నిష్పక్షపాతమే మా విధానం | Impartiality is our policy says Buggana Rajendranath | Sakshi
Sakshi News home page

నిష్పక్షపాతమే మా విధానం

Published Tue, Jul 30 2019 4:25 AM | Last Updated on Tue, Jul 30 2019 4:25 AM

Impartiality is our policy says Buggana Rajendranath - Sakshi

సాక్షి, అమరావతి: శాంతి భద్రతల పరిరక్షణ విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించాలన్నది తమ ప్రభుత్వ విధానమైతే టీడీపీ నాయకులకు అనుకూలంగా పని చేయాలన్నది గత సర్కారు విధానమని ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ పేర్కొన్నారు. ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చ సందర్భంగా సోమవారం అసెంబ్లీలో టీడీపీ సభ్యులు వ్యక్తం చేసిన విమర్శలు, అభ్యంతరాలపై మంత్రి బుగ్గన వివరణ ఇచ్చారు. 

నిక్కచ్చిగా ఉండండి... మావాళ్లకు సపోర్టు చేయండి
‘చట్టవిరుద్ధమైన కార్యకలాపాలు ఎవరు చేసినా సహించవద్దని, శాంతి భద్రతల విషయంలో నిక్కచ్చిగా వ్యవహరించాలని, పార్టీలు, వ్యక్తులని చూడవద్దని తొలిసారిగా కలెక్టర్లు, ఎస్పీలతో నిర్వహించిన సమావేశంలో ముఖ్యమంత్రి జగన్‌ చెప్పారు. చట్ట వ్యతిరేక వ్యవహారాల్లో పాల్గొంటే అధికార పార్టీ ఎమ్మెల్యేలైనా సరే వదలొద్దన్నారు. ఇదే విషయం మీడియాలోనూ వచ్చింది. అయితే చంద్రబాబు మాత్రం 2014 సెప్టెంబర్‌లో జరిగిన కలెక్టర్లు, ఎస్పీల తొలి సమావేశంలో.. నాకు మీరు ముఖ్యం కాదు. పార్టీనే ముఖ్యం. మా వాళ్లు ఏం  చేసినా మీరు (కలెక్టర్లు, ఎస్పీలు) సపోర్టు చేయాలి..’ అని బాహాటంగానే చెప్పారు’ అని బుగ్గన గుర్తు చేశారు.

జన్మభూమి కమిటీల వేధింపులతోనే...
‘శాంతి భద్రతల పరిరక్షణలో మా ప్రభుత్వం చాలా కఠినంగా వ్యవహరిస్తోంది. అయినా కూడా అక్కడో ఇక్కడో గ్రామాల్లో కొన్ని  సంఘటనలు జరిగి ఉండొచ్చు. అవి వ్యక్తుల వ్యక్తిగత కోపతాపాల వల్ల జరిగినవే. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీలు లంచాల, వేధింపులకు గురైన వారు ఆగ్రహావేశాలతో అక్కడక్కడా దాడులకు పాల్పడి ఉంటే రాష్ట్రం మొత్తానికి, ప్రభుత్వానికి ఆపాదించడం సరికాదు’ అని బుగ్గన చెప్పారు. అన్నదాతా సుఖీభవ పథకాన్ని అమలు చేయడం లేదని టీడీపీ సభ్యులు ప్రస్తావించడంపై స్పందిస్తూ వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రతిపక్ష నేతగా ఉండగానే రెండేళ్ల కిందటే వైఎస్సార్‌ రైతు భరోసా పథకాన్ని ప్రకటించి ప్రతి రైతు కుటుంబానికి రూ. 12,500 చొప్పున ఇస్తామని ప్రకటించారని గుర్తు చేశారు.

‘మిడ్‌నైట్‌’ ప్యాకేజీలతో నష్టమిదీ
పోలవరం ఆలస్యం కావడానికి గత పాలకుల పాపమే కారణమని బుగ్గన విమర్శించారు. ‘2014లో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైతే 2016 సెప్టెంబర్‌లో ‘‘మిడ్‌ నైట్‌ ప్యాకేజీ’’ మాట్లాడుకునే వరకు రెండున్నర ఏళ్లు  ఏం చేసినట్లు?’ అని ప్రశ్నించారు. తమ ప్రభుత్వం పోలవరం సత్వరమే పూర్తికి చర్యలు తీసుకుంటోందని తెలిపారు. గోదావరి జలాలు కృష్ణా ఆయకట్టుకు, రాయలసీమ ప్రాంతానికి అందించడానికి ఎన్ని మార్గాలున్నాయో అన్నిటిపైనా ముఖ్యమంత్రి జగన్‌ ఆలోచిస్తున్నారని చెప్పారు. విపక్ష నాయకుడు, ఆ పార్టీ నేతలకు తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్‌ అంటే అంత భయం ఎందుకో అర్థం కావడం లేదని వ్యాఖ్యానించారు.

