
సాక్షి, భీమవరం: ప్రాముఖ్యత కలిగిన పాలన,వికేంద్రీకరణ బిల్లును శాసనమండలి తిప్పి పంపడం దారుణమని భీమవరం ఎమ్మెల్యే గ్రంథి శ్రీనివాస్ మండిపడ్డారు. ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. మండలి చైర్మన్ షరీఫ్ మంచి వ్యక్తి అని, అలాంటి వ్యక్తి చేత తప్పుడు పని చేయించిన చంద్రబాబుని ప్రజలు క్షమించరన్నారు. ఇటువంటి పరిస్థితుల్లో శాసనమండలి అవసరం లేదని శ్రీనివాస్ స్పష్టం చేశారు. టీడీపీ నేతల ఇన్‌సైడర్ ట్రేడింగ్ బాగోతాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. టీడీపీ మాజీ మంత్రులు పత్తిపాటి పుల్లారావు, నారాయణలపై సీఐడీ కేసులు నమోదు చేసిందని, మరికొందరు టీడీపీ పెద్దల బండారం కూడా బయటపడుతుందన్నారు. వైఎస్ జగన్ ప్రభుత్వం ప్రజల సంక్షేమం, అభివృద్ధి, సమైక్యత కోసం పనిచేస్తోందని పేర్కొన్నారు.
బీజేపీతో కలిసిన తర్వాత పవన్‌కల్యాణ్ మంచి జోష్ మీద ఉన్నారని.. కేంద్ర ప్రభుత్వంలో ప్రధానమంత్రి హోదాలో ఉన్నట్లు.. మోదీ, అమిత్ షా స్థానంలో ఉన్నట్టు ఊహించుకుంటున్నారని ఎమ్మెల్యే శ్రీనివాస్ ఎద్దేవా చేశారు. వైఎస్సార్‌సీపీ ప్రభుత్వాన్ని కూకటివేళ్లతో పడగొడతానని పవన్ చేసిన వ్యాఖ్యలను ఆయన తప్పుబట్టారు. పుస్తకాలు చదువుతున్నానంటారు.. చట్టాలు కూడా చదవాలని పవన్‌కు ఎమ్మెల్యే శ్రీనివాస్ హితవు పలికారు.