కొనేవారెవరు..?
న్యూఢిల్లీః భారత ప్రభుత్వ రంగ సంస్ధ ఎయిర్ ఇండియా అమ్మకం ప్రక్రియను ఈ ఏడాది చివరకు పూర్తి చేసేందుకు కేంద్రం ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వేలాది కోట్ల రుణభారంతో సతమతమవుతున్న ఎయిర్‌లైనర్‌ను దేశీయ సంస్ధకే కట్టబెట్టాలని ప్రభుత్వం భావిస్తోంది. ఎయిర్ ఇండియా డిజిన్వెస్ట్‌మెంట్‌కు ఈ ఏడాది జూన్‌లోనే కేంద్ర క్యాబినెట్ సూత్రప్రాయ ఆమోదం తెలిపిన విషయం తెలిసిందే.
ఆర్థిక మంత్రి అరుణ్ జైట్లీ నేతృత్వంలోని మంత్రుల బృందం ఎయిర్ ఇండియా విక్రయ ప్రక్రియను ముందుకు తీసుకెళ్లనుంది. ఈ ఏడాది చివరి కల్లా సంస్థ విక్రయ ప్రక్రియ కొలిక్కివస్తుందని, సంక్షోభంలో కూరుకుపోయిన సంస్ధను ప్రయివేటీకరించడం మినహా మరో మార్గం లేదని అధికార వర్గాలు పేర్కొన్నాయి. ఎయిర్ ఇండియా కొనుగోలుకు కొన్ని విదేశీ ఎయిర్‌లైనర్‌లు ముందుకొస్తున్నా దేశీయ కొనుగోలుదారుకే ప్రాధాన్యం ఇవ్వాలని యోచిస్తున్నట్టు అధికారులు వెల్లడించారు.
సంస్థలో నూరు శాతం వాటాను విక్రయించాలని, రుణాన్ని మాఫీ చేయాలని నీతి ఆయోగ్ సూచించిన అనంతరం ఎయిర్ ఇండియాలో పెట్టుబడుల ఉపసంహరణ ప్రతిపాదన ఊపందుకుంది. మరోవైపు ఎయిర్ ఇండియా రుణాల ఊబిలో కూరుకుపోవడంతో కొనుగోలుదారులు ముందుకు రాని పక్షంలో రుణాలను పాక్షికంగా రద్దు చేసే ప్రతిపాదననూ మంత్రుల బృందం పరిశీలిస్తుందని భావిస్తున్నారు.