
కొలువుదీరాయి
జంట నగరాల్లో వివిధ ప్రభుత్వ విభాగాల రాష్ట్ర కార్యాలయాల సందడి మొదలైంది.
జంట నగరాల్లో రాష్ట్ర కార్యాలయాల సందడి
17 ప్రభుత్వ విభాగాల ప్రారంభం
విజయవాడలో 14 శాఖలు, గుంటూరులో రెండు, మంగళగిరిలో ఒకటి
ఇంటర్ బోర్డు రాష్ట్ర కార్యాలయం గుంటూరులో
ఎక్సైజ్, పంచాయతీరాజ్ సహా ఇతర ప్రధాన కార్యాలయాలు బెజవాడలో
విజయవాడ : జంట నగరాల్లో వివిధ ప్రభుత్వ విభాగాల రాష్ట్ర కార్యాలయాల సందడి మొదలైంది. అద్దె భవనాల్లో తాత్కాలిక వసతులు, సౌకర్యాలు చూసుకొని కీలక విభాగాల కార్యాలయాలను ప్రారంభించారు. హైదరాబాద్ నుంచి సోమవారం పెద్ద సంఖ్యలో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు తరలి రావటంతో రెండు నగరాల్లో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల హడావుడితో కోలాహలం నెలకొంది. ఈ నెల 29 కల్లా విజయవాడ, గుంటూరులో అన్ని ప్రభుత్వ రాష్ట్ర శాఖలు ఏర్పాటు కావాలని ప్రభుత్వం ఆదేశించిన నేపథ్యంలో సోమవారం రెండు నగరాల్లో కలిపి 17 ప్రభుత్వ కార్యాలయాలు ప్రారంభమయ్యాయి. విజయవాడలో 14, గుంటూరులో రెండు, మంగళగిరిలో మరోటి ప్రారంభించారు. దీంతో ఆయా శాఖల మంత్రులు, రాష్ట్ర కమిషనర్లతో రెండు నగరాల్లో సందడి వాతావరణం కనిపించింది.
కార్యాలయాలు ఇలా...
ఈ నెల 27 కల్లా హైదరాబాదు నుంచి ఉద్యోగులందరూ తరలిరావాలని తొలుత ప్రభుత్వం డెడ్‌లైన్ విధించింది. తర్వాత 29 వరకు దీనిని పొడిగించింది. ఈ క్రమంలో ముందస్తుగా చేసుకున్న ఏర్పాట్లతో సోమవారం పెద్ద సంఖ్యలో కార్యాలయాలు తరలివచ్చాయి. విజయవాడ నగరంలో కొన్ని కార్యాలయాలు ప్రభుత్వ ప్రాంగణాల్లో, మరికొన్ని నగర శివారుల్లోని అద్దె భవనాల్లో ప్రారంభమయ్యాయి. ముఖ్యంగా బందరు రోడ్డు, ప్రసాదంపాడు, ఇబ్రహీంపట్నం, గొల్లపూడిలో కార్యాలయాలను ఏర్పాటుచేశారు. ప్రసాదంపాడులో ఐదు ఫ్లోర్ల అపార్ట్‌మెంట్‌ను అద్దెకు తీసుకొని దానిలో ఎక్సైజ్ అండ్ ప్రొహిబిషన్ శాఖ రాష్ట్ర కమిషనర్ కమిషనర్ కార్యాలయాన్ని, దానితో పాటు బెవరేజెస్ ఎండీ కార్పొరేషన్ కార్యాలయాన్ని, డెరైక్టరేట్ ఆఫ్ ఎక్సైజ్ అండ్ ఎన్‌ఫోర్స్‌మెంట్ కార్యాలయాలను సోమవారం రాష్ట్ర ఎక్సైజ్ శాఖ మంత్రి కొల్లు రవీంద్ర ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జలవనరుల శాఖ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావుతో పాటు ఎక్సైజ్ శాఖ కమిషనర్ ఎంకే మీనా, ఎంపీ కొనకళ్ల నారాయణ, మేయర్ శ్రీధర్, ఎక్సైజ్ శాఖ డెరైక్టర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు. ప్రసాదంపాడులోని ఏఎన్‌ఆర్ టవర్స్‌లో ఉన్నత విద్యాశాఖ రాష్ట్ర కార్యాలయం, సాంకేతిక విద్య, శిక్షణ మండలి కార్యాలయం, సాంకేతిక విద్యాశాఖ కమిషనరేట్‌లను ఆ శాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు.
