
ప్రజల ఆశలను వమ్ము చేయకండి: ఎర్రబెల్లి
రైతులకు భరోసా ఇచ్చే చర్యలు చేపట్టండి: ఎర్రబెల్లి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ఏర్పడిన తొలి ప్రభుత్వంపై ప్రజలంతా గంపెడాశలతో ఉన్నారని, వాటిని వమ్ము చేయవద్దని టీడీపీపక్షనేత ఎర్రబెల్లి దయాకర్‌రావు సూచించారు. ఎన్నికల హామీలన్నింటినీ నెరవేర్చాల న్నారు. ముఖ్యంగా గిరిజనులు, దళితులకు ఉద్దేశించిన పథకాల అమలులో చిత్తశుధ్ధితో పనిచేయాలని సూచించారు. శుక్రవారం ద్రవ్య వినిమయ బిల్లుపై చర్చలో మాట్లాడుతూ రైతులు ఆత్మహత్యలకు పాల్పడకుండా వారికి భరోసా ఇచ్చే కార్యక్రమాలు ఇవ్వాలని విన్నవించారు. కరెంట్ విషయంలో పక్క రాష్ట్రాలను విమర్శించడం మాని, చర్చలకు వస్తే సమస్యకు పరిష్కారం దొరుకుతుందన్నారు.
‘ఇళ్ల నిర్మాణానికి రూ.వెయ్యి కోట్లు ఇచ్చారు. వీటితో నియోజకవర్గానికి 36 నుంచి 40 ఇళ్లకు ఎక్కువ నిర్మించలేం. ఇందులో పాత ఇళ్లకు సంబంధించిన బకాయిలే రూ.1,500 కోట్లు ఉన్నాయి. అప్పుడు రూ.1000 కోట్ల బడ్జెట్‌తో ఇళ్ల నిర్మాణం ఎలా సాధ్యం’ అని ప్రశ్నిం చారు. గత ప్రభుత్వ హయాంలో ఇందిరమ్మ పథకంలో రాజకీయ నేతలు కోట్లు గడించారని, వారంతా ఇప్పుడు మీ పక్కనే ఉన్నారని కేసీఆర్‌ను ఉద్దేశిస్తూ అన్నారు. ఉద్యోగాల విషయంలో ఆందోళన చేస్తున్న ఉస్మానియా విద్యార్థులను పిలిచి మాట్లాడాలని సూచించారు. పారిశ్రామిక విధానంపై సీఎంలో మార్పు వచ్చినట్లు కనబడుతోందని కొందరు తనకు ఫోన్ చేశారని, ఇదే వైఖరిని ఇక ముందూ కొనసాగించాలని, రెచ్చగొట్టే, తిట్టే ధోరణిని మార్చుకోవాలని సూచించారు. అమర వీరుల కుటుంబాలు మొత్తంగా 1,600 ల వరకు ఉంటే వారికి ప్రస్తుత బడ్జెట్‌లో ఇచ్చిన రూ.100 కోట్ల బడ్జెట్ సరిపోదని అన్నారు. వీటిని పెంచాలన్నారు.
మేము పాండవులం.. మీరు కౌరవులు
చివరలో ఎర్ర బెల్లి అధికార పక్ష సభ్యులను ఉద్దేశించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ‘కాంగ్రెస్ స్వయంగా తెలంగాణ ఇచ్చినా వారు 10 ఏళ్లలో చేసిన పాపాల కారణంగా వారిని పక్కన పెట్టారు. మేమంతా పాండవులం. టీడీపీకి ప్రస్తుతం వనవాసం నడుస్తోంది. 15 ఏళ్ల వనవాసం చేయాలని మాకు శని ఉంది. అందుకే తప్పు చేయకున్నా వనవాసం చేస్తున్నాం. మరో నాలుగేళ్లలో వనవాసం ముగిస్తే మేమే అధికారంలోకి వస్తాం. టీఆర్‌ఎస్ సభ్యులంతా కౌరవులు. వారు మా అర్జునుడైన రేవంత్‌రెడ్డిని చూస్తేనే దడదడలాడిపోతున్నారు. భయపడుతున్నారు. ఇప్పటికైనా కౌరవులు దౌర్జన్యాలు, కుట్రలు మానాలి’ అన్నారు. ప్రతిసారీ కేంద్రాన్ని, టీడీపీని, పక్క రాష్ట్రా నేతలను తిట్టడం మాని వారితో సఖ్యతతో మెలగండని సూచించారు.