100 యూనిట్లలోపు విద్యుత్ వాడిన ఓ నిరుపేదకు బిల్లుల్లో వచ్చిన తేడా ఇలా..
చార్జీలు పెరగక ముందు..
నగరంలోని ఎంఎస్ మక్తా మురికివాడలో రెండు గదుల ఇంట్లో ఉండే ఓ నిరుపేద కుటుంబం గత మార్చిలో 83 యూనిట్ల విద్యుత్ వినియోగించింది. ఇంధన చార్జీలు రూ.152.55, కస్టమర్ చార్జీలు రూ.30, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.4.98 కలిపి బిల్లు
రూ.188 వచ్చింది.
చార్జీలు పెరిగిన తర్వాత...
ఏప్రిల్‌లో ఆ కుటుంబం 89 యూనిట్ల విద్యుత్ వినియోగించింది. మార్చి కంటే కేవలం 6 యూనిట్లే ఎక్కువగా వాడినా ఇంధన చార్జీలు రూ.224.15, కస్ట మర్ చార్జీలు రూ.70, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.5.34, టారిఫ్ డిఫరెన్స్ (ఏప్రిల్‌లో పాత చార్జీలు వసూలు చేసిన రోజులకు సంబంధించిన మొత్తం) రూ.23.30 తోపాటు కొత్తగా ప్రవేశపెట్టిన ఫిక్స్‌డ్ చార్జీలు రూ.10.. మొత్తం కలిపి (సెక్యూరిటీ డిపాజిట్‌పై వడ్డీ మినహాయించగా) రూ.307 బిల్లు వచ్చింది. అంటే మార్చితో పోలిస్తే బిల్లు 63.29 శాతం పెరిగింది.
సాక్షి, హైదరాబాద్: పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరల మోత, నిత్యావసరాల ధరల పెరుగుదలతో ఇప్పటికే అల్లాడిపోతున్న పేద, మధ్యతరగతి కుటుంబాలకు.. ప్రస్తుత మే నెలలో విద్యుత్ బిల్లులు భారీ షాక్ ఇచ్చాయి. ఒక్కసారిగా భారీగా పెరిగిన విద్యుత్ బిల్లులను చూసి గగ్గోలు పెడుతున్నారు. ఐదేళ్ల విరామం తర్వాత రాష్ట్రంలో గత ఏప్రిల్ 1 నుంచి విద్యుత్ చార్జీల పెంపు అమల్లోకి రాగా, ఏప్రిల్ నెల వాడకానికి సంబంధించిన బిల్లులను ప్రస్తుత మే నెలలో జారీ చేస్తున్నారు.
దీంతో విద్యుత్ చార్జీల పెంపు ప్రభావం వినియోగదారులకు తెలుస్తోంది. ప్రధానంగా తక్కువ విద్యుత్ వినియోగించే పేద, మధ్య తరగతి ప్రజలపైనే అత్యధిక భారం పడింది. నెలకు 50 యూనిట్లు, 100 యూనిట్లు, 200 యూనిట్లలోపు విద్యుత్ వినియోగించే వినియోగదారులకు విద్యుత్ బిల్లులు చుక్కలు చూపిస్తున్నాయి. 200 యూనిట్లు, ఆపై విద్యుత్ వినియోగించే ఎగువ మధ్యతరగతి, ధనిక వర్గాల విద్యుత్ బిల్లులూ పెరిగినా, పెరుగుదల శాతం 15–10 శాతం లోపు మాత్రమే కనిపిస్తోంది.
కస్టమర్, ఫిక్స్‌డ్ చార్జీలతో తడిసి మోపెడు
2022–23లో 14 శాతం విద్యుత్ చార్జీలు పెంచి వినియోగదారులపై చరిత్రలో ఎన్నడూ లేని విధంగా రూ.5,596 కోట్ల అదనపు భారం వేసేందుకు రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ).. ఉత్తర/దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థ(టీఎస్‌ఎన్పీడీసీఎల్/టీఎస్‌ఎస్పీడీసీఎల్)లకు అనుమతిచ్చిన విషయం తెలిసిందే. ఎల్టీ కేటగిరీలోని గృహ వినియోగంపై యూనిట్‌కు 10–50 పైసలు చొప్పున, ఎల్టీ కేటగిరీలోని గృహేతర వినియోగంతో పాటు హెచ్‌టీ కేటగిరీలోని అన్ని రకాల వినియోగంపై యూనిట్‌కు రూ.1 చొప్పున విద్యుత్ చార్జీలు పెరిగాయి.
గృహ కేటగిరీలో ఒక శ్లాబు నుంచి మరో శ్లాబుకు మారితే తొలి ఉప కేటగిరీకి యూనిట్‌కు 10 పైసలు చొప్పున, మిగిలిన అన్ని ఉప కేటగిరీలకు 50 పైసలు చొప్పున చార్జీలు పెంచారు. విద్యుత్ చార్జీల భారీ పెంపునకు తోడుగా కస్టమర్ చార్జీలూ పెంచడం, గృహాలపై తొలిసారిగా ఫిక్స్‌డ్ చార్జీలు విధించడంతో మే నెల విద్యుత్ బిల్లులు తడిసి మోపెడయ్యాయి.
