ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్ అధ్యక్షతన భేటీ
అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో నాయకులకు దిశానిర్దేశం
సాక్షి, హైదరాబాద్: ఈ నెల 9 నుంచి రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్న నేపథ్యంలో నేడు బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష భేటీ జరగనుంది. ఎర్రవల్లి నివాసంలో ఆదివారం ఉదయం 10.30కు పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో జరిగే ఈ భేటీకి పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలతో పాటు కొందరు ముఖ్య నేతలు కూడా హాజరుకానున్నారు. సుమారు వారం రోజుల పాటు జరిగే అసెంబ్లీ సమావేశాల్లో పార్టీ అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ నాయకులకు దిశానిర్దేశం చేస్తారు. కాంగ్రెస్ ఎన్నికల హామీలు, ఏడాదిలో రేవంత్ ప్రభుత్వ పాలన వైఫల్యాలతో పాటు ప్రజా సమస్యలను ప్రస్తావించాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది.
మరోవైపు సోమవారం బీఏసీ సమావేశంలో ప్రతిపాదించే ఎజెండా ఆధారంగా తమ వ్యూహానికి పదును పెట్టాలని బీఆర్‌ఎస్ భావిస్తోంది. కాగా, ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో కేసీఆర్ అసెంబ్లీ సమావేశాలకు హాజరయ్యేది, లేనిదీ ఆదివారం జరిగే భేటీలో స్పష్టత వచ్చే అవకాశముంది. గత ప్రభుత్వం చేసిన పలు చట్టాలకు ప్రస్తుత ప్రభుత్వం సవరణలు తీసుకువస్తోంది. అలాగే విద్యుత్ కొనుగోలు అంశంపై విచారణ నివేదికను అసెంబ్లీలో ప్రవేశ పెట్టేందుకు అధికార పార్టీ సన్నద్ధమవుతోంది.
ఈ నేపథ్యంలో బీఆర్‌ఎస్ పాలనలో తీసుకున్న నిర్ణయాలపై ప్రభుత్వం ఇరుకున పెట్టే ప్రయత్నాలు చేస్తే వాటిని తిప్పికొట్టేందుకు అనుసరించే వ్యూహంపైనా ఈ భేటీలో కేసీఆర్ దిశా నిర్దేశం చేయనున్నారు. కేవలం అసెంబ్లీ సమావేశాల కోణంలోనే కాకుండా జాతీయ, రాష్ట్ర రాజకీయాల్లో చోటు చేసుకుంటున్న పరిణామాలు, బీఆర్‌ఎస్ ప్రతిస్పందించాల్సిన తీరుపై కేసీఆర్ సూచనలు చేస్తారని బీఆర్‌ఎస్ వర్గాలు వెల్లడించాయి.
ఏడాది పాలనపై బీఆర్‌ఎస్ చార్జిషీట్ నేడు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏడాది పాలన వైఫ ల్యాలపై ఆదివారం ఉదయం 10 గంటలకు తెలంగాణ భవన్‌లో బీఆర్‌ఎస్ చార్జిషీట్ విడుదల చేయనుంది. మాజీ మంత్రి హరీశ్ రావు, మండలిలో ప్రతిపక్ష నేత మధుసూదనాచారి, మాజీ మంత్రులు, బీ ఆర్‌ఎస్ సీనియర్ నాయకులు కార్యక్రమంలో పాల్గొంటారు. ‘నమ్మించారు.. నట్టేట ముంచారు. ఏడాది కాంగ్రెస్ పాలన చూస్తే.. వంచనే తప్ప ఏ వర్గానికి జరిగిన మేలు లేదు.. అన్ని వర్గాలను విజయవంతంగా రోడ్డెక్కించారు’..అని బీఆర్‌ఎస్ ఒక ప్రకటనలో వ్యాఖ్యానించింది.
Comments
Please login to add a commentAdd a comment