ఎయిర్ ఇండియా విక్రయానికి గ్రీన్ సిగ్నల్
పెట్టుబడుల ఉపసంహరణకు కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం
విధివిధానాల ఖరారుకు మంత్రుల బృందం ఏర్పాటు: జైట్లీ
న్యూఢిల్లీ: భారీ అప్పుల భారంతో నెట్టుకొస్తున్న ఎయిరిండియాను ప్రైవేటు పరం చేసే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎయిరిండియాలో వాటాల ఉపసంహరణ ప్రతిపాదనకు బుధవారం జరిగిన కేంద్ర కేబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలియజేసింది. ఎంత మేర వాటా విక్రయించాలి, విధి విధానాలు ఏంటన్నది ఖరారు చేసేందుకు మంత్రుల గ్రూపును ఏర్పాటు చేయనున్నట్టు కేబినెట్ సమావేశం అనంతరం కేంద్ర ఆర్థిక మంత్రి అరుణ్‌జైట్లీ మీడియాకు తెలిపారు.
ప్రభుత్వరంగంలోని ఎయిరిండియా రూ.52,000 కోట్లకు పైగా రుణ భారాన్ని మోస్తోంది. 2012లో యూపీఏ సర్కారు రూ.30,000 కోట్ల బెయిలవుట్ ప్యాకేజీతో దీన్ని తాత్కాలికంగా ఒడ్డున పడేసింది. మరోవైపు ఎయిర్ ఇండియాను పూర్తిగా ప్రైవేటు పరం చేయాలని నీతి ఆయోగ్ ఇప్పటికే ప్రభుత్వానికి సూచించింది. ప్రజల పన్నుల ఆదాయంతో ఎయిరిండియాను నడపడం ఎంత మాత్రం సరికాదని అరుణ్ జైట్లీ లోగడే పేర్కొన్నారు.
సుదీర్ఘ ప్రక్రియ
ఎయిరిండియాలో వాటా విక్రయం అన్నది దీర్ఘకాలం పాటు కొనసాగే ప్రక్రియగా ప్రభుత్వ అధికారులు పేర్కొంటున్నారు. ఇందుకు ఒకటికిమించిన కేబినెట్ ఆమోదాలు అవసరమంటున్నారు. ప్రస్తుతం ఇచ్చింది సూత్రప్రాయ ఆమోదమే. ఎంత వాటా విక్రయించాలి, అందుకు ఏ విధానం అనుసరించాలన్నది మంత్రుల బృందం ఖరారు చేయాల్సి ఉంది. ఆ తర్వాత అర్హతగల పెట్టుబడిదారుని గుర్తించడం, వాటా విక్రయించడం ఈ సుదీర్ఘ ప్రక్రియ దృష్ట్యా వాటా విక్రయం ప్రస్తుత ఆర్థిక సంవత్సరం(2017–18)లో పూర్తి కాకపోవచ్చన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
అధికారులు చెబుతున్న దాని ప్రకారం... ప్రైవేటుపరం చేయాలన్న నిర్ణయానికి ప్రభుత్వం సూత్రప్రాయ ఆమోదం ఇచ్చిన తర్వాత కేంద్ర ఆర్థిక శాఖ, పౌర విమానయాన శాఖ సదరు సంస్థ విలువను తేల్చే పనిని ప్రారంభిస్తాయి. కొనుగోలుదారుల అర్హతలను ఖరారు చేస్తాయి. తర్వాత ఈ అర్హతలకు తగ్గ కొనుగోలుదారును ఎంపిక చేయాల్సి ఉంటుంది. ఆ తర్వాత ఎయిరిండియాకు ఉన్న అప్పులు, ఆస్తుల విలువలను తేల్చాల్సి ఉంటుంది. ఉద్యోగులతో చర్చలు, ఆర్థిక, న్యాయ సలహాదారుల ఎంపిక ఇవన్నీ తదుపరి ప్రక్రియలు. ఇదంతా ముగిసిన తర్వాత తిరిగి ఈ అంశం తుది ఆమోదం కోసం మరోసారి కేబినెట్ ముందుకు వస్తుంది.
