సాక్షి, అమరావతి: బడ్జెట్‌లో ప్రజల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం పెద్దపీట వేసింది. పేదలకు పూర్తి స్థాయి ఆరోగ్య సేవలను అందించడమే లక్ష్యంగా వైఎస్ జగన్ ప్రభుత్వం ముందుకెళ్తుంది. ‘వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం’ పరిధిని విస్తరించింది. ఇప్పటికే అందుబాటులో ఉన్న 1059 ఆరోగ్య విధానాలతో పాటు, అదనంగా 1000 ఆరోగ్య విధానాలను కూడా ప్రవేశపెట్టింది. ఈ ఏడాది జనవరి నుంచి స్మార్ట్ హెల్త్ కార్డుల పంపిణీ మొదలయ్యింది. దాదాపు కోటి 42 లక్షలు మేరకు కార్డులు పంపిణీ కానున్నాయి. పేద కుటుంబాలకు చెందిన రోగులకు శస్త్ర చికిత్సలు అవసరమైనప్పుడు వారు కోలుకోవటానికి పట్టే కాలంలో ఉపాధి లభించడం కష్టం కాబట్టి, ఆ నష్టాన్ని భర్తీ చేయడానికి ‘వైఎస్సార్ ఆరోగ్య ఆసరా పథకం’ కింద రోజుకు 225 రూపాయలు మేరకు శస్త్రచికిత్స అనంతర భత్యాన్ని మంజూరు చేస్తున్నారు. రాష్ట్ర సరిహద్దుల్లో నివసిస్తున్న పేద కుటుంబాల సౌకర్యం కోసం తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల్లో కూడా వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకం కింద 130 ఆసుపత్రులను ఎంపిక చేశారు. (ఏపీ బడ్జెట్ హైలైట్స్)
కంటి వెలుగుకు రూ.20 కోట్లు..
అందరికీ కంటి పరీక్షలు నిర్వహించి తగిన చికిత్సలు, సదుపాయాలు అందించాలనే ఉద్దేశ్యంతో గత ఏడాది అక్టోబర్ 10న కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో మొదటి విడతగా 69 లక్షలు, రెండో విడతగా 4 లక్షల 60 వేల మంది పాఠశాల విద్యార్థులకు కంటి పరీక్షలు నిర్వహించారు. మూడో దశలో 60 ఏళ్లు పైబడిన వారందరికీ పరీక్షలు నిర్వహించడంతో పాటు కళ్లద్ధాలు కూడా అందించనున్నారు. తదుపరి రాష్ట్ర ప్రజలందరూ కంటి వెలుగు పథకం కింద లబ్ధిపొందనున్నారు. 2020-21 సంవత్సరానికి గాను రూ.20 కోట్లు బడ్జెట్‌ను ప్రతిపాదించారు. (ఏపీ బడ్జెట్ : గిరిజన జీవితాల్లో వెలుగులు)
అత్యవసర సేవలకు 1000 కొత్త వాహనాలు
అత్యవసర వైద్యసేవలను ప్రజలకు సకాలంలో అందించడానికి ప్రభుత్వం అన్ని చర్యలు చేపట్టింది. ఇందుకుగాను ‘108 అంబులెన్స్ పథకం’ కింద 439 అంబులెన్స్‌లను ప్రతి మండలానికి ఒక్కొక్కటి చొప్పున కేటాయించనున్నారు. సంచార వైద్య వాహనాలను కూడా పెంచనున్నారు. 1000 కొత్త వాహనాలను ఈ ఏడాది ప్రారంభించనున్నారు. 108, 104 సేవల కింద రూ.470.29 కోట్లు బడ్జెట్‌ను
ప్రతిపాదించారు.
వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు
వైద్య ఆరోగ్య రంగంలో ‘నాడు-నేడు’ పథకం కింద సబ్ సెంటర్ల నుంచి టీచింగ్ ఆసుపత్రుల దాకా మౌలిక సదుపాయాలు,వైద్య సామాగ్రి, అదనపు మానవ వనరుల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గ్రామ,వార్డు స్థాయిలో 11,000కు పైగా వైఎస్సార్ హెల్త్ క్లినిక్‌లు నెలకొల్పనున్నారు. రాష్ట్రం అంతటా దశలవారీగా 15 కొత్త వైద్య కళాశాలలను ప్రారంభించనున్నారు. క్యాన్సర్, మూత్రపిండ సంబంధింత సమస్యల చికిత్సలకు ‘నాడు-నేడు’ పథకం కింద సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులను కూడా నిర్మించనున్నారు. ఈ పథకం కింద మొత్తం 1145 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 195 కమ్యూనిటీ ఆరోగ్య కేంద్రాలు, 28 ప్రాంతీయ వైద్యశాలలు, 13 జిల్లా ఆసుపత్రులు, 11 బోధన ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలను ఆధునీకరించనున్నారు. వైద్య ఆరోగ్య శాఖలో ఉన్న ఖాళీలను భర్తీ చేయడానికి 9,700 మంది ఆరోగ్య సిబ్బందిని ప్రభుత్వం నియమించనుంది. వైద్య ఆరోగ్య శాఖలో ఇంత పెద్ద ఎత్తు నియామకాలు చేపట్టడం రాష్ట్ర చరిత్రలో ఇదే ప్రథమం. ఆరోగ్యశాఖకు ఈ బడ్జెట్‌లో రూ.11,419.44 కోట్లును ప్రతిపాదించారు.
Comments
Please login to add a commentAdd a comment