బీఆర్‌ఎస్ శాసనసభా పక్ష భేటీలో కేసీఆర్
కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమయం ఇచ్చాం
పాలకుల అసమర్థతపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు
ప్రధాన ప్రతిపక్షంగా ప్రజా సమస్యలపై మనం గొంతు విప్పాలి
హామీలు నెరవేర్చడం చేతకాక అణచివేత విధానాలు
నాపై కక్షతోనే తెలంగాణ తల్లి విగ్రహం రూపు మారుస్తున్నారు
గురుకుల విద్యా సంస్థల్లో సమస్యలపై త్వరలో కార్యాచరణ
వచ్చే ఏడాది ఫిబ్రవరి నెలాఖరులో భారీ బహిరంగ సభ
సాక్షి, హైదరాబాద్: పాలకుల అసమర్ధతపై ప్రజలు తిరుగుబాటు చేస్తున్న నేపథ్యంలో ప్రధాన ప్రతిపక్షంగా బీఆర్ ఎస్.. ప్రభుత్వాన్ని నిలదీయాలని ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం కె.చంద్రశేఖర్‌రావు పిలుపునిచ్చారు. రాష్ట్రంలోని కాంగ్రెస్ ప్రభుత్వానికి తగినంత సమ యం ఇచ్చామని, సోమవారం నుంచి ప్రారంభమయ్యే అసెంబ్లీ సమావేశాల్లో ప్రజా సమస్యలపై గొంతు విప్పాలని సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చడం చేతకాక ప్రభుత్వం కొనసాగిస్తున్న అణచివేత విధానాలను ఎండగట్టాలని చెప్పారు. ఆదివారం ఎర్రవల్లి నివాసంలో జరిగిన బీఆర్‌ఎస్ శాసనసభా పక్షం సమావేశంలో పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై కేసీఆర్ దిశా నిర్దేశం చేశారు. సుమారు రెండున్నర గంటల పాటు సాగిన ఈ భేటీలో పలు అంశాలను ప్రస్తావించారు.
నమ్మి ఓట్లేసిన వాళ్లను వేధిస్తున్నారు..
‘త్యాగాలు చేసి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణను ఆగం చేయాలని కాంగ్రెస్ చూస్తోంది. నమ్మి ఓట్లు వేసిన రైతులు, గిరిజనులు, దళితులను వేధిస్తోంది. ప్రజల పక్షాన ప్రశ్నిస్తున్న బీఆర్‌ఎస్ నేతలు, కార్యకర్తల మీద కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తోంది. బీఆర్‌ఎస్ ప్రభుత్వాన్ని బదనాం చేసేందుకు కాళేశ్వరం అంశాన్ని ముందుకు తెచ్చింది. ఉద్యోగులకు మొండి చేయి చూపుతూ కేవలం ఒకేఒక్క డీఏను విడుదల చేసి అది కూడా 17 వాయిదాల్లో చెల్లిస్తోంది.
దేశానికి ఆదర్శంగా తీర్చిదిద్దిన గురుకుల విద్యాలయాలను కాంగ్రెస్ ప్రభుత్వం అస్తవ్యస్తం చేసింది. విషాహారంతో పిల్లలు చనిపోవడాన్ని చూసి సభ్య సమాజం సిగ్గు పడుతోంది. గురుకుల బాట పేరిట బీఆర్‌ఎస్ పార్టీ ఏర్పాటు చేసిన కమిటీని ప్రభుత్వం అడ్డుకుంది. గురుకులాల్లో పరిస్థితులు దారుణంగా ఉన్నాయని పార్టీ కమిటీ నివేదిక ఇచ్చింది. గురుకుల విద్యా సంస్థల్లో సమస్యలపై బీఆర్‌ఎస్ త్వరలో కార్యాచరణ ప్రకటిస్తుంది. గురుకుల విద్యా సంస్థల్లో వైఫల్యాలను అసెంబ్లీలో ఎండగట్టాలి..’ అని కేసీఆర్ సూచించారు.
తెలంగాణ అస్తిత్వం మీద సోయి లేదు
‘తెలంగాణ అస్తిత్వం, ప్రజల ఆకాంక్షల మీద సోయి లేని సీఎం కేవలం రాజకీయ స్వార్ధంతో పాటు నాపై ఉన్న కక్షతో తెలంగాణ విగ్రహం రూపురేఖలు మార్చే పిచ్చి పనులకు పూనుకుంటున్నాడు. తెలంగాణ తల్లి భావన కేవలం నాది మాత్రమే కాదు, మొత్తం తెలంగాణ సమాజానిది. కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేయాలనే మూర్ఖత్వంతో సీఎం వ్యవహరిస్తున్నాడు. ప్రత్యేక ఆంధ్ర ఉద్యమ సమయంలో ఆంధ్రామాత అనే భావన ముందుకు తెచ్చిన అక్కడి నాయకత్వం తర్వాత తెలుగు తల్లిని తెరమీదకు తెచ్చి తెలంగాణ అస్తిత్వాన్ని మరిపించింది.