దేశంలోనే తొలిసారి.. ‘జగనన్న అమ్మ ఒడి’
‘తమ పిల్లలను చదువుల బాట పట్టించి వారి రాతను తిరగ రాయాలనుకున్న తల్లులకు ఈ ప్రభుత్వం నిండు హృదయంతో నమస్కరిస్తోందని బుగ్గన పేర్కొన్నారు. ‘జగనన్న అమ్మ ఒడి’ పథకాన్ని దేశంలో తొలిసారిగా తెస్తున్న రాష్ట్రం మనదేనన్నారు.

నాడు మీరేం చేశారు?
మూడేళ్లుగా కరువు నెలకొంటే జీఎస్డీపీ పెరిగిందంటూ చంద్రబాబు చేపల కథలు చెబుతున్నారని బుగ్గన దుయ్యబట్టారు. అందులో ఏదో మతలబు ఉందని తాము గతంలోనే చెప్పామని గుర్తు చేశారు. మత్స్యకారులకు రూ.లక్ష చొప్పున ఇవ్వాలని సూచిస్తున్న టీడీపీ అధికారంలో ఉండగా ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. ‘బడ్జెట్లో గృహనిర్మాణ రంగానికి కేటాయింపులు తక్కువగా ఉన్నాయని టీడీపీ సభ్యులు ప్రస్తావించారు. గతంలో వాళ్లు చేసిన ఖర్చు రూ.3,189 కోట్లు కాగా మేం రూ.3,617 కోట్లు బడ్జెట్లో పెట్టాం. పేదల ఇళ్ల పట్టాలకు భూసేకరణ కోసం రూ.5,000 కోట్లు కేటాయిస్తే చాలదంటున్నారు. ప్రభుత్వ భూములు సరిపోనప్పుడు మాత్రమే కొనుగోలు చేస్తాం’ అని బుగ్గన పేర్కొన్నారు.

టీడీపీ సర్కారు అవినీతికి ఇదిగో నిదర్శనం
‘గత పాలకులు అర్బన్‌ హౌసింగ్‌ను టిడ్కోకు ఇచ్చి నిర్మాణ వ్యయం చదరపు అడుగుకు  రూ.2,200 చొప్పున చెల్లించారు. మేం చదరపు అడుగుకు రూ.1,200 – 1,300 తోనే ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేస్తాం. అసెంబ్లీ భవనం నిర్మాణానికి అడుగుకు  రూ.11,000 చొప్పున వెచ్చించారు.  హైదరాబాద్‌ మహా నగరంలోనే భూమి విలువతో కలుపుకొని చదరపు అడుగు ఇల్లు  రూ.5,000కే వస్తోంది. ఇక్కడ భూమి విలువతో సంబంధం లేకుండా చదరపు అడుగు నిర్మాణానికే రూ.11,000 చొప్పున ఇచ్చారంటే ఎంత అవినీతి జరిగిందో చూడండి. వీటన్నింటిపై సమగ్ర విచారణ జరుగుతుంది’ అని బుగ్గన చెప్పారు.

మూడు బడ్జెట్లలో భృతికి సున్నా..
బాబు వస్తే జాబు వస్తుందంటూ ప్రచారం చేసుకుని టీడీపీ సర్కారు మూడు బడ్జెట్లలో నిరుద్యోగ భృతికి రూపాయి కూడా కేటాయించలేదని బుగ్గన ధ్వజమెత్తారు. 2017– 18లో రూ.500 కోట్లు బడ్జెట్‌లో చూపించినా రూపాయి కూడా ఖర్చు చేయలేదన్నారు. 2018– 19లో రూ.1,000 కోట్లు కేటాయించి రూ.273 కోట్లు మాత్రమే ఖర్చు చేసిందని తెలిపారు.  మద్యపాన నిషేధాన్ని విడతల వారీగా అమలు చేసేందుకే ప్రభుత్వ ఆధ్వర్యంలో దుకాణాలు ఏర్పాటు చేస్తున్నామని బుగ్గన వివరించారు. గత పాలకులు పింఛన్లకు ఐదేళ్లలో ఏడాదికి సగటున రూ. 5,507 కోట్లు కేటాయించగా తమ ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లోనే రూ.15,600 కోట్లు కేటాయించిందని తెలిపారు. ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేందుకు తెలంగాణ ప్రభుత్వంతో చర్చలు జరుపుతున్నామన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement