshal Brijesh Jayal Article On Reforms In Indian Defence Sector | Sakshi
Sakshi News home page

Indian Defence Sector: మన ‘రక్షణ’కు అవరోధాలెన్నో! 

Published Mon, Jun 28 2021 4:27 PM | Last Updated on Mon, Jun 28 2021 4:44 PM

Retired Air Marshal Brijesh Jayal Article On Reforms In Indian Defence Sector - Sakshi

రక్షణ మంత్రిత్వ శాఖ ఈమధ్య విడుదల చేసిన పత్రంలో రక్షణ రంగంలో ప్రవేశపెట్టిన 20 రకాల సంస్కరణలను పొందుపరిచారు. సాధారణంగా జాతీయ భద్రత పేరిట ఇలాంటివి బాహాటంగా వెల్లడించే సంప్రదాయం మన దేశంలో లేదు. ఈసారి రక్షణ శాఖ ఇందుకు భిన్నమైన మార్గాన్ని అనుసరించటం స్వాగతించదగ్గది. ఇందులో రెండు కీలకమైన అంశాలున్నాయి. రక్షణ రంగానికి ఆత్మ నిర్భరత తీసుకురావటం, రక్షణ రంగ పరిశోధనలను సంస్కరించటం. దేశీయ విధానాల ద్వారా మన సాయుధ దళాల అవసరాలను తీర్చేందుకే ఈ రెండింటినీ ఉద్దేశించారు.

అదే సమయంలో మన దేశాన్ని రక్షణ సామగ్రి తయారీ రంగ కేంద్రంగా రూపొందించటం కూడా ఈ సంస్కరణల ధ్యేయం. రక్షణ రంగంలో స్వావలంబన గురించి, ఆ లక్ష్య సాధన గురించి దశాబ్దాలుగా అనేక ప్రభు త్వాలు మాట్లాడటం మనకు తెలియనిదేమీ కాదు. కేంద్రంలో ఏ పార్టీ ప్రభుత్వం పరిపాలించినా ఈ లక్ష్యం గురించి ఘనంగా చెప్పడం ఎప్పటినుంచో మనం చూస్తున్నదే.  కానీ విచారకరమైన విషయమేమంటే అంతర్జాతీయంగా ఆయుధాలు దిగుమతి చేసుకునే దేశాల జాబితాలో ఈనాటికీ మనది రెండో స్థానం. మాటలకు దీటుగా చేతలు ఉండటం లేదని ఈ పరిస్థితి తెలియజెబుతోంది. రక్షణ, పరిశోధన రెండూ రక్షణ మంత్రిత్వశాఖ ఛత్రఛాయలో ఉంచటం సరైందికాదని ఎప్పటినుంచో అనేక మంది నిపుణులు సూచిస్తున్నారు. కానీ ఎవరూ పట్టించు కోలేదు. పాశ్చాత్య దేశాల్లో ఈ నమూనా ఎక్కడా అమల్లో లేదు. 

మంచిదేగానీ...
ఈ సందర్భంగా నేను రెండు ఉదాహరణలు ఇవ్వద ల్చుకున్నాను. రక్షణ మంత్రి రాజ్నాథ్‌ సింగ్‌ ఇటీవల రక్షణ నవీకరణ సంస్థ(డీఐఓ)కింద  రక్షణ రంగంలో ఉత్కృష్టమైన సృజనాత్మకతను ప్రోత్సహించటానికి ఉద్దేశించిన ఐడెక్స్‌కు బడ్జెట్‌ కేటాయింపులు చేస్తున్నట్టు ప్రకటించారు. రక్షణ రంగంలో కొత్త ఆలోచనలతో ముందుకొచ్చేవారిని, రక్షణ, ఎయిరో స్పేస్‌ రంగాల్లో సాంకేతికతను అభివృద్ధి చేసేవారిని ప్రోత్సహించటానికి తగిన వ్యవస్థను ఏర్పాటు చేయటం ఈ సంస్థ ప్రధాన లక్ష్యం. ఈ చొరవ వెనకున్న స్ఫూర్తి కొనియా డదగినది. అయితే డీఐఓ సైతం రక్షణ మంత్రిత్వశాఖలోని రక్షణ ఉత్పత్తి విభాగంకింద పనిచేస్తుందని చెప్పటం కొంత నిరాశ కలిగిస్తుంది. బ్యూరోక్రసీ మన దేశంలో ఎలా పనిచేస్తుందో ఎవరికీ తెలియనిది కాదు.

