వైఎస్సార్‌సీపీ ఫ్లెక్సీపై రాళ్లు విసురుతున్న టీడీపీ కార్యకర్త
సాక్షి, భీమవరం / భీమవరం (ప్రకాశంచౌక్): నిన్న రాయలసీమ.. నేడు పచ్చని సీమ! అక్కడ చల్లా బాబు.. ఇక్కడ చింతమనేని..!!
యువగళం పాదయాత్రలో టీడీపీ రౌడీమూకలు మరోసారి రెచ్చిపోయాయి. పుంగనూరులో చంద్రబాబు కనుసన్నల్లో దౌర్జన్యాలకు తెగబడగా... భీమవరంలో లోకేశ్ ప్రోద్బలంతో పేట్రేగి పోయాయి. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం ప్రకాశం చౌక్‌లో మంగళవారం రాత్రి బహిరంగ సభ అనంతరం గునుపూడి శివారులో టీడీపీ శ్రేణులు రాళ్లు, కర్రలతో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలపై దాడులకు బరి తెగించాయి.
వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు వారి నుంచి తప్పించుకొని స్థానికంగా ఉన్న ఇళ్లలో తలదాచుకున్నా వదలకుండా వెంటాడారు. మహిళలను భయభ్రాంతులకు గురి చేస్తూ దారుణంగా కొట్టారు. టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ నేరుగా ఈ వ్యవహారాన్ని పర్యవేక్షిస్తూ వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లపైకి వెళ్లి దాడులకు పురిగొల్పారు. ఆ ప్రాంతంలో అధిక సంఖ్యలో దళితులు నివసిస్తుండటం గమనార్హం. యువగళంలో ఒక టీమ్ ఆ ప్రాంతాన్ని డ్రోన్‌తో చిత్రీకరిస్తూ దూరంగా ఉన్న వైఎస్సార్‌సీపీ కార్యకర్తల గురించి టీడీపీ శ్రేణులకు సమాచారాన్ని చేరవేసింది. దీంతో రౌడీమూకలు అక్కడకు చేరుకుని దాడులకు తెగించాయి.
రెచ్చగొట్టి.. రచ్చ చేసి
లోకేశ్ పాదయాత్రలో భాగంగా నిర్వహించిన బహిరంగ సభ వద్ద టీడీపీ కార్యకర్తలు వ్యూహాత్మకంగా రెచ్చగొట్టే చర్యలకు పాల్పడ్డారు. గతంలో వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన భారీ ఫ్లెక్సీపై వాటర్ బాటిళ్లు, రాళ్లు రువ్వడంతో పాటు ఫ్లెక్సీని తొలగించడానికి ప్రయత్నించారు. వివేకానందరెడ్డిని చంపింది ఎవరంటూ ఫ్లెక్సీలను ప్రదర్శించి రెచ్చగొట్టే ప్రయత్నం చేశారు. పాలకొల్లు ఎమ్మెల్యే నిమ్మల రామానాయుడు నేతృత్వంలో పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలను పట్టుకుని నినాదాలు చేస్తూ ఉద్రిక్తత సృష్టించారు.
వన్‌టౌన్ సీఐ అడబాల శ్రీను, ఎస్సై ఎం.వెంకటేశ్వరరావు తమ సిబ్బందితో వారిని వారించగా తోసుకుంటూ వెళ్లే ప్రయత్నం చేశారు. పోలీసులు సహనంతో వారిని అదుపు చేసే ప్రయత్నం చేశారు. కాగా, బహిరంగ సభ కోసం టీడీపీ నాయకులు మహిళలకు రూ.300, పురుషులకు రూ.500 చొప్పున ఇచ్చి జనాన్ని తరలించారు. భీమవరంతో పాటు పాలకోడేరు, కుముదవల్లి, శృంగవృక్షం, వీరవాసరం తదితర ప్రాంతాల నుంచి ఆటోలు ఏర్పాటు చేసి వృద్ధులను సైతం డబ్బు ఆశ చూపి లోకేశ్ సభకు తీసుకొచ్చారు. లోకేశ్ ప్రసంగం ప్రారంభించగానే వారంతా వెనుదిరిగారు.
ముగ్గురు పోలీసుల తలలకు తీవ్ర గాయాలు
తమను అడ్డుకునేందుకు ప్రయత్నించిన పోలీసులను టీడీపీ రౌడీ మూకలు తీవ్రంగా గాయపరిచాయి. రాళ్లు, కర్రలతో పోలీసులపై దాడికి దిగడంతో వన్‌టౌన్ హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్, టూటౌన్ కానిస్టేబుల్ రమేష్‌తో పాటు మరో కానిస్టేబుల్ తలకు బలమైన గాయాలయ్యాయి. ఇతర పోలీస్ సిబ్బంది కూడా గాయపడ్డారు. వీరికి భీమవరం ప్రభుత్వాసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. పాదయాత్రలో తనతో పాటు రౌడీ గ్యాంగ్‌ను వెంటేసుకుని తిరుగుతున్న లోకేశ్ తీరును ప్రశాంతతకు నిలయమైన భీమవరం ప్రజలు తీవ్రంగా తప్పుబడుతున్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగించేలా లోకేశ్ నిర్వహిస్తున్న పాదయాత్ర ఎవరి కోసమని మండిపడుతున్నారు.
కానిస్టేబుళ్లు, కార్యకర్తలకు ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పరామర్శ
టీడీపీ రౌడీ గ్యాంగ్ దాడిలో తీవ్రంగా గాయపడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న కానిస్టేబుళ్లు, కార్యకర్తలను ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ పరామర్శించారు. లోకేశ్ పాదయాత్రకు బందోబస్తుగా ఉన్న పోలీసులపై సైతం దాడి చేసి తీవ్రంగా గాయపరచటాన్ని తీవ్రంగా ఖండించారు. వైఎస్సార్‌సీపీ కార్యకర్తల ఇళ్లకు వెళ్లి టీడీపీ మూకలు అరాచకం సృష్టించాయన్నారు. కవ్వింపు చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు.
Comments
Please login to add a commentAdd a comment