సాక్షి, హైదరాబాద్: శాసనసభ గురువారం రెండు చట్టసవరణ బిల్లులకు ఆమోదం తెలిపింది. తెలంగాణ పేమెంట్ ఆఫ్ సాలరీస్ అండ్ పెన్షన్ అండ్ రిమూవల్ ఆఫ్ డిస్‌క్వాలి ఫికేషన్ యాక్ట్–1953 చట్టానికి.. భూదాన్ అండ్ గ్రామ్‌దాన్ యాక్ట్ 1965 చట్టానికి సవర ణలను ఆమోదించింది. అయితే భూదాన్ చట్ట సవరణపై ఎమ్మెల్యే చిన్నారెడ్డి అభ్యం తరం వ్యక్తం చేశారు. భూదాన్ చట్టం కింద కేటాయించిన భూమి పట్టణ ప్రాంత పరిధి లోకి వచ్చినప్పుడు, లేదా వ్యవసాయ భూమిగా లేనప్పుడు ఆ భూమిని బోర్డు తీసు కుంటుందన్న నిబంధనలను తప్పుబట్టారు.
భూదాన్ భూములను ప్రైవేటు సంస్థలకు ధారాదత్తం చేసేందుకే ఈ సవరణ చేపట్టారని ఆరోపించారు. ఇటీవల గాంధీభవన్‌లో ఉన్న భూదాన్ బోర్డు కార్యాలయం తలుపులను పోలీసులు అర్ధరాత్రి పగలగొట్టి ఫైళ్లు పట్టుకెళ్లారని పేర్కొన్నారు. అయితే దీనిపై ప్రభుత్వ విప్ జి.సునీత కల్పించుకుని సభను తప్పుదోవ పట్టించవద్దని వ్యాఖ్యానించారు. చిన్నారెడ్డి స్పందిస్తూ.. సునీతను ‘ఆవిడ’ అంటూ సంబోధించడంతో అధికార పక్షం అభ్యంతరం తెలిపింది. మహిళ సభ్యురాలిని ఆవిడ అని సంబోధించడం సరి కాదని, క్షమాపణ చెప్పాలని హరీశ్ పేర్కొన్నారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది. స్పీకర్ కల్పించుకుని శాంతింపజేశారు.
సెలెక్ట్ కమిటీకి నివేదించండి..
గందరగోళం తగ్గాక.. భూదాన్ అంశంపై నేరుగా ప్రశ్న అడగాలని చిన్నారెడ్డికి స్పీకర్ సూచించారు. దీంతో చిన్నారెడ్డితోపాటు ప్రతిపక్ష నేత జానారెడ్డి కల్పించుకుని.. భూదాన్ చట్ట సవరణ బిల్లును ఆమోదిం చకుండా సెలెక్ట్ కమిటీకి నివేదించాలని కోరారు. దీనిపై డిప్యూటీ సీఎం మహమూద్ అలీ మాట్లాడుతూ.. అందరి అభిప్రాయాలు తీసుకున్నాక రూల్స్‌లో దళితులు, ప్రభుత్వ అవసరాలకు భూములను కేటాయించేలా నిబంధనలను పొందుపరిచే అంశాన్ని పరిశీలిస్తామన్నారు. దీంతో బిల్లు ఆమోదం పొందినట్లు స్పీకర్ ప్రకటించారు. ఇక వేతనాల చెల్లింపు, పెన్షన్‌కు సంబంధించిన బిల్లులో వక్ఫ్ బోర్డు చైర్మన్‌కు వేతనం చెల్లించే అంశాన్ని పొందుపరచడం పట్ల బీజేపీ ఎమ్మెల్యే కిషన్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు.