ప్రాజెక్టుల వ్యయంపై మాట్లాడితే బ్రేకులే..
♦ పతిపక్షనేత ప్రసంగానికి పదేపదే బ్రేకులు
♦ పది నిమిషాలు కూడా అవకాశమివ్వని సభాపతి
సాక్షి, హైదరాబాద్: సాగునీటి ప్రాజెక్టులు, వాటికి పెట్టిన వ్యయాలు, ఆయకట్టు వివరాలు.. వీటిపై అసెంబ్లీలో ప్రతిపక్ష నేత జగన్మోహన్రెడ్డి మాట్లాడితే చాలు మైక్ కట్ అయిపోతుంది. మంగళవారం అసెంబ్లీలో ఇదే సీన్ చోటు చేసుకుంది. అంతర్జాతీయ జలదినోత్సవాన్ని పురస్కరించుకుని సీఎం చంద్రబాబు సుమారు గంటసేపు సుదీర్ఘంగా ప్రసంగించారు. పోలవరం, పట్టిసీమ, గాలేరు-నగరి తదితర ప్రాజెక్టులపై మాట్లాడారు. అనంతరం ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి మాట్లాడే అవకాశమివ్వడంతో ఆయన తొమ్మిదేళ్ల చంద్రబాబు పాలనలో ప్రాజెక్టులపై చేసిన వ్యయం, వైఎస్ హయాంలో ప్రాజెక్టులకు చేసిన వ్యయం, ఆయన మరణానంతరం ఎంత వ్యయం చేశారన్నది అధికారిక లెక్కలతోసహా చదివి వినిపించారు.
దీంతో అధికారపక్షం ఉలిక్కిపడింది. పదేపదే ఆయన ప్రసంగానికి అడ్డుతగిలింది. ఈ నేపథ్యంలో పదేపదే ఆయన మైక్ కట్ అయింది. 25 నిమిషాల ప్రసంగంలో దాదాపు 12 నిమిషాలు అంతరాయానికే సరిపోయింది. జగన్ ప్రసంగం చేపట్టిన మూడు నిమిషాలకే స్పీకర్ మైక్ కట్ చేసి జలవనరులమంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుకు అవకాశమిచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు పదేపదే మైక్ కట్ చేయడమేంటని ప్రశ్నించారు.ఆ వెంటనే చీఫ్‌విప్ కాల్వ శ్రీనివాసులుకు అవకాశమిచ్చారు. అనంతరం జగన్‌కు అవకాశమివ్వగా... రెండు నిమిషాలు మాట్లాడారో లేదో మైక్ కట్ చేసి మళ్లీ దేవినేనికి మైకిచ్చారు. మళ్లీ జగన్‌కు అవకాశమిచ్చినట్టే ఇచ్చి.. వెనువెంటనే మైక్ కట్‌చేసి బీజేపీ శాసనసభాపక్ష నేత విష్ణుకుమార్‌రాజుకు మాట్లాడే చాన్సిచ్చారు.
ఆ తర్వాత స్పీకర్ కోడెల కలుగజేసుకుంటూ.. ప్రస్తుతం ప్రాజెక్టుల మీద చర్చ జరగట్లేదని, సబ్జెక్టుపరంగా వెళ్లాలని.. డీవియేట్ కాకూడదని.. ఇలా వెళితే ప్రజలకు రాంగ్ మెసేజ్ వెళుతుందని జగన్‌కు సలహా ఇచ్చారు. ఆ తర్వాత టీడీపీ ఎమ్మెల్యే గొల్లపల్లి సూర్యారావుకు స్పీకర్ అవకాశమిచ్చారు. ఆయన ప్రసంగానంతరం జగన్‌కు అవకాశమిచ్చిన నిమిషంలోపలే స్పీకర్ కలగజేసుకుంటూ... సభలో సీఎం స్టేట్మెంట్ ఏదైనా ఇచ్చినప్పుడు చర్చ ఉండదని, మీరు ప్రాజెక్టులపై చర్చకు వెళ్లాలనుకుంటే వేరేమార్గంలో వెళ్లవచ్చునని, ఇప్పుడు అంతర్జాతీయ జలదినోత్సవం అంశం వరకే మాట్లాడాలన్నారు. వెంటనే జగన్‌కు మైక్ ఇచ్చిన స్పీకర్.. మళ్లీ కట్ చేసి జలదినోత్సవంపై ప్రతిజ్ఞకు వెళ్లారు.
జలదినోత్సవంపై సభలో ప్రతిజ్ఞ
అంతర్జాతీయ జలదినోత్సవం సందర్భంగా స్పీకర్ కోడెల శివప్రసాదరావు మంగళవారం అసెంబ్లీలో సభ్యులతో ప్రతిజ్ఞ చేయించారు.
శనగ రైతులకు ఇంత అన్యాయమా?
వైఎస్సార్ జిల్లాలో 2012లో శనగ పంట సాగు చేసి నష్టపోయిన రైతులకు ఇప్పటికీ పంటల బీమా సొమ్ము ఇవ్వ కపోవడం దారుణమని ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. 55 వేలమంది రైతులు పంటల బీమా కోసం కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశా రు. మంగళవారం అసెంబ్లీ జీరో అవర్‌లో ఆయనీ అంశాన్ని ప్రస్తావించారు. వివరాలు ఆయన మాటల్లోనే... ‘‘2012లో రైతులు శనగ పంట వేసి నష్టపోయారు. 2013 పోయింది.. 2014 పోయిం ది.. 2015వ సంవత్సరం కూడా పోయింది. పంట నష్టపోయిన మూడున్నరేళ్ల తర్వాత కూడా రైతులకు బీమా సొమ్ము ఇవ్వకపోవడం, దీనిగురించి ఇప్పుడు మాట్లాడాల్సి రావడం బాధాకరం. అగ్రికల్చరల్ ఇన్సూరెన్స్ కార్పొరేషన్(ఏఐసీ) వారితో గట్టిగా మాట్లాడాక 25 వేల మంది రైతులకు రూ.132 కోట్లు విడుదల చేశారు. ఇంకా రూ.37 కోట్లు రైతుల ఖాతాల్లో జమకాలేదు. మిగిలిన రైతుల పరిస్థితి దయనీయం.
నాటి తప్పులు ఇప్పుడు చూపిస్తారా?
పంటల బీమాకోసం రైతులు ప్రీమియం చెల్లించే సమయంలోనే తప్పులుంటే సరిది ద్దాలి. ఏమైనా పొరపాట్లు ఉంటే నిర్దిష్ట కాలంలో(ఒక నెలలోనో, రెండు నెలల్లోనో) సవరించాలి. 2012 రబీలో రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించారు. ఇప్పుడు ఏఐసీ తప్పు లు చూపిస్తోంది. ఇది ఎంతవరకు ధర్మం. వైఎస్సార్ జిల్లాలోని పులివెందుల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు నియోజకవర్గాల్లో పంటల బీమా అందని రైతుల దుస్థితి ఇది. ఇప్పటికైనా ప్రభుత్వం చర్యలు తీసుకుని బాధిత అన్నదాతలకు త్వ రగా పంటల బీమా సొమ్ము అందేలా చూడాలని మనవి చేస్తున్నా’’ అని ఆయన కోరారు.