బతికి రా... కన్నా
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : ఒకటి కాదు రెండు వరుసగా ఆరు సంఘటనలు చోటు చేసుకున్నా ఎవరిలోనూ కించిత్తయినా అప్రమత్తత లేదు. ఏడో సంఘటనలో తిమ్మన్న హట్టి అనే ఆరేళ్ల బాలుడు బాధితుడు. అయితే ఈసారి అతను సాక్షాత్తు తండ్రి వేయించిన, విఫలమైన బోరును బంధువులకు చూపించడానికి పోయి అందులో పడిపోయాడు. అతను ప్రాణాలతో తిరిగి వస్తాడా... తిరుమల తిమ్మప్ప ఈ తిమ్మన్నను కాపాడుతాడా...అనేది ప్రస్తుతం సర్వత్రా చర్చనీయాంశం.
ఆ బాలుని ప్రాణాలతో బయట పడేయ్ స్వామీ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని మతాల వారు తమ దేవుళ్లకు మొక్కుకుంటున్నారు. ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తున్నారు. దేవుళ్లు వీరి మొరను ఆలకిస్తారా....లేదా అనేది మరి కొన్ని గంటలు గడిస్తే కానీ తేలకపోవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 3,400 బోర్లు ఇంకా నోర్లు తెరుచుకునే ఉన్నాయని పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ గణాంకాలే చెబుతున్నాయి.
తిమ్మన్న 160 అడుగుల లోతులో పడిపోగా...ఆ బోరుకు సమాంతరంగా ఇప్పటి వరకు ఎనభై అడుగుల లోతు వరకు మాత్రమే జేసీబీల సాయంతో గుంతను తవ్వగలిగారు. మరో వైపు బాలునిపై పూర్తిగా మట్టి కప్పుకు పోయిందని బోరులోకి పంపిన కెమెరా ద్వారా లభించిన దృశ్యాలు చెబుతున్నాయి.