దీక్షల్లో పాల్గొన్న బహుజన పరిరక్షణ సమితి సంఘాల నాయకులు
తాడికొండ: మూడు రాజధానులను వ్యతిరేకిస్తూ కుల రాజధాని మాత్రమే కావాలంటూ దొంగ దీక్షలు చేయించిన చంద్రబాబు.. ఏ మొహం పెట్టుకుని విశాఖ వెళ్లారని బహుజన పరిరక్షణ సమితి నాయకులు ప్రశ్నించారు. ఉక్కు ఉద్యమాన్ని సైతం అడ్డుపెట్టుకుని మరోసారి రాష్ట్ర ప్రజలను మోసం చేసేందుకు సిద్ధమయ్యాడని మండిపడ్డారు. గుంటూరు జిల్లా తుళ్లూరు మండలం తాళ్లాయపాలెం సీడ్ యాక్సిస్ రోడ్డు జంక్షన్‌లో మూడు రాజధానులకు మద్దతుగా బహుజన పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో 140వ రోజు కొనసాగుతున్న రిలే నిరాహార దీక్షల్లో పలువురు నేతలు ప్రసంగించారు. విశాఖలో పాలనా రాజధాని ఉండాలని రాష్ట్ర వ్యాప్తంగా బహుజనులు దీక్షలు చేస్తున్నారని తెలిపారు. ‘విశాఖ ఉక్కు–ఆంధ్రుల హక్కు’ అని గతంలోనే తాడికొండ తొలి దళిత ఎమ్మెల్యే టి.అమృతరావు నిరాహార దీక్ష చేసి సాధించిన విషయాన్ని గుర్తుంచుకోవాలన్నారు.
విశాఖపట్నం అంధ్రుల పాలనా రాజధాని అని ఒప్పుకుని మూడు రాజధానులకు మద్దతిస్తేనే చంద్రబాబును అక్కడకు రానివ్వాలని, లేకుంటే ఆయనను తరిమికొట్టాలని విశాఖ ప్రజలకు పిలుపునిచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో 85 శాతం ఓట్లతో హవా చాటిన వైఎస్సార్ సీపీ జోరు తిరిగి మున్సిపల్ ఎన్నికల్లోనూ కొనసాగుతుందని తెలిపారు. పార్టీ గుర్తులతో జరుగుతున్న మున్సిపల్ ఎన్నికల్లో ఓటమిని రిఫరెండంగా తీసుకుని చంద్రబాబు రాజకీయాల నుంచి తప్పుకోవాలని డిమాండ్ చేశారు. బేతపూడి సాంబయ్య, పరిశపోగు శ్రీనివాసరావు, నత్తా యోనారాజు, మాదిగాని గురునాధం, జూపూడి బాలస్వామి, ఈపూరి ఆదాం తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment