మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు
♦ చట్ట సవరణ బిల్లుకు శాసనసభ ఆమోదం
♦ మద్దతు ప్రకటించిన విపక్షాలు
♦ మహిళలకూ కోటా కావాలన్న కాంగ్రెస్ ఎమ్మెల్యే జి.చిన్నారెడ్డి
♦ అంగీకరించిన ముఖ్యమంత్రి.. అప్పటికప్పుడు బిల్లుకు సవరణ
సాక్షి, హైదరాబాద్: వ్యవసాయ మార్కెట్ కమిటీల్లో ఇక రిజర్వేషన్ విధానం అమలు కానుంది. పాలకమండళ్ల నియామకం విషయంలో రిజర్వేషన్లకు అవకాశం కల్పించేలా చట్టసవరణ చేస్తూ ప్రతిపాదించిన బిల్లుకు మంగళవారం శాసనసభ ఆమోదముద్ర వేసింది. దేశంలో ఇప్పటి వరకు ఇలాంటి విధానం మరెక్కడా లేదని ప్రభుత్వం పేర్కొనగా, ఈ బిల్లుకు అన్ని పార్టీలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. దీంతో సభ ఏకగ్రీవంగా దీనికి ఆమోదం తెలిపింది. కేవలం కులాలవారీగా రిజర్వేషన్లను బిల్లులో పొందుపరచగా, అందులో మహిళలకూ రిజర్వేషన్ ద్వారా చోటు కల్పించాలన్న కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి సూచనను సభ పరిగణనలోకి తీసుకుంది. దాన్ని బిల్లులో పొందుపరచాల్సిందిగా సభా నాయకుడు ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు సూచించడంతో అప్పటికప్పుడు సవరణ చేసి ఆమోదించడం విశేషం. విపక్షాలు చేసే ఇలాంటి మంచి సూచనలను పరిగణనలోకి తీసుకుంటామని, ఇదేవిధంగా బంగారు తెలంగాణకు అంతా కలసి కృషి చేయాలని ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు పేర్కొన్నారు.
మంగళవారం ఉదయం డాక్టర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం, రాజీవ్‌గాంధీ సాంకేతిక విజ్ఞాన విశ్వవిద్యాలయం చట్ట సవరణ బిల్లుల ఆమోదం అయిన వెంటనే మంత్రి హరీశ్‌రావు మార్కెట్ కమిటీల చట్ట సవరణ బిల్లును సభలో ప్రవేశపెట్టారు. దేశంలో ఎక్కడా లేనట్టుగా మార్కెట్ కమిటీలో రిజర్వేషన్లు తెచ్చి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే ఆదర్శంగా నిలుపుతున్నట్లు ఆయన పేర్కొన్నారు. మార్కెట్ కమిటీ చైర్మన్ నియామకం విషయంలో సామాజిక న్యాయం పాటించేలా రిజర్వేషన్ విధానం అమలు చేయటాన్ని స్వాగతిస్తున్నట్టు కాంగ్రెస్ సభ్యుడు చిన్నారెడ్డి పేర్కొన్నారు. అయితే కులపరమైన రిజర్వేషన్లతో సరిపుచ్చకుండా లింగభేదాన్ని కూడా అందులో చేరిస్తే బాగుంటుందని ఆయన పేర్కొన్నారు. దానికి వెంటనే ముఖ్యమంత్రి స్పందించి ‘చిన్నారెడ్డి మంచి సూచన చేశారు. మహిళలకు ప్రాధాన్యం అవసరం.
33 శాతం కోటాను వారికి కేటాయించేలా మార్చి బిల్లుకు ఆమోదం తెలిపితే బాగుంటుంది’ అంటూ స్పీకర్‌ను కోరారు. ఆయన సూచన మేరకు సిబ్బంది అప్పటికప్పుడు బిల్లుకు సవరణ చేశారు. గుజరాత్‌లో అమలులో ఉన్నట్టు రైతులే పాలకమండలిని ఎన్నుకునే విధానం అందుబాటులోకి తేవాలని చిన్నారెడ్డి సూచించారు. ముందుగా రిజర్వేషన్ల ప్రకారం కొత్త కమిటీలు వేసి మార్కెట్‌లను పటిష్ట పరచిన తర్వాత దాన్ని పరిశీలిద్దామని ముఖ్యమంత్రి సభ దృష్టికి తెచ్చారు. మహిళల కోటా ప్రకటించటం పట్ల అధికార పక్ష సభ్యురాలు సురేఖ హర్షం వ్యక్తం చేశారు. రిజర్వేషన్లలో మైనారిటీలను కూడా చేర్చాలని దేశం సభ్యుడు సండ్ర సూచించగా, ఆ విషయం బిల్లులో ఉందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. మహిళలకూ మార్కెట్ కమిటీలో చోటు కల్పించేలా రిజర్వేషన్ అమలు చేయాలని తాము ప్రతిపాదిద్దామనుకున్న తరుణంలో స్వయంగా ముఖ్యమంత్రే స్పందిం చటం సంతోషంగా ఉందని బీజేపీ సభ్యుడు ఎన్‌వీఎస్‌ఎస్ ప్రభాకర్ పేర్కొన్నారు. ఇది మంచి నిర్ణయమని వైఎస్సార్ కాంగ్రెస్ సభ్యుడు పాయం వెంకటేశ్వర్లు, సీపీఐ సభ్యుడు రవీంద్రకుమార్, మజ్లిస్ సభ్యుడు జాఫర్ హుస్సేన్‌లు పేర్కొన్నారు.
మార్కెట్‌యార్డులలో ఆన్‌లైన్ విధానం: హరీశ్‌రావు
లోపభూయిష్టంగా ఉన్న మార్కెట్‌యార్డులను పటిష్టపరిచి అక్రమాలకు తావులేకుండా ఆన్‌లైన్ విధానాన్ని ప్రారంభిస్తున్నామని మార్కెటింగ్ శాఖ మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. ప్రయోగాత్మకంగా గడ్డిఅన్నారం, బోయిన్‌పల్లి మార్కెట్‌లలో ప్రవేశపెడితే వాటి ఆదాయం పెరిగిందని, త్వరలో రాష్ట్రవ్యాప్తంగా అమలు చేస్తామని వెల్లడించారు. రూ. 1,024 కోట్లతో కొత్తగా గోడౌన్‌లు నిర్మిస్తున్నామని, త్వరలో కొన్ని మార్కెట్లలో కోల్డ్ స్టోరేజీలు నిర్మిస్తామని వెల్లడించారు.
సీఎంకు మహిళా ఎమ్మెల్యేల కృతజ్ఞతలు
మహిళల సంక్షేమానికి పాటు పడడంతో పాటు వారికి సముచిత గౌరవం దక్కేవిధంగా మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లు కల్పించినందుకు టీఆర్‌ఎస్ మహిళా ఎమ్మెల్యేలు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావుకు కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ కమిటీల్లో రిజర్వేషన్లకు సంబంధించి సభలో బిల్లు పాసయిన అనంతరం టీ విరామ సమయంలో డిప్యూటీ స్పీకర్‌పద్మా దేవేందర్‌రెడ్డి, వి.సునీత, కొండా సురేఖ, బొడిగె శోభ, కోవా లక్ష్మి, అజ్మీరా రేఖా నాయక్ తదితరులు సీఎం చాంబర్‌లో కేసీఆర్‌ను కలిశారు. సీఎం నిర్ణయాలు తెలంగాణ మహిళల ఆత్మగౌరవాన్ని జాతీయ స్థాయిలో పెంచే విధంగా ఉన్నాయని వారన్నారు.