తెరపైకి మళ్లీ భూ భారతి
- త్వరలోనే హైదరాబాద్‌లో సమగ్ర భూముల సర్వే
- సింగిల్ విండో సిస్టం కోసం ప్రత్యేక పాలసీ
- ఇండియా ప్రాపర్టీ. కామ్ స్థిరాస్తి ప్రదర్శనలో మంత్రి కేటీఆర్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (టీఆర్‌ఎస్) ప్రభుత్వం రాష్ట్రంలో భూ భారతి కార్యక్రమాన్ని మళ్లీ తెరపైకి తీసుకొచ్చింది. గత ప్రభుత్వాల హయాంలో పరిశ్రమలు, సంస్థలు, ప్రైవేటు వ్యక్తులకు ఇచ్చిన భూముల్లో కొన్నింట్లో టైటిల్స్ క్లియర్‌గా లేకపోవడం, శిఖం భూముల కావటంతో అనేక రకాల పొరపాట్లు జరిగాయని తెలంగాణ ఐటీ, పంచాయతీరాజ్ మంత్రి కే. తారకరామారావు పేర్కొన్నారు.
దీంతో ప్రభుత్వ ఖజానాకు గండిపడటమే కాకుండా భూములు దుర్వినియోగమవుతున్నాయన్నారు. అందుకే త్వరలోనే హైదరాబాద్‌లోని అన్ని భూములపై శాటిలైట్ ద్వారా సమగ్ర సర్వే జరిపిస్తామని చెప్పారు. దీంతో ఎంత మేర ప్రభుత్వ భూములు కబ్జాకు గురయ్యాయో తెలుస్తాయని, దోషులను కఠినంగా శిక్షిస్తామని పేర్కొన్నారు.
శనివారం మాదాపూర్‌లోని హైటెక్స్ ప్రాంగణంలో ఇండియా ప్రాపర్టీ. కామ్ ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్రంలో తొలి స్థిరాస్తి ప్రదర్శనను మంత్రి కేటీఆర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 2020 కల్లా హైదరాబాద్ జనాభా 3 కోట్లకు పైగా చేరుకుంటుందని, అప్పటి మౌలిక వసతులు, ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకొని సమగ్ర నగరాభివృద్ధిని రూపొందిస్తున్నామన్నారు. ఇందుకోసం అంతర్జాతీయ నిర్మాణ సంస్థలు, అకాడమీలతో చర్చించి మాస్టర్‌ప్లాన్‌ను రూపొందిస్తామని చెప్పారు.
ఈ మాస్టర్‌ప్లాన్‌లో శాటిలైట్ టౌన్‌షిప్‌లు, ఐటీ, ఫార్మా, బయో, ఎలక్ట్రానిక్ క్లస్టర్లు, స్పోర్ట్స్ సిటీ, ఆటమైదానాలు, ఎడ్యుకేషన్ హబ్‌లు ఉంటాయని పేర్కొన్నారు. పెరుగుతున్న జనాభా, అవసరాలను దృష్టిలో పెట్టుకొని ప్రస్తుతం ఉన్న ఔటర్ రింగ్ రోడ్‌ను అనుసంధానం చేస్తూ షాద్‌నగర్, భువనగిరి, గజ్వేల్, సంగారెడ్డి, చెవెళ్ల ప్రాంతాల మీదుగా రీజనల్ రింగ్ రోడ్‌ను నిర్మిస్తామన్నారు.
స్థూల దేశీయోత్పత్తి (జీడీపీ)లో 6 శాతం వాటా స్థిరాస్తి రంగాన్ని ప్రోత్సహించేందుకు అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పారు. కార్యక్రమంలో భారత స్థిరాస్తి డెవలపర్ల సమాఖ్య (క్రెడాయ్) జాతీయ అధ్యక్షుడు శేఖర్‌రెడ్డి, ఇండియా ప్రాపర్టీ.కామ్ సీఈఓ గణేష్ వాసుదేవన్, పలువురు బిల్డర్లు పాల్గొన్నారు.