ఈ కార్యక్రమంలో ఎంపీ కొనకళ్ల నారాయణ, కమిషనర్ ఉదయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. గొల్లపూడిలోని సాయిపురం కాలనీలో ఆర్‌డబ్ల్యూఎస్ రాష్ట్ర కార్యాలయాన్ని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీహెచ్ అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. ఆయనతో పాటు రాష్ట్ర మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు పాల్గొన్నారు. గొల్లపూడిలోని సాయిపురం కాలనీలో రాష్ట్ర అర్థ గణాంక శాఖ కార్యాలయాన్ని సంస్థ డెరైక్టర్ డాక్టర్ పి.దక్షిణామూర్తి, డిపార్ట్‌మెంట్ ఆఫ్ టూరిజం కమిషనరేట్ కార్యాలయాన్ని ఆ శాఖ డెప్యూటీ డెరైక్టర్ ఎస్.ఉమామహేశ్వరరావు, మైలురాయి సెంటర్‌లోని టీటీడీసీ కార్యాలయ ప్రాంగణంలో సెర్ఫ్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థ) కార్యాలయాన్ని రాష్ట్ర గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి కిమిడి మృణాళిని ప్రారంభించారు. కార్యక్రమంలో రాష్ట్ర మంత్రి దేవినేని ఉమా, సెర్ఫ్ సీఈవో పి.కృష్ణమోహన్ తదితరులు పాల్గొన్నారు. నగరంలోని ఏలూరు రోడ్డులో ఉన్న మారుతీనగర్‌లో రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కార్యాలయాన్ని ఆ శాఖ మంత్రి రావెల కిషోర్ బాబు ప్రారంభించారు. విజయవాడ నగరంలోని నక్కల్ రోడ్డులో ఉన్న చరితశ్రీ హాస్పిటల్ భవనంలో పంచాయతీ రాజ్ శాఖ కమిషనర్ కార్యాలయాన్ని, బందరు రోడ్డులోని పీడబ్ల్యూడీ గ్రౌండ్ ఎదురుగా ఉన్న జెడ్పీ కార్యాలయంలో పంచాయతీరాజ్ చీఫ్ ఇంజనీర్ కార్యాలయాన్ని మంత్రి అయ్యన్నపాత్రుడు ప్రారంభించారు. బందరు రోడ్డులోని ఇందిరాగాంధీ స్టేడియంలో శాప్ తాత్కాలిక కార్యాలయాన్ని శాప్ చైర్మన్ వీఆర్ మోహన్ ప్రారంభించగా, శాప్ ఎండీ రేఖారాణి పాల్గొన్నారు. ఏసీబీ రాష్ట్ర కార్యాలయాన్ని విజయవాడ పండిట్ నెహ్రూ బస్ స్టేషన్‌లోని పై అంతస్తులో ప్రారంభించారు. ఏసీబీ డీజీ మాలకొండయ్యను ఈ ప్రారంభోత్సవం నిర్వహించారు. ఇప్పటికే ప్రారంభమైన ఆర్టీసీ బస్‌భవన్‌కు హైదరాబాద్ నుంచి ఉద్యోగులు సోమవారం తరలివచ్చారు.
గుంటూరులో....
గుంటూరు నగరంలోని లక్ష్మీపురంలో ఇంటర్మీడియట్ రాష్ట్ర కార్యాలయాన్ని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావు, జిల్లాపరిషత్ సమీపంలోని ఎస్పీ కార్పొరేషన్ కార్యాలయం సమీపంలో రాష్ట్ర ఎస్సీ కార్పొరేషన్ కార్యాలయాన్ని మంత్రి రావెల కిషోర్ బాబు ప్రారంభించారు. మంగళగిరిలో రాష్ట్ర గంథ్రాలయ సంస్థ కార్యాలయాన్ని మంత్రి గంటా శ్రీనివాసరావు ప్రారంభించారు.