ఊరట కలిగిస్తున్న ఈఆర్సీ నిర్ణయం: గతంలో టెలిస్కోపిక్ విధానంలో విద్యుత్ చార్జీలు ఉండేవి. ఒక శ్లాబు నుంచి ఇంకో శ్లాబుకి మారినా ప్రభావం ఉండేది కాదు. అయితే గత ఏడేళ్ల నుంచి నాన్ టెలిస్కోపిక్ విధానం అమలు చేస్తున్నారు. దీంతో ఒక్క యూనిట్ పెరిగి శ్లాబు మారినా బిల్లు వందల్లో పెరిగిపోతుంది. ఈ పరిస్థితుల నేపథ్యంలో చార్జీల పెంపు సందర్భంగా ఈఆర్సీ తీసుకున్న నిర్ణయం వినియోగదారులకు కొంత ఉపశమనం కలిగిస్తోంది.
గృహ కేటగిరీలోని అన్ని శ్లాబుల్లోని ఉప కేటగిరీలకు 50 పైసలు చొప్పున చార్జీలు పెంచాలని డిస్కంలు చేసిన ప్రతిపాదనలను పక్కన పెట్టి..ఒక శ్లాబు నుంచి మరో శ్లాబుకి మారితే తొలి ఉప కేటగిరీకి యూనిట్‌కు 10 పైసలు చొప్పున మాత్రమే పెంచాలని ఈఆర్సీ నిర్ణయించి వినియోగదారులకు కొంత మేలు చేసింది. ఉదాహరణకు 106 యూనిట్లు వాడితే తొలి 100 యూనిట్లకు 10 పైసలు చొప్పున చార్జీల పెంపు వర్తింపజేస్తున్నారు. మిగిలిన 6 యూనిట్లకు మాత్రం యూనిట్‌కు 50 పైసలు చొప్పున చార్జీలు పెంచి బిల్లులు వేస్తున్నారు. ఇలా శ్లాబు మారినా వినియోగదారులకు భారం కొంత తప్పింది.
200 యూనిట్లలోపు వాడకం
విద్యుత్ చార్జీలు పెరగక ముందు.. దిల్‌సుఖ్‌నగర్‌లోని ఓ దిగువ మధ్య తరగతి కుటుంబం గత మార్చిలో 123 యూనిట్ల విద్యుత్ వాడగా, ఇంధన చార్జీలు రూ.418.90, కస్టమర్ చార్జీలు రూ.50, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.7.38 కలిపి మొత్తం రూ.476 విద్యుత్ బిల్లు వచ్చింది.
చార్జీలు పెరిగిన తర్వాత...
ఏప్రిల్‌లో 127 యూనిట్ల విద్యుత్ వాడగా, ఎనర్జీ చార్జీలు రూ.469.60, ఫిక్స్‌డ్ చార్జీలు రూ.22.60, కస్టమర్ చార్జీలు రూ.90, ఎలక్ట్రిసిటీ డ్యూటీ రూ.7.62, అదనపు చార్జీలు రూ.25, టారిఫ్ డిఫరెన్స్ రూ.10.33 కలిపి మొత్తం (సెక్యూరిటీ డిపాజిట్‌పై వడ్డీ మినహాయించగా) రూ.622కు బిల్లు ఎగబాకింది. అంటే వాడకం దాదాపుగా అంతే ఉన్నా విద్యుత్ బిల్లు మాత్రం 30.67 శాతం పెరగడం గమనార్హం.
దెబ్బ మీద దెబ్బ
వేసవిలో పెరిగిన విద్యుత్ వినియోగానికి విద్యుత్ చార్జీల పెంపు తోడు కావడంతో దెబ్బపై దెబ్బ పడినట్టు అయ్యింది. మార్చితో పోల్చితే ఏప్రిల్‌లో ఎండల తీవ్రత పెరగడంతో గృహాల్లో విద్యుత్ వాడకం బాగా పెరిగిపోయింది. మధురానగర్‌కు చెందిన ఎస్.ప్రభాకర్ మార్చి నెలలో 96 యూనిట్లు వాడగా, ఏప్రిల్ తొలివారంలో రూ.226 బిల్లు వచ్చింది. ఏప్రిల్‌లో ఆయన 128 యూనిట్లు వినియోగించగా, మే తొలివారంలో రూ.604 బిల్లు వచ్చింది. కేవలం 32 యూనిట్లు అధికంగా వాడగా బిల్లు రెండింతలకు మించిపోవడం గమనార్హం.
భారంగా కుటుంబ పోషణ
వికారాబాద్ జిల్లా కుల్కచెర్ల మండలం బొంరెడ్డిపల్లి గ్రామానికి చెందిన బాలయ్య స్థానికంగా ఓ దుకాణంలో టైలర్‌గా పనిచేస్తున్నాడు. నెలకు రూ.10 వేలు సంపాదిస్తూ అతికష్టం మీద కుటుంబాన్ని నెట్టుకొస్తున్నారు. ప్రతి నెల 50–100 యూనిట్ల లోపు విద్యుత్ మాత్రమే వాడే ఆయనకు గతంలో రూ.100–130 లోపు విద్యుత్ బిల్లు వచ్చేది. మే నెలలో మాత్రం దాదాపుగా రెండింతలై రూ.265కు పెరిగిపోయింది. అసలే నిత్యావసరాల ధరలు పెరిగి ఇబ్బంది పడుతుంటే, తాజాగా విద్యుత్ బిల్లులు పెరిగిపోవడంతో కుటుంబ పోషణ భారంగా మారిందని బాలయ్య ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు.
Comments
Please login to add a commentAdd a comment