పలు ప్రతిపాదనలపై చర్చ
వాస్తవానికి ఎయిరిండియా విషయమై గతంలో పలు ప్రతిపాదనలు చర్చకు వచ్చాయి. ప్రభుత్వమే దీన్ని నడిపించాలనేది అందులో ఒకటి. ఇది సాధ్యం కాదని భావించడంతో ఆస్తులను విక్రయించడం ద్వారా అప్పుల భారాన్ని తగ్గించుకోవడం, రుణదాతలు అంగీకరిస్తే అప్పులను సంస్థలో వాటాగా మార్చడం, ఎయిరిండియా అనుబంధ సంస్థలైన ఎయిరిండియా ట్రాన్స్‌పోర్ట్ సర్వీసెస్, హోటల్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియాలను విక్రయించడం వంటి అంశాలు కూడా చర్చకు వచ్చాయి. సిబ్బంది సంఖ్యను తగ్గించుకోవడం, వాటా కొనుగోలుకు విదేశీ కంపెనీని అనుమతించడంపైనా చర్చించినట్టు అధికార వర్గాలు తెలిపాయి.
రేసులో ‘టాటా’
ఎయిరిండియాలో నియంత్రిత వాటా (కనీసం 51 శాతం)ను కొనుగోలు చేసేందుకు టాటా గ్రూపు చైర్మన్ ఎన్. చంద్రశేఖరన్ ఇటీవలే కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపినట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఎయిరిండియాలో వాటా విక్రయించాలని నిర్ణయం తీసుకోవడం గమనార్హం. ఎయిర్ ఇండియా 1948కి ముందు టాటాల ఆధ్వర్యంలోనే నడిచింది.
వాటా అమ్మొద్దు.. రుణాలు మాఫీ చేయండి
ఎయిరిండియా ఉద్యోగుల డిమాండ్
ఎయిరిండియాలో ప్రభుత్వ వాటా విక్రయ నిర్ణయాన్ని సంస్థ ఉద్యోగులు వ్యతిరేకించారు. వాటా విక్రయానికి బదులు సంస్థ రుణాలను ప్రభుత్వం మాఫీ చేయాలని కోరారు. ఎయిరిండియా ఎంప్లాయీస్ యూనియన్ బుధవారం నీతి ఆయోగ్ చైర్మన్ అరవింద్ పనగారియా ను కలసి ఈ మేరకు డిమాండ్ చేసింది. రూ.52,000 కోట్ల రుణ భారంతో ఉన్న ఎయిరిండియాను ప్రైవేటు పరం చేయడమే ఉత్తమమని నీతి ఆయోగ్ ప్రభుత్వానికి సిఫారసు చేసింది. ‘‘రూ.30,000 కోట్ల రుణాలను రద్దు చేయండి. జాతీయ సంస్థగా నిర్వహణకు అవకాశం ఇవ్వండి’’ అని ఎయిరిండియా ఉద్యోగుల సంఘం పనగారియాకు ఓ వినతిపత్రాన్ని అందజేసింది. ఒకవేళ విక్రయించాలనుకుంటే ఉద్యోగుల బకాయిలన్నీ తీర్చేయాలని యూనియన్ ప్రతినిధులు కోరడం గమనార్హం.
తొందరపాటు నిర్ణయాలు, 111 విమానాలను కొనుగోలు చేయాలని నిర్ణయించడం, లాభదాయక మార్గాలను ప్రైవేటు సంస్థలకు అప్పగించడం వంటి ప్రభుత్వ తప్పుడు విధానాలే సంస్థ భారీగా నష్టాలు ఎదుర్కోవడానికి కారణమని యూనియన్ ప్రతినిధులు ఆరోపించారు. విశ్రాంత ఉద్యోగులను చివరి వేతనంపై నియమించడం, సురేష్‌రైనా, యువరాజ్ సింగ్, హర్భజన్‌సింగ్ వంటి వారి వల్ల సంస్థపై కోట్లాది రూపాయల భారం పడిందన్నారు. సంస్థను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయిస్తే పెద్ద ఎత్తున సమ్మె చేస్తామని ఎయిరిండియాకు చెందిన ఏడు ఉద్యోగ సంఘాలు ఇప్పటికే హెచ్చరించాయి. ఎయిరిండియాలో 25,000 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు.