సాక్షి, హైదరాబాద్: అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వాయిదాపడిన భారత రాష్ట్ర సమితి (బీఆర్‌ఎస్) నియోజకవర్గ స్థాయి సమీక్ష, లోక్‌సభ ఎన్నికల సన్నాహక సమావేశాలు తిరిగి ప్రారంభమయ్యాయి. వాస్తవానికి గత నెల 27వ తేదీనే ఈ భేటీలను మొదలుపెట్టారు. ఫిబ్రవరి 10 నాటికి పూర్తి చేయాలని భావించారు. కానీ 40కిపైగా నియోజకవర్గాల్లో ముగిశాక.. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో వాయిదాపడ్డాయి. మంగళవారం నుంచి వాటిని పునః ప్రారంభించిన బీఆర్‌ఎస్.. ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలని భావిస్తోంది. దీనిపై సంబంధిత నియోజకవర్గ ఇన్‌చార్జులు, పార్టీ ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ ఆదేశాలు ఇచ్చినట్టు తెలిసింది.
మాజీ మంత్రి హరీశ్‌రావు మంగళవారం జరిగిన షాద్‌నగర్ అసెంబ్లీ నియోజకవర్గ బీఆర్‌ఎస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్నారు. విదేశ పర్యటనలో ఉన్న కేటీఆర్ తిరిగొచ్చాక ఈ భేటీల్లో పాల్గొననున్నారు. అసెంబ్లీ నియోజకవర్గ స్థాయి సమీక్షలు ముగిశాక.. పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ఆధ్వర్యంలో.. పార్టీ ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ముఖ్య నేతలతో తెలంగాణ భవన్‌లో విస్తృతస్థాయి సమావేశం నిర్వహించనున్నట్టు బీఆర్‌ఎస్ వర్గాలు తెలిపాయి. మార్చి మొదటివారంలో లోక్‌సభ ఎన్నికల నోటిఫికేషన్ విడుదలవుతుందని భావిస్తున్న నేపథ్యంలో.. ఆలోగానే కీలక నేతలకు కేసీఆర్ దిశానిర్దేశం చేయనున్నట్టు వివరించాయి.
నియోజకవర్గ స్థాయిలోనూ పోస్ట్‌మార్టం
అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి అనంతరం లోక్‌సభ, అసెంబ్లీ నియోజకవర్గ స్థాయిలో పరిస్థితిపై బీఆర్ ఎస్ పోస్ట్‌మార్టం మొదలుపెట్టింది. జనవరి 3 నుంచి 22వ తేదీ వరకు మూడు విడతల్లో 17 లోక్‌సభ సెగ్మెంట్లపై సుదీర్ఘంగా సమీక్షించిన పార్టీ ముఖ్యు లు.. నేతలు, కార్యకర్తల నుంచి అందిన ఫీడ్‌బ్యాక్ ను నివేదికల రూపంలో కేసీఆర్‌కు అందజేశారు. తర్వాత లోక్‌సభ ఎన్నికల సన్నద్ధతలో భాగంగా అసెంబ్లీ నియోజకవర్గాలవారీగా సమావేశాలతో లోక్‌సభ ఎన్నికలకు సన్నద్ధం కావడంపై బీఆర్‌ఎస్ దృష్టి సారించింది. జనవరి 27 నుంచి ఫిబ్రవరి 10 మధ్య రాష్ట్రంలోని అన్ని అసెంబ్లీ సెగ్మెంట్లకు సంబంధించి భేటీలు జరపాలని నిర్ణయించింది. 40కి పైగా సెగ్మెంట్ల భేటీలు ముగిశాయి. వాయిదాపడిన మిగతా నియోజకవర్గాల సభలను వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పార్టీ అధినేత కేసీఆర్ తాజాగా ఆదేశించారు.
వ్యూహాలు, అభిప్రాయాలు స్వీకరించి..
ఈ సమావేశాల్లో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలపై సమీక్షతోపాటు లోక్‌సభ ఎన్నికల్లో అనుసరించాల్సి న వ్యూహాలు, పార్టీ పటిష్టత కోసం తీసుకోవాల్సిన చర్యలపై పార్టీ నాయకులు, కార్యకర్తల సలహాలు, అభిప్రాయాలను స్వీకరిస్తున్నారు. ఈ భేటీల్లో వర్కింగ్ ప్రెసిడెంట్ కె.తారక రామారావు, మాజీ మంత్రులు హరీశ్‌రావు, సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి, కడి యం శ్రీహరి, వేముల ప్రశాంత్‌రెడ్డి, మాజీ స్పీకర్లు పోచారం శ్రీనివాస్‌రెడ్డి, మధుసూదనాచారి, ఎమ్మె ల్సీలు దేశపతి శ్రీనివాస్, ఎల్.రమణ తదితరులు పాల్గొననున్నారు. సమావేశాల్లో అందిన సూచన లు, అభిప్రాయాలను పార్టీ అధినేత కేసీఆర్‌కు నివేదించనున్నారు.
లోక్‌సభ ఎన్నికల తర్వాతే సంస్థాగత కమిటీలు
పార్టీకి 65 లక్షలకుపైగా క్రియాశీల, సాధారణ సభ్యత్వమున్నా.. గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు కమిటీలు లేకపోవడంతో అసెంబ్లీ ఎన్నికల్లో నష్టం జరిగినట్టు బీఆర్‌ఎస్ గుర్తించింది. పార్టీని అన్నిస్థాయిల్లో బలోపేతం చేసేందుకు సంస్థాగత కమిటీల ఏర్పాటు, శిక్షణ కార్యక్రమాల ఏర్పాటుపై కసరత్తు జరుగుతోంది. లోక్‌సభ ఎన్నికలు దగ్గరపడటంతో.. ఆ తర్వాతే సంస్థాగత కమిటీల ఏర్పా టు ఉంటుందని బీఆర్‌ఎస్ వర్గాలు చెప్తున్నాయి.
Comments
Please login to add a commentAdd a comment