సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పూర్తిగా మందగించిన డబుల్ రోడ్ల నిర్మాణాన్ని మళ్లీ పట్టా లెక్కించేందుకు ప్రభుత్వం రూ.2,007 కోట్లు కేటాయించింది. గతేడాదితో పోలిస్తే రూ.7 కోట్లు తక్కువ. గత బడ్జెట్ కేటాయింపుల్లో పూర్తిస్థాయిలో నిధులు విడుదల కాకపోవటంతో పనులు బాగా మందగించాయి. ఈసారి ప్రతిపాదించిన నిధులు ఎంతమేర విడుదలవుతాయో వేచిచూడాలి. మండల కేంద్రాల నుంచి జిల్లా కేంద్రాలు, జిల్లా కేంద్రాల నుంచి రాజధానికి డబుల్ రోడ్లను గతంలోనే ప్రభుత్వం పెద్దఎత్తున ప్రారంభించిన విషయం తెలిసిందే.
ఆదిలో చాలావేగంగా పనులు జరిగినప్పటికీ, రెండేళ్లుగా నిధులు పూర్తిస్థాయిలో అందక పడకేశాయి. గత రెండేళ్లుగా భారీ వర్షాలతో రోడ్లకు తీవ్ర నష్టం వాటిల్లిన విషయం తెలిసిందే. కానీ, వరద ప్రభావిత రోడ్ల పునర్నిర్మాణానికి నిధులు లేక పనులు జరగలేదు. తాత్కాలిక మరమ్మతులతో సరిపెట్టారు. ఇటీవలే సీఎం ఆ పనులపై సమీక్షించి రూ.2,500 కోట్లు మంజూరు చేశారు.
వరదతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణతోపాటు దెబ్బతిన్న రోడ్ల రెన్యూవల్ పనులు కూడా చేపట్టాలని ఆదేశించారు. ఇప్పుడు బడ్జెట్‌లో నాన్‌ప్లాన్ కింద ఆ పనులకు రూ.2,434 కోట్లు, భవనాల కోసం రూ.1,515 కోట్లు కేటాయించారు. ఇందులో కొత్త సచివాలయ భవనం పూర్తికి రూ.400 కోట్లు ప్రతిపాదించారు. రీజినల్ రింగురోడ్డు భూసేకరణకు సంబంధించి ఉత్తర భాగంలో రాష్ట్రప్రభుత్వ వాటాగా రూ.2,600 కోట్లు చెల్లించాల్సి ఉంది. దానికిగాను రూ.500 కోట్లు ప్రతిపాదించారు. వామపక్ష తీవ్రవాద ప్రభావిత ప్రాంతాల్లో రోడ్ల నిర్మాణానికి రూ.1,600 కోట్లు కేటాయించారు.
Comments
Please login to add a commentAdd a comment