తెలుగు తల్లి విగ్రహం ఒక రకంగా తెలంగాణ ప్రజల్లో అస్తిత్వ భావనకు ఊపిరిపోసింది. ఇక్కడి ప్రజల అస్తిత్వానికి చిహ్నంగా తెలంగాణ తల్లిని భగవత్ స్వరూపంలో చేతులెత్తి మొక్కేలా రూపొందించాం. అనేకమంది మేధావులు, కవులు, కళాకారులు వేలాది గంటల పాటు చర్చించి, శ్రమించి తెలంగాణ చారిత్రక సాంస్కృతిక సామాజిక నేపథ్యంలో నుంచి ప్రస్తుత తెలంగాణ తల్లి రూపాన్ని తీర్చిదిద్దారు. సమైక్య పాలనలో మరిచిపోయిన తెలంగాణ ప్రతీకలను ఉద్యమ సమయంలో పునరుజ్జీవింప చేసుకోవడానికే తెలంగాణ తల్లిని నిలుపుకున్నాం.
కానీ తెలంగాణ సాంస్కృతిక వారసత్వంపై అవగాహన లేని సీఎం తెలంగాణ అస్తిత్వానికి మచ్చ తెస్తున్నారు. కొత్త రూపంలో ప్రభుత్వం ఏర్పాటు చేస్తున్న తెలంగాణ విగ్రహం ఆవిష్కరణకు నన్ను ఆహా్వనించడం వెనుక ఉన్న కోణం, ఉద్దేశం ఏదైనా ఇంటికి వచ్చిన మంత్రికి తెలంగాణ సాంప్రదాయం ప్రకారం భోజనం పెట్టి సాదరంగా గౌరవించాం..’ అని మాజీ సీఎం చెప్పారు.
ప్రభుత్వ వైఫల్యాలను ఎండగట్టండి
‘కేసీఆర్ ఆనవాళ్లు లేకుండా చేస్తానని విర్రవీగుతున్న ముఖ్యమంత్రి నేను చేపట్టిన అనేక పనులు, పథకాలను ప్రారంభిస్తున్నాడు. యాదాద్రి పవర్ ప్లాంట్ కేసీఆర్ ఆనవాలు అనే విషయం తెలియదా. వ్యవసాయ రంగాన్ని నిరీ్వర్యం చేయడంపై అసెంబ్లీలో నిలదీయాలి, రాష్ట్రంలో వ్యవసాయ రంగాన్ని స్థిరీకరిచేందుకు దార్శనికతతో వ్యవసాయ అభివృద్ధి, రైతు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేశాం. ఎలాంటి పరిమితులు విధించకుండా రైతుబంధును అందజేశాం. కానీ ఎన్నికల సమయంలో రైతులకు ఆశపెట్టి ఎగవేస్తున్న ప్రభుత్వ వైఖరిని అసెంబ్లీలో ఎండగట్టాలి. బీసీలకు 42శాతం రిజర్వేషన్లు హామీల అమలుపై నిలదీయాలి. కేవలం ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించడానికే పరిమితం కాకుండా గతంలో బీఆర్‌ఎస్ పాలనలో అమలు చేసిన పథకాలు, కార్యక్రమాలను వివరించాలి..’ అని కేసీఆర్ చెప్పారు.
వచ్చే ఏడాదంతా సంస్థాగత నిర్మాణం
‘ప్రజలు కాంగ్రెస్‌కు ప్రత్యామ్నాయంగా బీఆర్‌ఎస్‌ను మాత్రమే చూస్తున్నారు. ఫిబ్రవరి చివరి వారంలో వరంగల్, హైదరాబాద్ కాకుండా అందరికీ అందుబాటులో ఉండే చోటును చాటుకుని భారీ జనసమీకరణతో సభ నిర్వహిద్దాం. వచ్చే ఏడాదంతా పూర్తిగా పార్టీ సంస్థాగత నిర్మాణం, గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కార్యవర్గాల ఏర్పాటు, సంస్థాగత శిక్షణ కార్యక్రమాలపైనే దృష్టి పెడదాం. జమిలి ఎన్నికలు జరిగే పక్షంలో పెద్దగా సమయం ఉండదు.
మళ్లీ అధికారంలోకి వంద శాతం మనమే వస్తాం..’ అని బీఆర్‌ఎస్ అధినేత భరోసా ఇచ్చారు. ఈ సమావేశం అనంతరం ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ నేతృత్వంలోని పార్టీ కమిటీ కేసీఆర్‌కు ‘గురుకుల బాట’ నివేదిక అందజేసింది. ఈ సందర్భంగా కమిటీని కేసీఆర్ అభినందించారు. ఇలావుండగా హైదరాబాద్‌లో ఈ నెల 11న జరిగే తన పెద్ద కుమార్తె వివాహానికి హాజరు కావాల్సిందిగా బీజేపీ శాసనసభాపక్ష నేత ఏలేటి మహేశ్వర్‌రెడ్డి.. ఎర్రవల్లి నివాసంలో కేసీఆర్‌ను, పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలను ఆహా్వనించారు.
Comments
Please login to add a commentAdd a comment