ప్రధాని మోదీకి సీఎం కేసీఆర్ లేఖ.. | BRS Parliamentary Party Joint Meeting - Sakshi
Sakshi News home page

బీసీ, మహిళా రిజర్వేషన్‌లపై బీఆర్‌ఎస్ పట్టు.. పార్లమెంట్ ప్రత్యేక మీటింగ్‌లో బిల్లు

Published Fri, Sep 15 2023 5:31 PM | Last Updated on Fri, Sep 15 2023 7:14 PM

BRS Parliamentary Party Joint Meeting  - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: చట్టసభల్లో 33 శాతం బీసీ రిజర్వేషన్ బిల్లుతో సహా  33 శాతం మహిళా రిజర్వేషన్ బిల్లును ఈనెల 18 నుంచి నిర్వహించనున్న పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో కచ్చితంగా ప్రవేశపెట్టాలని బీఆర్‌ఎస్‌ పార్టీ డిమాండ్‌ చేస్తోంది. ఈ మేరకు నేడు(శుక్రవారం) ప్రగతి భవన్లో  సమావేశమైన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ  సంయుక్త సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. బీఆర్ఎస్ పార్టీ జాతీయ అధ్యక్షులు, ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన శుక్రవారం బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం జరిగింది. ఈ సందర్భంగా బీసీ (ఓబీసీ) బిల్లు, మహిళా బిల్లులను పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో ప్రవేశపెట్టే దిశగా పార్టీ ఎంపీలు చేపట్టాల్సిన కార్యాచరణ సంబంధిత అంశాలపై  సుధీర్ఘంగా చర్చించారు. 

మహిళా సంక్షేమం, బీసీల అభ్యున్నతి కోసం బిఆర్ఎస్ పార్టీ కట్టుబడి వున్నదని, దేశవ్యాప్తంగా వారి హక్కులను కాపాడేందుకు ఎప్పటికప్పుడు తన గళాన్ని వినిపిస్తూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ దిశగా పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో పార్టీ డిమాండ్లను రాజ్యసభ, లోక్ సభల్లో ఎంపీలు లేవనెత్తాలని అధినేత సీఎం కేసీఆర్ సూచించారు. 

 ప్రధానికి, సీఎం కేసీఆర్ లేఖ :
బీసీ (ఓబీసీ) కులాలను సామాజిక విద్య ఆర్థిక రంగాల్లో  దేశవ్యాప్తంగా మరింత ముందుకు నడిపించాల్సిన బాధ్యత కేంద్రం ప్రభుత్వం మీద ఉన్నదని సమావేశం అభిప్రాయం వ్యక్తం చేసింది. ఇప్పటికే తెలంగాణ ప్రభుత్వం బీసీల అభివృద్ధి సంక్షేమం దిశగా అమలు చేస్తున్న పథకాలు కార్యాచరణ సత్పలితాలనిస్తున్నాయని, అవి దేశానికే ఆదర్శంగా నిలిచాయని సమావేశం విశ్లేషించింది.

ముఖ్యంగా రాజకీయ అధికారంలో బీసీల భాగస్వామ్యం మరింత పెంచడం ద్వారానే వారి సర్వతోముఖాభివృద్ధి సాధ్యమని బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ పునరుద్ఘాటించింది. అందులో భాగంగా బీసీ (ఓబీసీ)లకు పార్లమెంటు అసెంబ్లీ  చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్ ను అమలు చేయాల్సిందేనని ఏకగ్రీవంగా తీర్మానించింది. ఈ దిశగా  ఈ పార్లమెంటు ప్రత్యేక సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టి చిత్తశుద్దిని నిరూపించుకోవాలని కేంద్రాన్ని డిమాండు చేసింది. 

మహిళా రిజర్వేషన్‌పై ఏకగ్రీవ తీర్మానం
సమాజంలో సగభాగమైన మహిళలు అన్ని రంగాల్లో పురుషునితో సమానంగా రాణించినప్పుడే ఏ దేశమైనా అభివృద్ధి పథంలో ముందుకు సాగుతుందని అధినేత సీఎం కేసీఆర్ అధ్యక్షతన సమావేశమైన బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సంయుక్త సమావేశం పునరుద్ఘాటించింది. మహిళల భాగస్వామ్యాన్ని రాజకీయ అధికారంలో కూడా మరింతగా పెంచేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని కేంద్రాన్ని డిమాండు చేసింది. బిఆర్ఎస్ పార్లమెంటరీ పార్టీ సమావేశంలో చర్చించి తీసుకున్న నిర్ణయాల మేరకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు భారత ప్రధాని నరేంద్ర మోదీకి మహిళా రిజర్వేషన్లపై లేఖ రాశారు.

చదవండి: ‘రాహుల్‌పై విమర్శలు మాని.. కవిత ఈడీ కేసుపై దృష్టి పెట్టండి’

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement