సాక్షి, అమరావతి: అర్థవంతమైన చర్చలు, సలహాలు, సూచనలతో ఆదర్శంగా నిలవాల్సిన శాసనమండలి టీడీపీ రాజకీయ కుయుక్తులకు వేదికైంది. విపక్ష సభ్యులు మరోసారి అప్రజాస్వామిక చర్యలకు పాల్పడ్డారు. శాసనసభ ఆమోదించిన బిల్లులను అడ్డుకునేందుకు ఏం చేయడానికైనా సిద్ధం అనే రీతిలో దౌర్జన్యంగా వ్యవహరించారు. పరిపాలనా వికేంద్రీకరణ, సీఆర్డీఏ రద్దు బిల్లులతో పాటు ద్రవ్య వినిమయ బిల్లును బుధవారం మండలిలో ప్రవేశపెట్టనివ్వకుండా టీడీపీ సభ్యులు అడ్డుకుని దుష్ట సంప్రదాయాన్ని కొనసాగించారు.
నిబంధనల మేరకు సభ నడపాలని అధికార పార్టీకి చెందిన సభ్యులు అభ్యర్థించినా ఆలకించలేదు. రూల్ 90 ప్రకారం చర్చ చేపట్టాలంటే ఒక రోజు ముందుగా నోటీసు ఇవ్వాలనే సంప్రదాయాన్ని పాటించకుండా అప్పటికప్పుడు చైర్మన్‌కు నోటీసు ఇచ్చి పరిగణలోకి తీసుకోవాలంటూ టీడీపీ సభ్యులు రభస చేశారు. సంఖ్యా బలంతో జాప్యం చేయడం మినహా బిల్లులను అడ్డుకోలేమని తెలిసినా డ్రామాలకు తెరతీయడంపై ప్రజాస్వామికవాదులు, నిపుణులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు.
అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం
మండలిలో ద్రవ్య వినిమయ బిల్లు సహా ఇతర బిల్లులను అడ్డుకోవడం రాజ్యాంగ విరుద్ధం. మండలిలో బుధవారం జరిగిన పరిణామాలు ఆందోళనకరం.ద్రవ్య వినిమయ బిల్లును మండలి ఆమోదించడం రాజ్యాంగ విధి. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్‌ను, బిల్లును రాజ్యసభ ఆమోదిస్తున్నప్పుడు ఇక్కడ ఈ పరిస్థితి ఏమిటి? ఆర్థిక బిల్లును అడ్డుకున్నా లావాదేవీలు ఆగవు. కాకుంటే కాస్త ఆలస్యమవుతాయి.
– పీజే చంద్రశేఖర్, మాజీ ఎమ్మెల్సీ
పెద్దల సభ పరిధి సలహాల వరకే..
‘ద్రవ్యవినిమయ బిల్లు మనీ బిల్లు కనుక శాసనసభకే సర్వాధికారాలుంటాయి. శాసనమండలి అనేది పెద్దల సభ. కేవలం సలహాలు ఇవ్వడం వరకు మాత్రమే దాని పరిధి. బడ్జెట్‌పై చర్చించి వారికేమైనా సలహాలుంటే ఇచ్చి ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించాల్సిందే. పరిస్థితులు ఎలా ఉన్నా సద్దుమణిగేలా చేస్తూ ద్రవ్య వినిమయ బిల్లును ఆమోదించే వరకు సభను కొనసాగించకుండా ఎందుకు వాయిదా వేశారో అర్థం కాకుండా ఉంది. ద్రవ్యవినిమయ బిల్లు పూర్తిగా అసెంబ్లీ అధికార పరిధికి లోబడి ఉంటుంది. మూడు రాజధానులకు సంబంధించి మొదట పంపించిన బిల్లుపై శాసనమండలి గడువులోగా ఏ నిర్ణయమూ తీసుకోలేదు కనుక రెండోసారి అదే బిల్లును మళ్లీ శాసనసభ ఆమోదించి మండలికి పంపించింది.
మండలి కేవలం సలహాలు ఇవ్వడం వరకే పరిమితం తప్ప బిల్లులను అడ్డుకొనే అధికారం లేదు. దేశంలో ఎక్కడా లేని విధంగా ఆంధ్రప్రదేశ్ శాసన మండలిలో ప్రత్యేక రాజకీయ పరిస్థితులు నెలకొన్నాయి. పెద్దల సభ ఏ ఉద్దేశంతో ఏర్పడిందో దానికి విరుద్ధంగా అక్కడ కార్యకలాపాలు జరుగుతున్నాయి. ప్రజాస్వామ్యంలో ప్రజలే ప్రభువులు. అలాంటి ప్రజలు ఎనుకున్న శాసనసభకే సర్వాధికారాలు ఉంటాయి తప్ప శాసనమండలికి ఏమీ అధికారం ఉండదు. సలహాలు ఇచ్చి అభిప్రాయం చెప్పడం వరకే పరిమితం కాకుండా అంతకు మించి అక్కడ వ్యవహారాలు కొనసాగుతుండడం విపరీతంగా కనిపిస్తోంది. నిబంధనలకు విరుద్ధంగా అక్కడి కార్యకలాపాలు సాగుతున్నాయి.
ఈ పరిస్థితుల్లో మూడు రాజధానుల బిల్లును రెండుసార్లు అసెంబ్లీలో ఆమోదించి పంపించారు. రెండోసారి పంపించిన తరువాత శాసనమండలిలో ప్రవేశపెట్టినా, ప్రవేశపెట్టకున్నా, చర్చించినా చర్చించకున్నా, ఆమోదించినా ఆమోదించకున్నా శాసనసభ దాన్ని పట్టించుకోవలసిన అవసరం లేదు. శాసనసభకు పూర్తి అధికారాలున్నందున రెండోసారి బిల్లు పంపినందున అది ఆమోదమైనట్లే భావించి నిర్ణయం తీసుకోవచ్చు. శాసనమండలి ఆమోదంతో శాసనసభకు కానీ, ప్రభుత్వానికి కానీ అవసరం లేదు. శాసనసభ ఆమోదించినందున ప్రభుత్వం దాని ఆధారంగా తదుపరి కార్యాచరణ ప్రారంభించవచ్చు. శాసనమండలికి నచ్చినా నచ్చకున్నా ప్రజలు నేరుగా ఎన్నుకున్న శాసనసభదే తుది నిర్ణయం అవుతుంది’
– కేఆర్ సురేష్‌రెడ్డి, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ శాసనసభ మాజీ స్పీకర్
Comments
Please login to add a commentAdd a comment