డిజిటల్ లైబ్రరీలన్నీ ఈ ఏడాదే పూర్తి కావాలి: సీఎం జగన్‌ | CM YS Jagan Review On Panchayati Raj And Rural Development | Sakshi
Sakshi News home page

డిజిటల్ లైబ్రరీలన్నీ ఈ ఏడాదే పూర్తి కావాలి: సీఎం జగన్‌

Published Tue, Jul 13 2021 12:15 PM | Last Updated on Tue, Jul 13 2021 4:46 PM

CM YS Jagan Review On Panchayati Raj And Rural Development - Sakshi

సాక్షి, అమరావతి: గ్రామ సచివాలయాలు, విలేజ్‌ క్లినిక్స్, డిజిటల్‌ లైబ్రరీలు అన్నీకూడా ఈ ఏడాదే పూర్తి చేయాలని ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధికారులను ఆదేశించారు. జియో ట్యాగింగ్‌ చేసి నిర్మాణాల తీరుపై సమీక్ష చేయాలని తెలిపారు. పంచాయతీరాజ్‌ గ్రామీణాభివృద్ధి శాఖల్లో పలు కార్యక్రమాలపై మంగళవారం తాడేపల్లిలోని తన క్యాంపు కార్యాలయంలో సీఎం జగన్‌ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వైఎస్సార్‌ జగనన్న కాలనీల్లో మౌలిక సదుపాయాల కల్పనకు సంబంధించి ప్రాధాన్యక్రమంలో పనులు చేపట్టాలన్నారు. పల్లెలను పరిశుభ్రంగా ఉంచే కార్యక్రమానికి పెద్దపీట వేయాలని అధికారులకు సీఎం జగన్‌ సూచించారు.

గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్లు
గ్రామాల్లో 14వేల ట్రైసైకిళ్లు ఏర్పాటుకు సీఎం వైఎస్‌ జగన్‌ అంగీకారం తెలిపారు. అలాగే అర్బన్‌ ప్రాంతాలకు సమీపంలో ఉన్న పల్లెల్లో 1034 ఆటోలు ఏర్పాటు, వాటితోపాటు మరిన్ని వాహనాలను కొనుగోలుకు సీఎం గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారు. రూరల్‌ ప్రాంతాల్లో కూడా ఎక్కడైనా వెట్‌ వేస్టేజ్‌ ఉంటే దాన్ని తరలించేలా ఏర్పాట్లు చేయాలని సీఎం ఆదేశించారు. ఒక ప్రత్యేక నంబర్‌ను గ్రామాల్లో డిస్‌ప్లే చేయాలని, దానికి కాల్‌ చేయగానే సంబంధిత వాహనం ద్వారా వేస్టేజ్‌ సేకరించి ట్రీట్‌మెంట్‌ ప్లాంట్‌కు తరలించాలని అధికారులకు సూచించారు. అపరిశుభ్రత, దోమలవల్ల రోగాలు వస్తున్నాయని అలాంటి పరిస్థితులను నివారించాలన్నారు. బలోపేతమైన పారిశుద్ధ్య కార్యక్రమాల వల్ల ప్రజారోగ్యం మెరుగుపడుతుందని తెలిపారు.

‘వైఎస్సార్‌ జలకళ’ ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు
వైఎస్సార్‌ జలకళ ప్రాజెక్టు చాలా ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్టు అని సీఎం జగన్ అన్నారు. లక్ష మందికి పైగా రైతులకు ఉపయోగపడే ఈ ప్రాజెక్టుపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని సీఎం అధికారులకు సూచించారు. చిన్నచిన్న నదులపై ఉన్న బ్రిడ్జిల వద్ద చెక్‌డ్యామ్ తరహాలో నిర్మాణాలు చేపట్టాలని, కనీసం 3, 4 అడుగుల మేర అక్కడ నీరు నిల్వ ఉండేలా చేయాలని సీఎం అధికారులను ఆదేశించారు. తద్వారా భూగర్భ జలాలు బాగా పెరుగుతాయని సీఎం జగన్‌ తెలిపారు. వైఎస్సార్‌ జలకళ ప్రాజెక్టు సమర్థవంతంగా ముందుకుసాగాలని, దానిపై ఒక కార్యాచరణ తీసుకురావాలని అధికారులను సీఎం ఆదేశించారు.

రాష్ట్రవ్యాప్తంగా అన్ని బ్రిడ్జిల వద్ద ఈ నిర్మాణాలు చేయాలని, వైఎస్సార్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకాన్ని సమర్థవంతంగా అమలు చేయడానికి ముగ్గురు మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలన్నారు. పంచాయతీరాజ్, రెవిన్యూ, మున్సిపల్‌ శాఖ మంత్రులతో కమిటీ ఏర్పాటు చేయాలని సీఎం జగన్‌ ఆదేశించారు. సమగ్రసర్వేను ఉద్ధృతంగా చేయడంపై కమిటీ దృష్టిపెట్టనుందని సీఎం జగన్‌ తెలిపారు. ఈ సమీక్ష సమావేశానికి రాష్ట్ర పంచాయతీ రాజ్‌ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉన్నతాధికారులు హాజరయ్యారు.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement