లైన్ క్లియర్
ప్రాజెక్టుకు నోడల్ ఏజెన్సీగా టీఎస్‌ఐఐసీ కన్సల్టెన్సీ సహకారంతో డీపీఆర్‌కు తుదిరూపు
రాష్ట్రానికే తలమానికంగా ఫార్మాసిటీ రూపకల్పన
ఫార్మాసిటీ కోసం ఇప్పటివరకు ప్రభుత్వం 4వేల ఎకరాల భూమిని సేకరించింది.
ముచ్చర్ల, పంజాగూడ, మీర్‌ఖాన్‌పేట, కుర్మిద్దలో భూములకు పరిహారం కూడా చెల్లించింది.
నానక్‌నగర్, తిప్పాయిగూడ తదితర గ్రామాల్లోనూ భూములను సమీకరించే పనిలో నిమగ్నమైంది.
‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీచేసినందున.. ఇక ఫార్మా పనులు వేగం పుంజుకోనున్నాయి.
ఫార్మాసిటీకి జాతీయ పెట్టుబడులు, ఉత్పాదనల మండలి (నిమ్జ్)
హోదా కూడా కట్టబెట్టేందుకు కేంద్ర సర్కారు సూత్రప్రాయంగా అంగీకరించింది.
ఔషధనగరికి మార్గం సుగమమైంది. రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల సరిహద్దులో 12,500 ఎకరాల్లో ప్రతిపాదించిన ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ అంకురార్పణకు రాష్ట్ర ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దేశవ్యాప్తంగా బల్క్‌డ్రగ్ ఉత్పత్తుల్లో మూడో వంతు మనరాష్ట్రంలో తయారవుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్రాన్ని ఔషధ రంగానికి చిరునామాగా మార్చాలన్న కృతనిశ్చయంతో కేసీఆర్ సర్కారు ముందుకెళ్తోంది. ఇందులో భాగంగానే కందుకూరు మండలం ముచ్చర్ల కేంద్రంగా ఔషధనగరి ఏర్పాటు చేయాలని నిర్ణయించింది. కేసీఆర్ సీఎంగా పగ్గాలు చేపట్టిన తర్వాత ఔషధ దిగ్గజ కంపెనీల అధినేతలను వెంటబెట్టుకొని తొలి పర్యటనను ఇక్కడే చేశారు. అదేరోజు ఫార్మాసిటీ స్థాపనపైనా ప్రకటన చేశారు. - సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి
సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి: అంతర్జాతీయ ప్రమాణాలతో ప్రతిపాదిం చిన ఫార్మాసిటీ ప్రాజెక్టుకు జిల్లాలో 10,628.36 ఎకరాలను సమీకరించడానికి ప్రభుత్వం ప్రణాళిక తయారుచేసింది. ఫార్మాసిటీకి జాతీయ పెట్టుబడులు, ఉత్పాదనలమండలి (నిమ్జ్) హోదా కూడా కట్టబెట్టేందుకు కేంద్ర సర్కారు సూత్రప్రాయంగా అంగీకరించడం.. కనిష్టంగా 12,500 ఎకరాలుంటే గానీ ఈ హోదా వచ్చే అవకాశం లేకపోవడంతో ప్రాజెక్టు విస్తీర్ణాన్ని పెంచింది. ఈ హోదాతో రాయితీలు, మౌలిక వసతుల కల్పనకు కేంద్రం గ్రాంటు రూపేణా విరివిగా నిధులు విడుదలచేసే అవకాశం ఉండడంతో ఈ నిర్ణయం తీసుకుంది.
దీనికి అనుగుణంగా ఇరుజిల్లాల్లో కలిపి 15 వేల ఎకరాలను సమీకరించాలని నిర్ణయించింది. దీంట్లో ఇప్పటివరకు ప్రభుత్వం 4వేల ఎకరాల భూమిని సేకరించింది. ముచ్చర్ల, పంజాగూడ, మీర్‌ఖాన్‌పేట, కుర్మిద్దలో భూముల కు పరిహారం కూడా చెల్లించింది. అలాగే నానక్‌నగర్, తిప్పాయిగూడ తదితర గ్రామాల్లో కూడా భూములను సమీకరించే ప్రక్రియలో వేగం పెంచింది. అలాగే మహబూబ్‌నగర్ జిల్లా అమన్‌గల్ మండలంలోని భూ ములను ఆ జిల్లా యంత్రాంగం సమకూర్చుతోంది. కాగా, ప్రభుత్వం సమీకరిస్తున్న భూమిలో అత్యధికంగా అసైన్డ్, ప్రభుత్వ భూములే ఉన్నాయి.
రాష్ట్రానికి సిరి.. ఔషధనగరి
ఔషధ ఉత్పత్తుల్లో రాష్ట్రం ముందంజ లో ఉంది. బల్క్‌డ్రగ్ ఉత్పత్తులో మూడోవంతు తెలంగాణ నుంచే ఎగుమతి అవుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ ప్రాజెక్టుకు జీవం పోసిన ప్రభుత్వం.. ఇక్కడ జీవశాస్త్ర, జీవ సాంకేతిక పరిజ్ఞానం, ఔషధ పరిశోధన, నూతన ఔషధాల ఆవిష్కరణలకు ఫార్మాసిటీని కేంద్రంగా మలచాలని యోచిస్తోంది. దీనికి ‘నిమ్జ్’ హోదాను ఇచ్చేందుకు అనుమతించడంతో పెట్టుబడిదారులకు ఎర్రతివాచీ పరవాలని నిర్ణయించింది. ఔషధనగరి ఏర్పాటులో నోడల్ ఏజెన్సీగా వ్యవహరిస్తున్న టీఎస్‌ఐఐసీ ఇప్పటికే పలు ఔషధ తయారీ ఉత్పత్తి సంస్థలతో సంప్రదింపులు జరిపింది.
పలు కంపెనీలు ఇక్కడ తమ యూనిట్లను నెలకొల్పే విధంగా ఒప్పించగలిగింది. అంతర్జాతీయ ప్రమాణాలతో ఈ ప్రాజెక్టుకు రూపకల్పన చేస్తున్న ప్రభుత్వం.. కాలుష్య ఉద్గారాలు రాకుండా.. అంతర్జాతీయ స్థాయిలో శుద్ధియంత్రాలను ఏర్పాటు చేస్తోంది. దీనికి అనుగుణంగా నెల రోజుల క్రితం జిల్లా కలెక్టర్ రఘునందన్‌రావు నేతృత్వంలోని అధికారుల బృందం ఐర్లాండ్, ఇంగ్లాండ్, జర్మనీ తదితర దేశాల్లో పర్యటించింది. ఈ మేరకు ఎస్‌టీపీల స్థాపనకు సంబంధించిన పరిజ్ఞానాన్ని అందిపుచ్చుకోవాలని నిర్ణయించింది. మరోవైపు ఫార్మాసిటీ ప్రాజెక్టు డీపీఆర్‌ను రూపొందించడానికి అంతర్జాతీయ కన్సల్టెన్సీని నియమించింది. తాజాగా ‘హైదరాబాద్ ఫార్మాసిటీ’ ఏర్పాటుకు అనుమతి ఇస్తూ పరిశ్రమల శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్‌కుమార్ ఉత్తర్వులు జారీచేసినందున.. ఫార్మా పనులు మరింత వేగంగా ముందుకు సాగేందుకు దోహదం చేయనున్నాయని అధికారవర్గాలు తెలిపాయి.