సాక్షి, అమరావతి: రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు వచ్చాయని ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ చెప్పారు. బుధవారం శాసన మండలిలో బడ్జెట్‌పై చర్చ అనంతరం సభ్యుల ప్రశ్నలకు సమాధానమిస్తూ.. భారీగా పెట్టుబడులు రావడం వల్ల పెద్దఎత్తున ఉపాధి, ఉద్యోగ అవకాశాలు కల్పించినట్టు తెలిపారు. బుగ్గన ఇంకా ఏమన్నారంటే..
► ఈ బడ్జెట్‌లో సంక్షేమం, అభివృద్ధికి సమన్యాయం కల్పించాం. విభజన సమయంలో కేంద్రం నుంచి రావాల్సిన రెవెన్యూ గ్రాంట్లు రావడం లేదు. ఆర్థిక ఇబ్బందులు ఉన్నా సంక్షేమ పథకాలను కొనసాగిస్తున్నాం.
► భోగాపురం ఎయిర్‌పోర్టు నిర్మాణానికి గత ప్రభుత్వం జీఎమ్మార్‌కు 2,700 ఎకరాలను కేటాయించింది. ఇప్పుడు 2,200 ఎకరాల్లోనే విమానాశ్రయ నిర్మాణానికి ఆ సంస్థ అంగీకరించింది. తాజా ఒప్పందం ప్రకారం ప్రభుత్వానికి 500 ఎకరాలు మిగిలింది.
► రాష్ట్రంలో 15 చోట్ల టూరిజం అభివృద్ధి పనులు చేపట్టనున్నాం. నూతన పథకాలకు రూ.20 వేల కోట్లకు పైగా ఖర్చు చేస్తున్నాం.
► నవంబర్‌లో కరోనా వైరస్ పీక్ స్టేజ్ (గరిష్ట దశ)కు చేరుకుంటుందని వైద్య నిపుణుల అంచనా. ఇలాంటి పరిస్థితుల్లో రాష్ట్రంలో అభివృద్ధి పనులు ఎప్పటిలోగా పూర్తి చేస్తామని అడిగితే చెప్పలేని పరిస్థితి దాపురించింది.
► కరోనా వేళ సభ నడపటానికే ఇబ్బందికర పరిస్థితులుంటే ప్రతిపక్ష సభ్యులు బడ్జెట్ అంశాలు కాకుండా ఏవేవో మాట్లాడుతూ సమయం వృథా చేస్తున్నారు.
శాసనమండలిలో బడ్జెట్‌పై చర్చ సందర్భంగా వైఎస్సార్‌సీపీ, పీడీఎఫ్, టీడీపీ, బీజేపీ ఎమ్మెల్సీలు మాట్లాడారు. సభ్యులు ఏమన్నారంటే..
ఏ వర్గాన్నీ నిర్లక్ష్యం చేయని బడ్జెట్
అన్నివర్గాల అభ్యున్నతే లక్ష్యంగా జగన్‌మోహన్‌రెడ్డి ప్రభుత్వం ఏడాది పాలన కొనసాగింది. ఈ బడ్జెట్‌లోనూ ఏ ఒక్క వర్గాన్ని నిర్లక్ష్యం చేయకుండా కేటాయింపులు చేశారు. అధికారం చేపట్టిన ఏడాదిలోపే 4 లక్షల మందికి ఉద్యోగాలు కల్పించి సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నిరుద్యోగ సమస్యకు పరిష్కారం చూపారు.
– జంగా కృష్ణమూర్తి, వైఎస్సార్‌సీపీ సభ్యుడు
తేడా కనిపిస్తోంది
బడ్జెట్ అంచనాలకు, వాస్తవ పరిస్థితులకు చాలా తేడా కనిపిస్తోంది.
– దీపక్‌రెడ్డి, టీడీపీ ఎమ్మెల్సీ
ఎక్కువ నిధులు రాబట్టాలి
బడ్జెట్ ప్రతిపాదనలకు, వాస్తవానికి పొంతన లేదు. కేంద్రం నుంచి ఎక్కువ నిధులను రాబట్టాల్సిన అవసరం ఉంది. ఏడాది కాలంలో అమలు చేసిన సంక్షేమ పథకాలు పేదలకు ఊరట కలిగిస్తాయి. పేదలను శాశ్వతంగా అభివృద్ధి చేసే కార్యక్రమాలను కూడా కొనసాగించాలి.
– లక్ష్మణరావు, పీడీఎఫ్ ఎమ్మెల్సీ
మా పార్టీ సమర్థిస్తోంది
ఏడాది పాలనలో 3.58 కోట్ల ప్రజలకు ప్రభుత్వం వివిధ సంక్షేమ పథకాలను చేరువ చేసింది. ఈ బడ్జెట్‌లోనూ సంక్షేమ పథకాలకు చేసిన కేటాయింపులను మా పార్టీ సమర్ధిస్తోంది. రాష్ట్ర ఆదాయం పెంచే మార్గాలను బడ్జెట్‌లో ఎక్కడా పొందుపరచలేదు.
Comments
Please login to add a commentAdd a comment