ఏమి సేతురా లింగా...!!
- ఉద్యోగులకు వరుస కష్టాలు
- ఇటు పరీక్షలు...అటు ఎన్నికలు
- కంటిమీద కునుకు కరువు
విశాఖ రూరల్, న్యూస్‌లైన్: వరుస ఎన్నికలు ప్రభుత్వోద్యోగులకు కంటి మీద కనుకు లేకుండా చేస్తున్నాయి. గతంలో ఎన్నడూ లేని విధంగా ఒకేసారి మున్సిపల్, ప్రాదేశిక, సాధారణ ఎన్నికలు పోటెత్తి మోయలేని పనిభారాన్ని తెచ్చిపెట్టాయి. ప్రధానంగా రెవెన్యూ, పంచాయతీరాజ్, మున్సిపల్ కార్యాలయాల ఉద్యోగులతో సహా పోలీస్, ఎక్సైజ్ శాఖ పాటు మరికొన్ని శాఖల ఉద్యోగులు సొంత పనులను వాయిదా వేసుకోవాల్సి వస్తోంది.
సరదాల మాటెలా ఉన్నా.. శుభకార్యాలను కూడా దూరం పెట్టాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది. మండల స్థాయిలో తహశీల్దార్, ఎంపీడీవోలు మొదలుకొని కలెక్టరేట్, జెడ్పీ, పంచాయతీ, మున్సిపల్ కార్యాలయాల్లో పనిచేసే ప్రతీ అధికారి, ఉద్యోగీ ఎన్నికల విధుల్లో నిమగ్నమయ్యారు. నిముషం కూడా తీరికలేకుండా ఒకదాని తరువాత మరొకటిగా ఎన్నికలు రావడంతో వీరికి క్షణం తీరిక దొరకడం లేదు.
రెవెన్యూపై ఒత్తిడి
సాధారణ ఎన్నికలు వచ్చాయంటే రెవెన్యూ యంత్రాంగానికి నిమిషం కూడా తీరిక ఉండదు. కలెక్టర్ మొదలుకొని ఆర్డీవో, తహశీల్దార్, ఆర్‌ఐ, వీఆర్వో, వీఆర్‌ఏ దాకా అందరికీ ఎన్నికల విధులే. పోలింగ్ స్టేషన్ల గుర్తింపు, కోడ్ ఉల్లంఘన, ఎన్నికల సిబ్బంది నియామకం, ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమలు ఇలా ప్రతి అంశాన్ని వీరు నిశితంగా పరిశీలించాలి.
అటువంటిది ఇప్పుడు మాత్రం సాధారణ ఎన్నికల కంటే ముందుగా మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు నిర్వహించాల్సి వచ్చింది. దీంతో ఈ ఎన్నికల నిర్వహణ బాధ్యత కూడా రెవెన్యూపైనే పడింది. ఇలా రెవెన్యూ అధికారులు, సిబ్బందిపై తీవ్రమైన పని ఒత్తిడి పడింది. ఫలితంగా సాధారణ పరిపాలన పై దృష్టి సారించలేని దుస్థితి నెలకొంది.
‘పోలీసు’ కష్టాలు
ఇక అందరికన్నా ఎక్కువ కష్టపడేది పోలీసులే. సమస్యాత్మక ప్రాంతాల గుర్తింపు నుంచి బందోబస్తు ఏర్పాటు వరకు వీరి పాత్ర కీలకం. ఎక్కడా అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు వీరు పడే కష్టం వర్ణనాతీతం. ఇప్పుడు వరుసగా వచ్చిన ఎన్నికలతో పోలీసులు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇతర శాఖల అధికారులు, సిబ్బంది మాదిరిగా కాకుండా ఈ మూడు ఎన్నికల్లోను వీరు విధులు నిర్వర్తించాల్సి వస్తోంది.
ఒక్కో చోట తినడానికి తిండి కూడా దొరకని పరిస్థితి. అయినప్పటికీ ఇప్పటి వరకు జరిగిన మున్సిపల్, తొలి దశ ప్రాదేశిక ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో జరిగేలా కృషి చేశారు. రెండో దశ జడ్పీ, ఎంపీటీసీతో పాటు సాధారణ ఎన్నికలకు సైతం వీరే విధులు నిర్వర్తించాల్సి ఉంది. వీరితో పాటు ఎక్సైజ్ శాఖ అధికారులు, సిబ్బంది కూడా ఎన్నికల విధుల్లో బిజీగా ఉన్నారు.