‘ఉపాధి’.. ఇక పకడ్బందీ..
* పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ పర్యవేక్షణకు ఉత్తర్వులు జారీ
* పారదర్శకంగా పనులు, నిధుల ఖర్చు
మంచిర్యాల రూరల్ : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. పనుల పర్యవేక్షణ, వేతనాల చెల్లింపు ప్రక్రియ, పనుల కేటాయింపు బాధ్యతలను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ, ఎంపీడీవోలకు అప్పగిస్తూ ప్రభుత్వం గత శుక్రవారం జీవో 15 జారీ చేసింది. ఇన్నాళ్లు కాంట్రాక్టు ఉద్యోగులే ఉపాధి పనుల ఎంపిక, వాటి నిర్వహణ బాధ్యతలు చూడడం, కొలతలను బట్టి కూలీలకు వేతనాలు అందించడం వంటి పనులు చేస్తున్నారు.
ఇందుకోసం ప్రతీ మండలానికి ఒక ఏపీవో, టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లు పని చేస్తున్నారు. ప్రతీ ఏడాది సామాజిక తనిఖీ బృందం చేసిన పనులు, చెల్లించిన వేతనాలపై తనిఖీ చేపట్టగా.. రూ.లక్షల్లో నిధులు దుర్వినియోగం అయ్యాయి. దీంతో చేసిన పనులతో అంతగా ప్రయోజనం లేకుండా పోయినట్లు గుర్తించారు. పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖలకు పర్యవేక్షణ బాధ్యతలను అప్పగించడంతో ‘ఉపాధి’ కాంట్రాక్టు సిబ్బంది ఇక నుంచి ఎంపీడీవోల ఆదేశాల మేరకు పని చేయాల్సి ఉంటుంది.
దుర్వినియోగం తగ్గేనా..?
జిల్లాలో 31,618 శ్రమశక్తి సంఘాల్లో 5,80,577 మంది కూలీలు ఉన్నారు. వీరిలో ఏడాదికి కనీసం 4 లక్షల మంది ఉపాధి పని సద్వినియోగం చేసుకుంటున్నారు. చాలా గ్రామాల్లో ఉపాధి హామీ పథకం పనులు చేసేందుకు కూలీలు ఆసక్తి చూపిస్తున్నారు. దీంతో వ్యవసాయ పనులు కాలంలో పనులు తక్కువగా ఉండడంతో ఇతర పనులకు వెళ్తున్నారు. సీజన్ ముగిసిన తర్వాత ఉపాధి పనులు చేస్తేనే పూట గడుస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని కొందరు సిబ్బంది పనుల కేటాయింపులో అవకతవకలకు పాల్పడుతున్నారనే ఆరోపణలున్నాయి.
గ్రామాల్లో చేసిన పనులు మళ్లీ చేయడం, చేయకున్నా కూలీల మస్టర్లు వేసి వేతనాలు కాజేసినట్లు సామాజిక తనిఖీల్లో వెల్లడైంది. ఎనిమిదేళ్లుగా చేపట్టిన సామాజిక తనిఖీల్లో రూ.12.17 కోట్లు దుర్వినియోగమైనట్లు గుర్తించారు. వీటిలో ఇంకా సుమారు రూ.9కోట్లకు పైగా రికవరీ చేయాల్సి ఉంది. అక్రమార్కులపై చర్యలు తీసుకునేలోపు వారు ఉద్యోగాలు వదిలి వెళ్తున్నారు. వారి నుంచి నిధులు రికవరీ చేయడం, చర్యలు తీసుకోవడం ప్రభుత్వానికి ఇబ్బందిగా మారింది. దీని దృష్ట్యా పనుల్లో పారదర్శకత, నిధుల ఖర్చులో జవాబుదారీతనం ఉండేలా చర్యలు చేపట్టింది. ఇప్పటికే తీరిక లేకుండా ఉంటున్న మండల పరిషత్ సిబ్బంది.. ఉపాధి పనుల పర్యవేక్షణ, ఎంతమేరకు నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తారో వేచి చూడాల్సిందే.
బాధ్యతల అప్పగింత..
పనుల పర్యవేక్షణను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆయా మండలాల ఎంపీడీవోలకు అప్పగించారు. ఎంపీడీవోలు జాబ్‌కార్డుల జారీ నుంచి పనుల ఎంపిక, కూలీల బడ్జెట్ తయారీ, గ్రామపంచాయతీల్లో పనుల ప్రణాళిక తయారీ, చేసిన పనులకు సరైన వేతనాలు అందించే ప్రక్రియ పర్యవేక్షించాల్సి ఉంది. పనుల నివేదికలను ఎప్పటికప్పుడు డ్వామా పీడీ, అడిషనల్ పీడీలకు అందించి, పథకం అమలు విషయంలో జవాబుదారీగా ఉండాలి. ప్రతీ పనిని పంచాయతీ కార్యదర్శి, సర్పంచుల ఆమోదం, గ్రామసభలో ప్రజలు సూచించిన పనుల ప్రణాళిక తయారీ, ఫీల్డ్ అసిస్టెంట్లను పర్యవేక్షించడం, గ్రామాల్లో జరిగే పనుల తనిఖీ, కూలీలకు వేతనాలు అందేలా చూడడం వంటి పనులు చేపట్టనున్నారు.
ఈవోపీఆర్డీలు మండల ప్రణాళిక తయారీ, మస్టర్లు, పనుల తనిఖీ చేపడుతారు. పంచాయతీ రాజ్ ఏఈలు పనుల వివరాలను ఎప్పటికప్పుడు ఎంపీడీవోలకు తెలియజేయాల్సి ఉంటుంది. సూపరింటెండెంట్లు ఉపాధి పనుల ఖాతాల పర్యవేక్షణ, వేతనాల చెల్లింపుల రిజిష్టర్, ఆపరేటర్లు తయారు చేసే వేతనాలు పరిశీలిస్తారు. మండల పరిషత్ కార్యాలయ సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు చెల్లింపుల రికార్టులను స్వాధీనం చేసుకుని ఎప్పటికప్పుడు పరిశీలించనున్నారు. వీరి పర్యవేక్షణలో అక్రమాలకు అడ్డుపడే అవకాశాలు ఉన్నాయని ప్రభుత్వం భావిస్తోంది.