ఇక కాగ్, సీబీఐ, సీవీసీ వగైరా సంస్థల నీడ సరేసరి. ప్రయోగశాలలు, సాంకే తిక రంగంలో కొత్త పుంతలు తొక్కే సంస్థలు మేధోపరమైన కృషిలో నిమగ్నమవుతాయి. నిబంధనలు, సంప్రదాయాల పేరుచెప్పి వాటికి అడ్డంకులు సృష్టిస్తే అవి ఎప్పటికీ ఎదగ లేవు. విభిన్నంగా ఆలోచించటం, ఎలాంటి ఇబ్బందుల నైనా, అవరోధాలనైనా ఎదుర్కొనటానికి సిద్ధపడటం వంటి గుణాలు సృజనాత్మక పరిష్కారాలకు దోహదపడతాయి. కానీ డీఐఓను ప్రభుత్వ విభాగం పరిధిలో ఉంచితే ఇవెలా సాధ్యం? రక్షణ పరిశోధన, అభివృద్ధి సంస్థ(డీఆర్‌డీఓ) పరిధిలో, అది అందజేసే నిధులతో అత్యాధునిక రక్షణ సాంకేతి కతలను అభివృద్ధి కోసం కృషిచేస్తున్న సంస్థలు చాలా వున్నాయి. అయినా మన దేశానికి ఒక కొత్త నవీకరణ సంస్థ అవసరం వున్నదని రక్షణ శాఖ భావించిందంటేనే ఆ సంస్థల పని తీరు ఎలావున్నదో అర్థం చేసుకోవచ్చు. 

విక్రమ్‌ సారాభాయ్‌ విలువైన సూచన
దేశీయంగా హెచ్‌ఎఫ్‌–24 యుద్ధ విమానాన్ని అభివృద్ధి చేయాలని 50వ దశకంలో అప్పటి ప్రధాని నెహ్రూ సూచించారు. ఆ తర్వాతే 1956లో హిందూస్థాన్‌ ఏరోనాటికల్‌ సంస్థ(హెచ్‌ఏఎల్‌) ఆవిర్భవించింది. ఆ యుద్ధ విమానం 1967లో వైమానిక దళ సర్వీసులోకి ప్రవేశించింది. 1970లో భారత అంతరిక్ష రంగ పితామ హుడు విక్రమ్‌ సారాభాయ్‌ అణు శక్తి, అంతరిక్ష రంగం, ఎర్త్‌ సైన్సు, ఎయిరోనాటికల్‌ రంగాలకు ప్రత్యేక కమిషన్‌లుండాలని, ఇవన్నీ శాస్త్ర, సాంకేతిక రంగ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో పనిచేయాలని పాలనారంగ సంస్కరణల కమిషన్‌కు సూచించారు. ఆయన ఎంతో ముందు చూపుతో చేసిన ఆ ప్రతిపాదనను ఆనాటి ప్రభుత్వం ఆమోదించింది.

అది కార్యరూపం దాల్చాక ఆ రంగాలన్నీ ఎన్నో విధాల అభివృద్ధి సాధించాయి. కానీ ఎయిరోనాటిక్స్‌ రంగం ఎదుగూ బొదుగూ లేకుండా మిగిలి పోయింది. ఎందుకంటే ఆ ఒక్క రంగం మాత్రం రక్షణ మంత్రిత్వ శాఖ పరిధిలో ఉండిపోయింది. కనుకనే ఇన్ని దశాబ్దాలు గడిచినా రక్షణ రంగ దిగుమతులు మన దేశానికి తప్పడం లేదు. అందుకోసం వేలాది కోట్ల రూపాయలు వ్యయం చేయవలసి వస్తోంది. ఇన్ని దశాబ్దాలవుతున్నా ప్రభుత్వాల సారథులు దీనిపై తగిన దృష్టి సారించలేక పోయారు.  

వీగిపోయిన ప్రతిపాదన
దేశానికి వైమానిక రంగ విధానం ఎంతో అవసరమని 1994లో ఏపీజే అబ్దుల్‌ కలామ్‌ రాష్ట్రపతిగా వుండగా ఎయిరోనాటికల్‌ సొసైటీ ప్రతిపాదించింది. వర్తమాన కాలంలో ఈ రంగంలో జరిగే సాంకేతికాభివృద్ధి రక్షణరంగానికి, దేశ భద్రతకు దోహదపడుతుందని, మన దేశం అంతర్జాతీయ భాగస్వామ్యం పొందటానికి ఉపయోగపడుతుందని, అందువల్ల ఆర్థికంగా కూడా దేశానికి లాభదాయకమని ఆ ప్రతిపాదన సూచించింది.  పౌరవిమానయాన రంగం, సైనిక విమాన రంగాలమధ్య ఎన్నో సారూప్యతలుంటాయి. ఎయిరోనాటిక్స్‌ను ప్రోత్సహిస్తే దేశ భద్రతతోపాటు లాభదాయకమైన వ్యాపారం చేయటానికి కూడా అవకాశం వుంటుంది. అంతేకాదు... వైమానిక రంగంలో అంతర్జాతీయంగా మనదైన ప్రత్యేక ముద్ర వుంటుంది.

కానీ విచారకరమైన విషయమేమంటే ఈ ప్రతిపాదన ఉన్నతాధికార వర్గం ధర్మమా అని వీగిపోయింది. దీనికి మరింత మెరుగులు దిద్ది, మార్పులు చేర్పులు చేసి 2004లో మరోసారి ప్రతిపాదించారు. దానికి కూడా అదే గతి పట్టింది. ప్రభుత్వ నిర్ణయాలపై, విధానాలపై సౌత్‌ బ్లాక్‌ పట్టు ఎంతగా వుంటుందో ఈ స్థితి తెలియజేస్తుంది. ఆ బ్లాక్‌లో వేరే మంత్రిత్వ శాఖల సచివాలయాలతోపాటు రక్షణ మంత్రిత్వ శాఖ సచివాలయం కూడా ఉంటుంది. రక్షణ పరిశ్రమ రంగంలో నవీకరణను ప్రోత్సహిం చటానికి ఒక సంస్థ అవసరమున్నదని ఇన్నేళ్ల తర్వాత ఎన్‌డీఏ ప్రభుత్వంలోని అత్యున్నత స్థాయి నాయకత్వం భావించటం నిజంగా హర్షించదగ్గ పరిణామం.

ఈ విషయంలో గతం తాలూకు అనవసర భారాన్ని వదల్చు కోవాలని చూడటం కొత్త ఆశల్ని రేకెత్తిస్తోంది. ప్రభుత్వ ఆలోచనల్లో చాలా మార్పు వచ్చింది గనుక భారత వైమానిక రంగానికి ఇకముందైనా సరైన స్థానం దక్కాలని, ప్రస్తుత సానుకూల వాతావరణంలో అది అన్ని రకాలుగా లబ్ధి పొందాలని అందరమూ ఆశించాలి. అసలు మన జాతీయ భద్రతా వ్యవస్థలో సృజనాత్మక దృక్పథం పెంపొందాలంటే పూర్తి స్థాయి పాలనా రంగ సంస్కరణలు చాలా చాలా అవసరమని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలి.
 –ఎయిర్‌ మార్షల్‌ బ్రిజేష్‌ జయల్‌(రిటైర్డ్‌) రక్షణ రంగ వ్యాఖ్యాత (‘ది ట్రిబ్యూన్‌’ సౌజన్యంతో)  

చదవండి: చైనాతో ప్రతిష్టంభన నేపథ్యంలో రక్షణ మంత్రి లద్దాఖ్‌ పర్యటన
 హిందీభాషకు దక్షిణ వారధి పీవీ

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement