సాక్షి, అమరావతి: ద్రవ్య వినిమయ బిల్లు (అప్రాప్రియేషన్ బిల్)కు బుధవారం అసెంబ్లీ ఆమోదం తెలిపింది. ఈ ఆర్థిక సంవత్సరంలో రూ. 2,28,738 కోట్ల బడ్జెట్ వినియోగానికి సంబంధించిన ఈ బిల్లును సభలో ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రవేశపెట్టారు. అలాగే గడిచిన మూడు మాసాలకు గానూ బడ్జెట్ వినియోగానికి ఇచ్చిన ఆర్డినెన్స్‌కూ సభ ఆమోద ముద్ర వేసింది. 2019–20 ఆర్థిక సంవత్సరానికి అనుబంధ వ్యయాలు (సప్లిమెంటరీ ఎస్టిమేట్స్)కు శాసనసభ ఆమోదం తెలిపింది. ద్రవ్య వినిమయ బిల్లుకు ఆమోద ముద్ర వేసిన అనంతరం స్పీకర్ తమ్మినేని సీతారాం శాసనసభను నిరవధికంగా వాయిదా వేశారు.
► అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు 5.58 గంటల పాటు జరిగినట్లు స్పీకర్ చెప్పారు.
► ద్రవ్య వినిమయ బిల్లుతో సహా 15 బిల్లులు పాస్ చేసినట్టు పేర్కొన్నారు.
► ద్రవ్య వినిమయ బిల్లు పాస్ చేసే సమయంలో స్పీకర్.. మీకేమైనా వేతనాలు తగ్గాయా అంటూ ఛలోక్తి విసిరారు. దీనికి సభ్యులు ఒక్కసారిగా నవ్వి.. తమకు ఎలాంటి కోతలూ లేవని అన్నారు.
► ఈ సమావేశాల్లో వైఎస్సార్ సీపీ తరఫున 151 మంది, టీడీపీ తరఫున 23 మంది, జనసేన పార్టీ తరఫున ఒకరు పాల్గొన్నారని స్పీకర్ తెలిపారు.
► 2020–21 బడ్జెట్‌కు సంబంధించి వివిధ శాఖల పద్దులను కూడా శాసనసభ ఆమోదించింది.
► రాష్ట్ర బడ్జెట్‌కు అనుగుణంగా వివిధ శాఖల పద్దులను విడివిడిగా ఆమోదించాల్సిందిగా అన్ని శాఖల తరఫున ఆర్థిక మంత్రి శాసనసభను కోరారు.
► అనంతరం సభాపతి స్థానంలో ఉన్న డిప్యూటీ స్పీకర్ కోన రఘుపతి ఆయా శాఖల పద్దులకు సభ ఆమోదం తెలిపిందని ప్రకటించారు.
ద్రవ్య వినిమయ బిల్లుకు అసెంబ్లీ ఆమోదం
Published Thu, Jun 18 2020 3:32 AM | Last Updated on Thu, Jun 18 2020 3:32 AM
Advertisement
Comments
Please login to add a commentAdd a comment